ఖరీదైన కాపీ....!!

Update: 2018-10-25 14:30 GMT

రాజకీయాల్లో అనుసరణ, అనుకరణ సర్వసాధారణం. కాపీ క్యాట్లకు ఇక్కడ కొరత లేదు. ఇప్పుడు కాపీ ఖరీదు చాలా కాస్ట్లీగా మారిపోయింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేశారనే సామెత చందంగా పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. సర్కారీ నిధులపై గంప గుత్త పెత్తనం తమదే అనుకుంటున్న పార్టీలు విచ్చలవిడి ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోల ముచ్చట సాగుతోంది. పోటాపోటీ హామీల హడావిడి ఊపందుకుంది. సంక్షేమ పథకాల విషయంలో పార్టీలు పోటీ పడుతున్నాయి. వాస్తవికంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులోనూ ఒకరినొకరు అనుసరిస్తూ తామే పెద్దన్న అనిపించుకోవాలనే తాపత్రయం తొంగి చూస్తోంది. కాపీ మేనిఫెస్టోలు అత్యంత ఖరీదు అయిన వ్యవహారంగా కనిపిస్తున్నాయి. ప్రజలను ఊహల పల్లకిలో ఊరేగించడమే లక్ష్యంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు.

సంక్షేమమే సవాల్...

మినీ మేనిఫెస్టో పేరిట అధికార తెలంగాణ రాష్ట్రసమితి విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక రాష్ట్ర చరిత్రలోనే రికార్డు హామీగా చెబుతున్నారు. ఇప్పటికే ఖజానాకు అధికభారంగా మారిన సంక్షేమ పథకాల పద్దును మరింతగా పెంచేశారు. తెలంగాణలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కోటికి పైగానే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో అరవై వేలకు పైగా సంక్షేమ పథకాల లబ్ధి దారులున్నారంటూ కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు సైతం అభ్యర్థులకు స్వయంగా అందచేశారు. ప్రచారంలో వీరందరినీ కలవాలనీ నిర్దేశించారు. ఇప్పటికే సంక్షేమపద్దు 45 వేల కోట్ల రూపాయల పైచిలుకుకు చేరింది. కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మరొక 20 వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుంది. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. 2020 నుంచి వాటిని వడ్డీల సహా వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. చెల్లింపుల సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. అయినప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో ఉదారంగా కొత్త హామీలను గుప్పించారు. అమలుపై అనుమానాలు, ప్రశ్నలు అలాగే ఉన్నప్పటికీ ప్రచారం మాత్రం మొదలైపోయింది.

నిధులకు నీళ్లు....

గడచిన నాలుగేళ్లుగా నిధుల వరదను ప్రవహింపచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. లక్షరూపాయల వరకూ రైతు రుణమాపీ తొలి హామీగా అమలు చేశారు. 13 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు, 4 లక్షల మందికి వికలాంగ పింఛన్లు, 14 లక్షల మందికి వితంతు పింఛన్లు, 4 లక్ష ల బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు, 18 లక్షల మందికి ఆరోగ్య లక్ష్మి, మూడున్నర లక్షల మందికి కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటీవలనే ఎకరానికి రెండు పంటల్లో ఎనిమిదివేల రూపాయలు ఇచ్చేలా రూపొందించిన రైతు బంధు పథకాన్ని 49 లక్షల మంది రైతులకు వర్తింపచేస్తున్నారు. 28 లక్షల మందికి రైతు బీమా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఆయా పథకాల భారం తడిసిమోపెడవుతోంది. మరింతగా విస్తరించేందుకు తాజా మినీమేనిఫెస్టో ప్రకటించారు. నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల పైచిలుకు ప్రకటించారు. పింఛన్ల మొత్తాన్ని రెండువేల రూపాయలకు పెంచారు. మళ్లీ లక్ష రూపాయల వరకూ రైతుకు రుణమాఫీ ప్రకటించారు. గతంలో ఎకరాకు ఎనిమిదివేల రూపాయలు ప్రకటించిన రైతు బంధు పథక సహాయాన్ని పదివేలకు పెంచారు. వీటన్నిటినీ అమలు చేయాలంటే బడ్జెట్ ను రెట్టింపు చేసుకోవాలి. మరో రెండేళ్లలో చెల్లింపుల ప్రక్రియ మొదలవుతుంది. సాధ్యాసాధ్యాల సంగతిని పక్కనపెట్టి ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

కమిషన్ కథాకేళి...

ఎన్నికల మేనిఫెస్టోలను తమకు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలను ఆదేశించింది. ఆచరణ సాధ్యం కాని హామీలను పార్టీలు ప్రజలపై ప్రయోగించి ప్రలోభపెట్టకుండా నివారించేందుకు ఈ నిబంధనను విధించారు. కానీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మేనిఫెస్టో అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వానికి సమకూరతాయని ఘంటాపథంగా చెప్పేశారు. పైపెచ్చు ఇది మినీ మేనిఫెస్టో అని ప్రకటించారు. కాంగ్రెసు పార్టీ లేదా మహాకూటమి తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన తర్వాత అవసరమైతే మేనిఫెస్టోను తిరిగి సవరించుకునే వెసులుబాటును కేసీఆర్ తనవద్దనే రిజర్వుగా ఉంచుకున్నారు. మినీ మేనిఫెస్టో నుతమ వద్ద నుంచి కేసీఆర్ కాపీ కొట్టేశారని కాంగ్రెసు ఆరోపిస్తోంది. నిరుద్యోగులకు భృతి, పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ ఆలోచనలు తమవే నంటోంది. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో యత్నాల్లో ఉండగానే కేసీఆర్ తమ ప్రణాళికను ప్రకటించేశారు. దీంతో మళ్లీ కాంగ్రెసు పునరాలోచనలో పడింది. సంక్షేమ పథకాలను పునర్నిర్వచించి టీఆర్ఎస్ కంటే అధికమొత్తాలను ప్రకటించాలనే యోచన చేస్తోంది. బడ్జెట్ తో సంబంధం లేని ఈ పోటీ కారణంగా భవిష్యత్తులో తెలంగాణ పూర్తిగా రుణ సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అమలు చేయలేకపోతే రాజకీయ పార్టీల విశ్వసనీయత మరింతగా దిగజారుతుంది. యథావిధిగా ఎన్నికల కమిషన్ ప్రేక్షకపాత్రలోకి కుదించుకుపోకతప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News