`మండ‌లి` అన్నది నిజమేనా…?

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు అతిగా మాట్లాడినా.. వార్తే.. అస్సలు మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నాకూడా వార్తే! ఇదే ఇప్పుడు కృష్ణాజిల్లాలో చ‌ర్చకు దారితీసింది. ఈ జిల్లాకు చెందిన కీల‌క [more]

Update: 2019-07-13 03:30 GMT

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు అతిగా మాట్లాడినా.. వార్తే.. అస్సలు మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నాకూడా వార్తే! ఇదే ఇప్పుడు కృష్ణాజిల్లాలో చ‌ర్చకు దారితీసింది. ఈ జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, టీడీపీ త‌ర‌ఫున 2014లో విజ‌యం సాధించి తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని అలంక‌రించిన మండ‌లి బుద్ధప్రసాద్ రాజ‌కీయాల‌పై స‌ర్వత్రా చ‌ర్చకు వ‌స్తోంది. తండ్రి కృష్ణారావు రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని కాంగ్రెస్ వేదిక‌గా రాజ‌కీయాలు చేసిన బుద్ధ ప్రసాద్.. రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా గ‌ళం వినిపించారు.

టీడీపీ తీర్థం పుచ్చుకుని…..

అయితే, రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో ద‌శాబ్దాల అనుబంధాన్ని పెన‌వేసుకున్న కాంగ్రెస్‌ను సైతం ప‌క్కన పెట్టి మండ‌లి బుద్ధప్రసాద్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్రమంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సౌమ్యుడు, వివాద ర‌హితుడుగా పేరు తెచ్చుకున్న మండ‌లి బుద్ధప్రసాద్.. టీడీపీలోనూ అదే పంథా కొన‌సాగించారు. చంద్రబాబు ప‌ట్ల ఎంతో విధేయ‌త‌తో మెలిగారు. డిప్యూటీ స్పీక‌ర్‌గా త‌న విధుల‌ను నిబద్ధతతో నిర్వహించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రోసారి చంద్రబాబు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవ‌నిగ‌డ్డ నుంచి టికెట్ ఇచ్చారు. అయితే జ‌గ‌న్ సునామీలో ఈయ‌న కూడా కొట్టుకు పోయారు. వైసీపీ అభ్యర్థి ముందు ఓడిపోయారు.

రాజకీయాలకు దూరమవుతారా…?

అయితే, మండ‌లి బుద్ధప్రసాద్ తన ఓట‌మి త‌ర్వాత ఎక్కడా క‌నిపించ‌క పోవ‌డం చ‌ర్చకు దారితీస్తోంది. ఓడిపోయిన వారిలో చాలా మంది మాదిరిగానే ఆయ‌న‌కూడా పార్టీ అధినేత‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, దూరంగా ఉన్నవారి మాదిరిగానే ఆయ‌న కూడా పార్టీ మారిపోతారా? లేక కొంత ఆల‌స్యంగానైనా ఓట‌మి భారాన్ని దించుకుని పార్టీలోనే కొన‌సాగుతారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది అభిప్రాయం ప్రకారం. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మండ‌లి.. త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌ని ప్రక‌టించిన‌ట్టు తెలుస్తోంది. అంటే గెలిచినా.. ఓడినా.. ఇక, రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని ఆయ‌న ఇప్ప‌టికై డిసైడ్ చేసుకున్నార‌ని అంటున్నారు.

ఇంకా సస్పెన్స్ గానే….

అయితే, దీనిపై మండ‌లి బుద్ధప్రసాద్ ఎక్కడా ఎలాంటి బ‌హిరంగ ప్రక‌ట‌నా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా స‌న్యాసం తీసుకుంటార‌నే విష‌యంపై క్లారిటీ లేదు. ఇక‌, అదే స‌మ‌యంలో ఆయ‌న తాను త‌ప్పుకొన్నా.. త‌న కుమారుడిని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌స్తార‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. దీనిపైనా మండ‌లి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జిల్లా టీడీపీ నాయ‌కుల్లో కీల‌క నేత‌ల‌తో ఆయ‌న‌కు ఉన్న గ్యాప్ నేప‌థ్యంలో కూడా ఆయ‌న మౌనంగా ఉంటున్నట్టు మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. సో.. మొత్తానికి మండ‌లి పొలిటిక‌ల్ డెసిష‌న్‌, డెస్టినేష‌న్ ల‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

Tags:    

Similar News