దీదీ ఆటలో ప‘వార్’అవుట్…?

మమతా బెనర్జీ తెలివిగా పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించేసినట్లే. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేత్రిగా ఉన్న తనను పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ గా నూ నియమించేసుకున్నారు. [more]

Update: 2021-07-30 16:30 GMT

మమతా బెనర్జీ తెలివిగా పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించేసినట్లే. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేత్రిగా ఉన్న తనను పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ గా నూ నియమించేసుకున్నారు. ముచ్చటగా మూడు పదవులు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ తానే చక్రం తిప్పదలచుకున్నట్లు స్పష్టంగా చెప్పేశారు. దేశంలో రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చే పని స్వయంగా చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే శరద్ పవార్ ఆశలపై మమత నీళ్లు చల్లేశారు. మోడీకి ప్రత్యామ్నాయం లేని స్థితిలో తనను సింగిల్ లీడర్ గా విపక్షాలు ప్రొజెక్టు చేస్తాయని పవార్ ఆశపడ్డారు. మోడీకి అప్పోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకులు కాదని , దేశం మొత్తంలోని పార్టీలన్నీ కలవాలని దీదీ తన మనసులోని మాట చెప్పేశారు. కట్టబోయే కూటమికి సింగిల్ లీడర్ ఉండరు. మోడీ వర్సస్ దేశం అన్న కొత్త భావనకు మమతా బెనర్జీ భాష్యం చెప్పారు. ఎలాగూ కీలక పాత్రలోకి వచ్చేశారు కాబట్టి తాను కూడా పీఎం రేసులో ఉన్నట్లే. కాంగ్రెసు అగ్రనాయకులిద్దర్నీ కలిసి తన అబిప్రాయాలను వారితో పంచుకున్నారు. తక్షణం ఢిల్లీని శాసించాలని అనుకోవడం లేదు. కానీ అందర్నీ కలుపుకుని పోవడం ద్వారా తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలనే ఎత్తుగడ కనిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీలపై ‘మమత…

ఇప్పటికిప్పుడు అంతా కలిసి రాకపోయినా ప్రయత్నాలు కొనసాగించాలని సోనియా, మమతా బెనర్జీ నిర్ణయించినట్లు సమాచారం. దేశంలో మోడీకి వ్యతిరేకత పెరుగుతోంది. అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ముందుకు వచ్చేందుకు సాహసించే స్థితిలో లేవు. 2023 నాటికి స్పష్టత రావచ్చు. ఎన్నికలకు ఏడాది, ఆరునెలల ముందు పార్టీల పునస్పమీకరణకు ఛాన్సులు ఉంటాయి. ఆ దిశలో ఇప్పట్నుంచే సంబంధాలను పటిష్టం చేసుకోవాలని కాంగ్రెసు, తృణమూల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మాయావతి, కేసీఆర్ వంటి వారితో సంప్రదించే బాధ్యతను మమతా బెనర్జీ తనపైనే వేసుకున్నట్లు సమాచారం. 2022లో అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు కూటమికి అనుకూలంగా కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే విపక్షాల మధ్య విభేదాలు రాకుండా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఆయా రాస్ట్రాల డిమాండ్లకు జాతీయ స్తాయి మద్దతును ఇవ్వాలని కాంగ్రెసుకు దీదీ సూచించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు కెప్టెన్సీ…

నేల విడిచి సాము చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలని ఉవ్విళ్లూరి ఢిల్లీలో పట్టు పోగొట్టుకున్నారు. మళ్లీ తన ప్రాధాన్యాలను సవరించుకున్న తర్వాతనే దేశ రాజధానిలో హవా చాటగలిగారు. అందుకే దేశం మొత్తం పై రాజకీయంగా ప్రభావం చూపగల కాంగ్రెసు పార్టీనే ప్రస్తుతానికి విపక్ష రాజకీయాలకు కెప్టెన్ పాత్ర పోషించాల్సిందిగా మమతా బెనర్జీ కోరినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే ఇందుకు అవసరమైన సందర్బాల్లో కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. కేరళ, తెలంగాణ వంటి చోట్ల కాంగ్రెసు పార్టీకి స్థానికంగా ఉన్న అధికార పక్షాలతో ఇబ్బందులున్నాయి. వాటికి పరిష్కారం కూడా లేదు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ వాతావరణం ఉంది. అక్కడ బీజేపీ వ్యతిరేక శక్తులకు కాంగ్రెసు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇవ్వాలనేది ఆలోచన. ఇదే అంశాన్ని గతంలో రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిశోర్ సైతం సూచించారు. మమతా బెనర్జీ ఫార్ములా కూడా అదే. దీనివల్ల కొన్ని చోట్ల కాంగ్రెైసు పార్టీ నష్టపోయినా బలమైన జాతీయ ప్రత్యామ్నాయానికి ఆస్కారం ఏర్పడుతుంది.

సర్దుబాట్లు.. దిద్దుబాట్లు..

ప్రస్తుతం ఒక కూటమిగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఆవిష్కరించాలనుకుంటున్న పార్టీలన్నీ ఏదో ఒక సందర్భంలో కలిసి పని చేశాయి. పదేళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెసు అధికారంలో ఉండటానికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత వాటి మధ్య ఏర్పడిన విభేదాలు, ఆధిపత్య ధోరణుల కారణంగా విడిపోయాయి. మమతా బెనర్జీ యువజన కాంగ్రెసు నాయకురాలిగా తన పోరాటాన్ని ఆ పార్టీ నుంచే ప్రారంభించారు. యూపీఏలోనూ మంత్రిగా పనిచేశారు. వామపక్షాలు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందంతో బయటికి వచ్చేశాయి. సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెసుతో కలిసి ఉత్తరప్రదేశ్ లో బీజేపీపై పోటీ చేసింది. టీఆర్ఎస్ సైతం యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించింది. అందువల్ల కూటమి కట్టడం అసాధ్యమేమీ కాదు. కానీ కొన్ని సర్దుబాట్లకు, దిద్దుబాట్లకు సిద్దమవ్వాలి. అప్పుడే కూటమి ప్రయత్నాలు పలిస్తాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News