వైసీపీ సిట్టింగ్ సీటు హాంఫట్..?

క‌ర్నూలు జిల్లాలొ గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం చూపించింది. ఈ ఎన్నిక‌ల్లో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాల‌ని [more]

Update: 2019-04-22 01:30 GMT

క‌ర్నూలు జిల్లాలొ గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం చూపించింది. ఈ ఎన్నిక‌ల్లో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాల‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంత్రాల‌యం స్థానంపై తెలుగుదేశం పార్టీ గంపెడాశ‌లు పెట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బాల‌నాగిరెడ్డి గెలిచిన ఈ నియోజ‌కవ‌ర్గంలో ఆయ‌న‌ను ఓడించాల‌ని తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి పాల‌కుర్తి తిక్కారెడ్డి తీవ్రంగా శ్ర‌మించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన గొడ‌వలు ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, మరోసారి మంత్రాల‌యంలో విజ‌యం సాధించాల‌ని వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ప్ర‌య‌త్నించారు.

తిక్కారెడ్డి సెంటిమెంట్ అస్త్రం…

2009లో ఏర్ప‌డ్డ మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టిసారి బాల‌నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరి గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థి తిక్కారెడ్డిపైన 7 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లోనే తిక్కారెడ్డి బాల‌నాగిరెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లోనూ మ‌ళ్లీ వీరిద్ద‌రి మ‌ధ్యే పోటీ జ‌రిగింది. ఎన్నిక‌ల ముందు తిక్కారెడ్డి… బాల‌నాగిరెడ్డి స్వంత ఊరికి ప్ర‌చారానికి వెళ్ల‌గా బాల‌నాగిరెడ్డి వ‌ర్గీయులు, గ్రామ‌స్థులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో గ్రామంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌గా గ‌లాటాలో తిక్కారెడ్డికి బుల్లెట్ గాయ‌మైంది. అయితే, ప్ర‌త్య‌ర్థులే ఈ దాడి చేశార‌ని తిక్కారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ దాడినే ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రంగా మ‌లుచుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స్ట్రెచ్చ‌ర్ పైన గ్రామగ్రామాన తిరిగి ప్ర‌చారం చేశారు. ఆయ‌న భార్య వెంక‌టేశ్వ‌ర‌మ్మ కూడా భ‌ర్త‌ను స్ట్రెచ్చ‌ర్ పైన తీసుకువెళ్లి కొంగు చాచి ఓట్లు అభ్యర్థించారు. ప‌లుమార్లు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో వారి ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి బాగా వ్య‌క్త‌మ‌వుతోంది.

బాల‌నాగిరెడ్డికి బ‌లం ఉన్నా…

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి తిక్కారెడ్డిపై ఇప్ప‌టికే ఉంది. దీంతో ఈసారి తిక్కారెడ్డి గెలుపు క‌ష్ట‌మేమీ కాద‌ని తెలుగుదేశం నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇక‌, ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచిన ఈసారి హ్యాట్రిక్ కొట్టాల‌ని భావిస్తున్నారు బాల‌నాగిరెడ్డి. అయితే, రెండుసార్లు విజ‌యం సాధించినా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని, ప‌క్క‌నే తుంగ‌భ‌ద్ర న‌ది ఉన్నా నియోజ‌క‌వ‌ర్గం తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌నే అసంతృప్తి ఆయ‌న‌పై ఉంది. అయితే, మాస్ లీడ‌ర్ గా ఇమేజ్ ఉన్న ఆయ‌నకు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే ఏక‌ప‌క్షంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఉంటుంది. కానీ, బాల‌నాగిరెడ్డి బ‌లాన్ని ఈసారి మంత్రాల‌యం తిక్కారెడ్డి సానుభూతి అస్త్రం చేదించిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆయ‌న గ‌న్ మెన్ దాడిలోనే బుల్లెట్ తాకింద‌ని, త‌మ‌కేమీ సంబంధం లేద‌ని వైసీపీ నేత‌లు చెప్పుకున్నా తిక్కారెడ్డి ప‌ట్లే ప్ర‌జ‌లు సానుభూతి చూపించారు. మొత్తానికి మంత్రాల‌యంలో ఈసారి తిక్కారెడ్డికే సానుకూల‌త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News