మమతకు ఆ దిగులు లేదట

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫుల్లు ఎనర్జీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారావిడ. వరసగా బీజేపీ ఓటమి పాలు కావడం, ప్రశాంత్ [more]

Update: 2020-02-16 18:29 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫుల్లు ఎనర్జీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారావిడ. వరసగా బీజేపీ ఓటమి పాలు కావడం, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సక్సెస్ అవుతుండటం ఇందుకు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మమత బెనర్జీ తేల్చుకుందాం రా అనే పరిస్థితుల్లోకి వచ్చేశారు. ఇందుకు కారణాలు అనేకం. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో పాటు తన పార్టీ నుంచి కాంగ్రెస్ కు ఓట్లు బదిలీ కావన్న నమ్మకమేనంటున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో…..

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాప చుట్టేసింది. గెలవలేని పార్టీకి ఓటు వేయడం ఎందుకన్న ధోరణిలో ఉన్న ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూశారు. ఇదే తరహా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోనూ రిపీట్ అవుతుందని మమత బెనర్జీ గట్టి నమ్మకంతో ఉన్నారు. బీజేపీ వరసగా రాష్ట్రాలు కోల్పోతుండటం తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న విషయాన్ని మమత బెనర్జీ పదే పదే గుర్తు చేస్తున్నారు.

పీకే వ్యూహాలు కూడా….

మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో రంగంలోకి దిగింది. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేటు పెరుగుతుండటంతో మమత బెనర్జీలో గెలుపుపై మరింత ధీమా పెరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాలు రావడంతో కొంత కంగారు పడిన మమత బెనర్జీ మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి కొంత ఊరట చెందారు. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలను గెలిచిన బీజేపీ కేవలం 8 స్థానాలకే అసెంబ్లీ ఎన్నికల్లో పరమితమవ్వడం చూస్తుంటే పశ్చిమ బెంగాల్ లోనూ అదే రీతిలో పోలింగ్ కొనసాగుతుందని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు….

నిజానికి బీజేపీ పశ్చిమబెంగాల్ లో బీజేపీ పట్టుబిగించింది. కాంగ్రెస్, వామపక్షాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ కు మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత బెనర్జీ మరింత దూకుడు పెంచారు. బీజేపీ ఇప్పటికే మిషన్ 250 ను ప్రారంభించడంతో మమత తొలినాళ్లలో కొంత ఇబ్బంది పడినా వస్తున్న ఫలితాలు మమత బెనర్జీని సంతోష పెడుతున్నాయి. దీంతో ఆమె మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News