ఊపిరి తీసుకోనివ్వడం లేదుగా?

తెలంగాణ కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి. తెలంగాణ ఇన్ ఛార్జిగా మాణికం ఠాగూర్ మాత్రం నేతలకు ఊపిరి సలపనివ్వడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికను [more]

Update: 2020-10-30 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి. తెలంగాణ ఇన్ ఛార్జిగా మాణికం ఠాగూర్ మాత్రం నేతలకు ఊపిరి సలపనివ్వడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికను మాణికం ఠాగూర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ముందున్న లక్ష్యం గెలుపే అయినా బీజేపీని మూడోస్థానంలోకి నెట్టి తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని నిరూపించడం కోసమే మాణికం ఠాగూర్ చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పుకోవచ్చు.

అందరినీ సమానంగా…..

మాణికం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పదవిని చేపట్టిన తర్వాత ఒకవర్గానికి కొమ్ముకాయడం లేదు. కొందరి నేతలకే ఆప్తుడిగా మిగలదలచుకోలేదు. పీసీసీ చీఫ్ నుంచి మామూలు నేత ఒరకూ ఆయన వైఖరి ఒకేలా ఉంటుదన్నది ఆయనను దగ్గర నుంచి గమనించిన వారు చెబుతున్న విషయం. దుబ్బాక ఉప ఎన్నికలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కూడా మాణికం ఠాగూర్ దేనని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ…..

గతంలో ఉన్న ఏ ఇన్ ఛార్జి కూడా మాణికం ఠాగూర్ లా పార్టీలో ఉత్తేజం నింపలేదని అంటున్నారు. నేతల మధ్య విభేదాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఆయన పరిష్కరించడం కూడా కాంగ్రెస్ పార్టీలో జోష్ కు కారణంగా చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక కీలక నేతను ఇన్ ఛార్జిగా నియమించారు. ఎన్నికల వ్యయాన్ని కూడా వారే భరించాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిధులతో పాటు ఆ మండలంలో మరింత అవసరమయ్యే ఖర్చును మండల బాధ్యులే భరించాల్సి ఉంటుంది.

గెలిచినా… ఓడినా….

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రస్తుతం అధికార పార్టీకి ఎడ్జ్ కన్పిస్తున్నా వారికి మెజారిటీపైనే దిగులుపట్టుకుంది. మాణికం ఠాగూర్ టార్గెట్ ఒకటి దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీని గణనీయంగా తగ్గించడం ఒకటి కాగా, రెండో స్థానంలో నిలవడం. మాణికం ఠాగూర్ నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్థితిని సమీక్షిస్తుండటంతో బాధ్యులైన నేతలు సయితం దుబ్బాకను వదిలి రావడం లేదట. మొత్తం మీద చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ నేతలకు ఊపిరి సలసని పనిని ఇచ్చారు మాణికం ఠాగూర్. ఫలితం ఎలా ఉన్నా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపారనే చెప్పాలి.

Tags:    

Similar News