మోదీ వెళ్లి వచ్చారు...ఇక ఓడినట్లేనా.....?

Update: 2018-11-28 16:30 GMT

మధ్యప్రదేశ్ లోని మంససౌర్ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీ నెలకొంది. వాస్తవానికి ఇది కమలం కంచుకోట. గతంలో పలువురు ఉద్దండులు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మందసౌర్ నుంచి గెలిచిన సుందర్ లాల్ పట్వా, వీరేంద్రకుమార్ సక్లేచా, కైలాస్ నాధ్ కట్జూ వంటి ఉద్దండులు ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. 2003 నుంచి కమలం పార్టీ ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తోంది. 2013లో బీజేపీ అభ్యర్థి యశ్ పాల్ సింగ్ సిసోడియా పాతిక వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ గుర్జార్ పై గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా యశ్ పాల్ సింత్ సిసోడియా, కాంగ్రెస్ నుంచి నరేంద్ర సహతా, బీఎస్పీ అభ్యర్థిగా ఈశ్వర్ కుశ్వానా పోటీ పడుతున్నారు. మరికొంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటకీ వారి ప్రభావం పరిమితమే.

రైతులు తిరగబడతారా?

పైవివరాలను విశ్లేషిస్తే కమలానికి ఈ నియోజకవర్గం కంచుకోట అన్న సంగతి ఇట్టే అర్థమవుతుంది. కానీ మారిన పరిస్థితుల్లో అది గత చరిత్రగా మిగిలిపోతుందన్న విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఇందుకు బలమైన కారణాలు చూపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఏడాది గిట్టుబాటు ధరల కోసం రైతులు జరిపిన ఆందోళనలతో ఈ ప్రాంతం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అన్నదాతలు అసువులు బాశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఆందోళన సరిహద్దు ప్రాంతాలకు విస్తరించింది. దీంతో ఈ ప్రాంతవాసులు బీజేపీ ప్రభుత్వంపై, కమలం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. రైతులను శాంతింప చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రైతుల సంక్షేమానికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. కాల్పుల్లో మరణించిన వారికి కోటిరూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. అయినా రైతుల ఆగ్రహం చల్లారలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కమలనాధులకు కంగారు పుట్టిస్తున్నాయి. కర్షకుల ఆగ్రహం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.

వెల్లుల్లి ఘాటుకు....

మాళ్వా ప్రాంతంలో విస్తరించిన మందసౌర్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఔషధ అవసరాల కోసం పండించే ఓపీఎం పంట ఇక్కడ విస్తారంగా సాగు చేస్తారు. ప్రభుత్వ అనుమతి పొందిన రైతులే ఈ పంట సాగుచేయాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో లైసెన్సుల జారీ, పంటసాగు, పర్యవేక్షణ జరుగుతుంది. ఓపీఎంతో పాటు వెల్లుల్లిని విస్తృతంగా సాగు చేస్తారు. 2017 నుంచి మందసౌర్ మార్కెట్లో ఈ పంట ధర దారుణంగా పడిపోయింది. 2016లో క్వింటాల్ ధర రూ.10 వేలు ఉండేది. ప్రస్తుతం దీని ధర దారుణంగా పడిపోయింది. ఈ విషయంలో కమలనాధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. కర్షకులు కన్నెర్ర చేస్తే తమ పని కష్టమేనని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ పెద్దలు చేపట్టిన నష్టనివారణ చర్యలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.

సామాజిక సమీకరణలు కూడా.....

సామాజిక వర్గ సమీకరణలు కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేవు. హిందువులు, ముస్లింలు, జైనులు అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కులాల పరంగా చూస్తే రాజపుత్రులు, సింధియాలు, పటీదార్లు, చమర్లు నియోజకవర్గంలో విస్తరించి ఉన్నారు. ఇప్పటి వరకూ హిందువులు, రాజపుత్రుల ఓట్లతో కమలం పార్టీ గట్టెక్కుతూ వస్తోంది. అయితే ఈసారి సమీకరణల్లో స్పష్టమైన మార్పు కనపడుతోంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంలో కొన్ని అంశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చట్టలంలోని అంశాలను యధాతధ స్థితిలో కొనసాగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. దీనిపై అగ్రవర్ణాల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రదర్శనలను నిర్వహించారు. నిన్న మొన్నటి దాకా వీరి మద్దతుతోనే కాషాయ పార్టీ ఎన్నికల తీరాలను దాటుతోంది. ఇప్పుడు వీరు దూరమవ్వడంతో కచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే పరిణామమే. వీరు "సపాక్స్" పేరుతో ఆవిర్భవించిన కొత్త పార్టీకి దన్నుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ వ్యూహాత్మకంగా జైన్ మతస్థుడైన నరేంద్ర సహతాను తన అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో కమలం కంగుతింది.

ప్రధాని ప్రచారం చేస్తే......

మొత్తం ఓటర్లలో 1,24,897 మంది పురుషులు కాగా, మహిళలు1,20,239 మంది. ఎస్సీలు 16, ఎస్టీలు 2 శాతం మంది ఉన్నారు. ఇక నియోజకవవర్గ పరంగా ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ ప్రధాని ప్రచారం చేసినా ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతారన్న ప్రచారం ఉంది. 1989లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రచారానికి రాగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 1998లో నాటి ప్రధాని వాజ్ పేయి ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించగా బీజేపీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న మందసౌర్ లో పర్యటించారు. దీంతో ఏమి జరుగుతుందోనని కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంటు ఫలిస్తుందేమోనని లోలోపల మదన పడుతున్నారు. సెంటిమెంట్ ను పక్కన పెడితే, ప్రజావ్యతిరేకత, రైతుల్లో అసంతృప్తి కమలనాధులను కంగుతినిపిస్తాయని, తమకు మేలు చేస్తాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇది తేలాలంటే వచ్చే నెల 11వ తేదీ వరకూ ఆగక తప్పదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News