అనామకుడు కాదు…మళ్లీ ఆయనే

మనోహర్ లాల్ ఖట్టర్… అయిదేళ్ల క్రితం వరకు ఆయన పేరు ఎవరికీ తెలియదు. సొంత రాష్ట్రమైన హర్యానాలోనూ ఆయన అపరిచిత వ్యక్తే. సొంత పార్టీ అయిన బీజేపీలోనూ [more]

Update: 2019-10-23 17:30 GMT

మనోహర్ లాల్ ఖట్టర్… అయిదేళ్ల క్రితం వరకు ఆయన పేరు ఎవరికీ తెలియదు. సొంత రాష్ట్రమైన హర్యానాలోనూ ఆయన అపరిచిత వ్యక్తే. సొంత పార్టీ అయిన బీజేపీలోనూ అంత పేరున్న నాయకుడు కాదు. కేవలం ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గానే మనోహర్ లాల్ ఖట్టర్ అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు అటు రాష్ట్రంలో, ఇటు పార్టీలో ఆయన పేరు మార్మోగుతోంది. ఏకధాటిగా అయిదేళ్లపాటు ప్రచారక్ గా పనిచేసిన ఆయన సంపన్న రాష్ట్రమైన హర్యానాకు మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది.

ఖట్టర్ సారథ్యంలోనే….

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ లాల్ ఖట్టర్ సారధ్యంలో బీజేపీ మళ్లీ విజయఢంకా మోగించనుంది. అదే మరో మారు హర్యానా అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని అడ్డుకోవడం ప్రస్తుతానికి అసాధ్యమే. అసలు మనోహర్ లాల్ ఖట్టార్ ముఖ్యమంత్రి కావడమే ఓ విశేషం. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి తొలిసారి సీఎం కావడం అత్యంత అరుదుగా జరుగుతుంది. మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ఘనత సాధించారు. అయిదేళ్ల క్రితం రాజకీయంగా అనామకుడిగా పేరున్న ఆయన కూడా రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నీ తానై నడిపించారు. టిక్కెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అన్ని విషయాల్లో అధిష్టానం మనోహర్ లాల్ ఖట్టర్ కు పూర్తి స్వేచ్చ ఇచ్చింది. దీనిని బట్టి అధిష్టానం ఆయనకు ఎంత గౌరవం, విలువ ఇస్తుందో అర్థమవుతోంది. జాట్ సామాజిక వర్గం బలంగా గల ఈ ఉత్తరాది రాష్ట్రానికి జాట్ సామాజికేతర వర్గం నాయకుడు సీఎం కావడం ప్రత్యేక పరిణామంగా పేర్కొనవచ్చు.

అనామకుడిగా ఉన్నా….

18ఏళ్ల తరువాత 2014లో ఓబీసీ వర్గానికి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. బన్సీలాల్, భజన్ లాల్, దేవీలాల్ త్రయంగా పేరుగాంచిన ఈ ముగ్గురు జాట్ సామాజిక వర్గం నాయకులు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల నాయకులు అయినప్పటికీ 29శాతం జాట్ సామాజిక వర్గంపై నుంచి పట్టు ఉంది. ఇప్పుడు వారు లేనప్పటికీ వారి రాజకీయ వారసులు వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కమలం పార్టీ 2014 ఎన్నికల్లో ఓ ప్రయోగం చేసింది. అప్పటి వరకు క్రియాశాల రాజకీయాల్లోలేని మనోహర్ లాల్ ఖట్టర్ ను తెరపైకి తీసుకువచ్చింది. ‘కర్నాల్’ నియోజకవర్గబరిలోకి దింపింది. మనోహర్ లాల్ ఖట్టర్ కు బదులు స్థానికుడికి టిక్కెట్ఇవ్వాలని నియోజకవర్గంలోని పార్టీ నాయకులు సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ఇందుకు జతకలిశారు.

స్థానికేతరుడే అయినా….

ఖట్టర్ స్థానికేతరుడు, బయటి వ్యక్తి అని ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఆయనను ప్రజలు ఆదరించారు. 63,736 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. ఎన్నికల అనంతరం బీజేపీ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ విలాస్ శర్మ, మాజీ కేంద్ర మంత్రి జాట్ సామాజిక్ వర్గానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ పోటీ పడ్డారు. కానీ ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా ఆశీస్సులతో మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు దక్కాయి. ఇక అప్పటి నుంచి ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అయిదేళ్లపాటు ఏక దాటిగా రాష్ట్రాన్ని పాలించారు. ఆయనపై పార్టీలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ అధిష్టానం ఆశీస్సులతో మనోహర్ లాల్ ఖట్టర్ అయిదేళ్లు పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా….

అయిదేళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇబ్బందులు, చిక్కులు ఎదురైనప్పటికీ రాజకీయంగా ఆయన ప్రస్థానాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవడం విశేషం. బీజేపీ చేసిన జాట్ సామాజిక వర్గేతర రాజకీయం 2014లో విజయవంతం అయింది. నాటి ఎన్నికల్లోచంఢీగఢ్, పంచకుల, అంజాలా, యమునానగర్, కర్నాల్, కురుక్షేత్ర, పానిపట్ ప్రాంతాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. ఈ ప్రాంతంలో జాట్ సామాజికేతర వర్గాలకే ఆధిపత్యం. ఈ ప్రాంతంలో పంజాబీ భాష మాట్లాడే బనియా సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. ఈ సారి కూడా అదే వ్యూహాలతో పార్టీ ముందుకు వెళ్లింది. ఛత్తీస్ బిర్ దారీస్ (36 సామాజిక వర్గాలు) చాలా కాలంగా ఇక్కడ కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నాయి. ఇక హిస్సార్, భెవానీ, మహేంద్రఘర్, రోహతక్, సోనిపత్, జింద్, కైతాల్, ఝజ్జార్ ప్రాంతాల్లో జాట్ సామాజిక వర్గానికి ఆదిపత్యం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్, భూపేందర్ సింగ్ హుడా (కాంగ్రెస్) ఓం ప్రకాష్ చౌతలా (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) ఈ ప్రాంతం నుంచి గెలిచినవారే.

ఈసారి ఎన్నికల్లో మాత్రం….

2014 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అంతగా ప్రభావం చూపలేదనేది వాస్తవం. ఈ సారి పరిస్థితి మారిందని బీజేపీ చెబుతోంది. సామాజిక వర్గ రాజకీయాలను పక్కన పెడితే గత అయిదేళ్లలో మనోహర్ లాల్ ఖట్టర్ పాలన అవినీతికి దూరంగా ఉంది. పలు జిల్లాల్లో మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, 500 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని చెప్పి ఆ దిశగా కొంతవరకు కృషి చేసింది. ప్రజలు తమ సమస్యలపై ఫిద్యాదు చేసేందుకు 24X7 పోర్టల్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆడపిల్లల సంరక్షణకు, భేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని సమర్థంగా మనోహర్ లాల్ ఖట్టర్ అమలు చేశారు. బాల బాలికల నిష్పత్తి దాదాపు సమానంగా ఉండడంతో విజయం సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ ప్రాతిపదికన నియామకాలు చేశారు. మొత్తానికి తన పాలన ద్వారా ప్రజలను మెప్పించిన మనోహర్ లాల్ ఖట్టర్ మళ్లీ సీఎం కావడం ఖాయం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News