“మండ‌లి”కి పొగ‌బెడుతున్న యువ నేత

రాజ‌కీయాల్లో అంతో ఇంతో దూకుడు త‌ప్పదు. పైగా రోజులు మారిన‌ట్టే.. రాజ‌కీయాలు కూడా మారిపోయాయి. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ప‌రిణామం చోటు చేసుకున్నా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునేవాడే [more]

Update: 2020-09-12 05:00 GMT

రాజ‌కీయాల్లో అంతో ఇంతో దూకుడు త‌ప్పదు. పైగా రోజులు మారిన‌ట్టే.. రాజ‌కీయాలు కూడా మారిపోయాయి. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ప‌రిణామం చోటు చేసుకున్నా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునేవాడే నాయ‌కుడు అనే భావ‌న ప్రజ‌ల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇంకా మౌనంగానే ఉంటాను. వ‌చ్చేవారే నాద‌గ్గర‌కు వ‌స్తారు. నేను మాత్రం గ‌డ‌ప‌దాట‌ను.. మా తాత‌ల పేరుతో ఇంకా కోట‌ల్లోనే ఉంటాను అనే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి. త‌మ‌నేత‌ నిత్యం ప్రజ‌ల్లో ఉండాల‌ని, ఓడినా.. గెలిచినా.. త‌మ మొర వినాల‌ని ప్రజ‌లు ఎదురు చూస్తున్న రోజులు ఇవి.

అధికారంలో ఉన్నా…..

అయితే, దీనికి భిన్నంగా కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ మాజీ ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ ప్రసాద్ వ్యవ‌హ‌రిస్తున్నారు. 2014లో ఆయ‌న త‌మ రాజ‌కీయ క‌ల్ప వృక్షం కాంగ్రెస్‌ను వ‌దిలేసి టీడీపీ పంచ‌న చేరిపోయారు. ఈ క్రమంలోనే గెలుపు గుర్రం ఎక్కి.. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని సైతం సాధించారు. ఐదేళ్ల పాటు మండ‌లి బుద్ధ ప్రసాద్ టీడీపీలోనే ఉన్నా జిల్లా టీడీపీ నేత‌ల‌ను మాత్రం ఆయ‌న ప్రతిప‌క్షంగానే చూసేవారు. నాడు జిల్లా మంత్రి దేవినేని ఉమాతో మండ‌లి బుద్ధ ప్రసాద్ కు అస్సలు పొస‌గ‌లేదు. ఐదేళ్ల పాటు వారు ఎడ‌మొఖం పెడ‌మొఖంగానే ఉన్నారు.

కేర్ తీసుకుంటుండటంతో….

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కుమారుడిని రంగంలోకి దింపాల‌నుకున్నా సాధ్యం కాలేదు. మండ‌లి బుద్ధ ప్రసాద్ పోటీ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ త‌ర‌ఫున సింహాద్రి ర‌మేష్ విజ‌యం సాధించారు. నిజానికి 2014లో మండ‌లి బుద్ధ ప్రసాద్ పై ఓడిపోయిన సింహాద్రి..ప‌ట్టుబ‌ట్టి ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కడం గ‌మ‌నార్హం. ఇక‌, అప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంపై ఉన్న మండ‌లి బుద్ధ ప్రసాద్ ముద్రను చెరిపేసే ప్రయ‌త్నం చేశారు. నిత్యం ప్రజ‌ల్లో ఉంటోన్న ఆయ‌న ఉన్నత విద్యావంతుడు కావ‌డంతో చిన్న విష‌యంపై కూడా కేర్ తీసుకుంటున్నారు. పించ‌న్ అందుతోందో లేదో స్వయంగా ఆయ‌నే వెళ్లి తెలుసుకుంటున్నారు. రేష‌న్‌పంపిణీ వ్యవ‌హారంలోనూ ఆయ‌న ప‌ర్యవేక్షణ బాగుంద‌ని నియోజ‌క‌వ‌ర్గంలోనే టాక్ వినిపిస్తోంది.

రోజురోజుకూ తరుగుతూ….

ఒక ర‌కంగా చెప్పాలంటే.. యువ నాయ‌కుడు దూకుడు పెంచార‌నే అనాలి. దీంతో ఇప్పటి వ‌ర‌కు ఇక్క‌డ ఉన్న మండ‌లి బుద్ధ ప్రసాద్ ముద్ర దాదాపు చెరిగిపోతోంద‌నే అనాలి. ఈ నియెజ‌క‌వ‌ర్గంలో మండ‌లి బుద్ధ ప్రసాద్ రాజ‌కీయం నాలుగు ద‌శాబ్దాల‌కు పైగానే ఉంది. బుద్ధ ప్రసాద్ తండ్రి మండ‌లి వెంక‌ట కృష్ణారావుకు ఇక్కడ తిరుగులేని పేరు ఉంది. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్రసాద్ సైతం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రి, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వులు అధిరోహించారు. అలాంటి దివిసీమ‌లో ఇప్పుడు మండ‌లి ఫ్యామిలీ ప్రభ చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.

మసక బారుతోంది…

ఓ వైపు సింహాద్రి ర‌మేష్ దూకుడు ముందే మండ‌లి బుద్ధ ప్రసాద్ ఏం చేయ‌లేక మౌనంగా ఉంటోన్నా కూడా మ‌రోవైపు త‌న కుమారుడిని రాజ‌కీయ రంగ ప్రవేశం చేయించాల‌ని చూస్తున్నారు. వార‌సుడిని ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి దించాల‌ని చూస్తున్నా కూడా మండ‌లి బుద్ధ ప్రసాద్ అందుకోసం కార్యాచ‌ర‌ణ లేకుండా, ఉలుకు ప‌లుకు లేకుండా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నారో.. విజ‌య‌వాడ‌లో ఉంటున్నారో ? హైద‌రాబాద్‌లో ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమైనా సింహాద్రి ర‌మేష్ రాజ‌కీయం ముందు మండ‌లి రాజ‌కీయం మ‌స‌క బారుతున్నట్టే ఉంది.

Tags:    

Similar News