ఆయనను తప్పించాల్సిందే.. మళ్లీ టిక్కెట్ ఇస్తే ఇంతేసంగతులు

కృష్ణాజిల్లా టీడీపీలో ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిందా ? చంద్రబాబు న‌మ్ముకున్న నాయ‌కులు ఆయ‌న‌కు, పార్టీకి అన్యాయం చేస్తున్నారా ? చంద్రబాబును, పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల‌కు చంద్రబాబు [more]

Update: 2020-04-18 14:30 GMT

కృష్ణాజిల్లా టీడీపీలో ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిందా ? చంద్రబాబు న‌మ్ముకున్న నాయ‌కులు ఆయ‌న‌కు, పార్టీకి అన్యాయం చేస్తున్నారా ? చంద్రబాబును, పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల‌కు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారా ? అంటే.. తాజా ప‌రిణా మాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. మిగిలిన జిల్లాల‌లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ కృష్ణాలోని అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని అంద‌రూ అంటున్నారు. ఇక్కడ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా మాజీ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ధ ప్రసాద్ ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. అయితే, ఆయ‌న యాక్టివ్‌గా నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. ఏదో విజిటింగ్ నాయ‌కుడిగా మారార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ వర్గాన్ని దూరం పెట్టడంతో…

పైగా మండ‌లి టీడీపీలో ఉన్నప్పటికీ ఆయ‌న‌తో క‌లిసి ముందుకు సాగుతున్న నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఆయ‌న‌తో క‌లుద్దామ‌ని ప్రయ‌త్నిస్తున్నా.. ఆయ‌న అవ‌కాశం ఇవ్వడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జ‌రుగు తున్నప్పటికీ.. ఇక్కడ మాత్రం ముందుకు సాగ‌డం లేదు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. సింహాద్రి స‌త్యనారాయ‌ణ ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై మూడు సార్లు, అంబ‌టి బ్రాహ్మణయ్య రెండు సార్లు, అంబ‌టి శ్రీహ‌రి ప్రసాద్ ఒక‌సారి విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మండ‌లి బుద్ధ ప్రసాద్ గెలిచినా త‌ర్వాత అంబ‌టి వ‌ర్గం ( పాత టీడీపీ వ‌ర్గం) తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ఓ సామాజిక వ‌ర్గాన్ని దూరం పెట్టేశారు.

అందుకే ఓటమి పాలయ్యానని….

ఐదేళ్ల పాటు ఆయ‌న ఉప‌సభాప‌తిగా ఉన్నా అప్పటి మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుతో రాజ‌కీయ వైరం నేప‌థ్యంలో కూడా పార్టీకి, బుద్ధ ప్రసాద్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మైన‌స్ అయ్యింది. ఇక‌, గ‌త ఏడాది ఎన్నికల్లోనూ మండ‌లికే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయ‌న ఓడిపోయారు. అయితే, అప్పటి నుంచి కూడా నియొజ‌క‌వ‌ర్గంలో పెద్దగా క‌నిపించ‌డం లేదు. అయితే, ఇక్కడ అంబ‌టి వ‌ర్గాన్ని… నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని మండ‌లాల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాన్ని క‌లుపుకుని పోయినా పార్టీ మ‌రీ అంత డీలా ప‌డి ఉండేది కాద‌న్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి…..

ఇక ఓట‌మి త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై సందేహంతో ( నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే ప్రచారం జ‌రుగుతోంది ) మండ‌లి బుద్ధ ప్రసాద్ అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలోనూ చొర‌వ‌ చూపించ‌లేక పోతున్నారు. అనారోగ్య స‌మ‌స్యల‌తో ఉన్న మండ‌లి ఇప్పుడు నియ‌జ‌క‌వ‌ర్గం మొహం చూడ‌డం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నాధుడు క‌నిపించ‌డం లేదు. మండ‌లిని త‌ప్పిస్తేనే త‌ప్ప తాము జోక్యం చేసుకోబోమ‌ని కొంత‌మంది బ‌ల‌మైన నేత‌ల వ‌ర్గం క‌రాఖండీగా స్పష్టం చేస్తోంది. ఇటీవ‌ల పార్టీ వ్యవ‌స్థాప‌క దినోత్స‌వం రోజు కూడా ఎవ‌రూ ఇక్కడ పార్టీ ప‌తాకాన్ని ఎగ‌రేయ‌క‌పోవ‌డం తీవ్ర చ‌ర్చకు దారితీసింది. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా చ‌ర్యలు తీసుకోవాల‌ని స‌రిదిద్దాల‌ని ఇక్కడి వారు కోరుతున్నారు.

Tags:    

Similar News