మూడింటిలో మమత ఎక్కడి నుంచి అంటే?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఒంటి చేత్తో పార్టీకి విజయం సాధించి పెట్టిన ఆమెకు నందిగ్రామ్ లో ఓటమి [more]

Update: 2021-05-19 16:30 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఒంటి చేత్తో పార్టీకి విజయం సాధించి పెట్టిన ఆమెకు నందిగ్రామ్ లో ఓటమి మింగుడు పడటం లేదు. అయినా ఎన్నికల ఫలితాన్ని అంగీకరించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఈ ఓటమి ఆమెకు అడ్డంకి ఏమీ కాదు. మెజార్టీ శాసనసభ్యుల మద్దతు గల మమతను సీఎం కాకుండా అడ్డుకోవడం అసాధ్యం. మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

శాసనమండలి పునరుద్ధరణ…?

కానీ రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో మమతా బెనర్జీ చట్టసభకు ఎన్నిక కావలసి ఉంటుంది. ఇది అనివార్యం. ఈ నేపథ్యంలో చట్టసభకు ఎన్నికయ్యేందుకు మమత గట్టి కసరత్తు చేస్తున్నారు. తనకున్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సలహాదారులతో సంప్రదిస్తున్నారు. రాష్ట్రాల్లో రెండో చట్టసభ అయిన శాసనమండలి ఉంటే దానికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండేది. శాసనసభ్యుల కోటాలోనో, నామినేటెడ్ కోటాలోనో పెద్దల సభకు ఎన్నికవడం ద్వారా రాజ్యాంగపరమైన ఇబ్బందిని అధిగమించేది. కానీ బెంగాల్ శాసనమండలిని 1969లో నాటి కాంగ్రెస్ సర్కారు రద్దు చేయడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే మండలిని పునరుద్దరించే అవకాశం లేదు. దానిని పునరుద్ధరించడం కేంద్రం చేతుల్లో ఉంది. మమతా బెనర్జీ రాజకీయ శత్రువైన భారతీయ జనతా పార్టీ దిల్లీలో చక్రం తిప్పుతున్నందున అది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ కేంద్రం సుముఖంగా ఉన్నా సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు.

మూడు స్థానాలు ఖాళీ….

ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ముందున్న అవకాశం ఏదో ఒక ఉప ఎన్నికలో పోటీచేసి ఆరు నెలల్లోగా అసెంబ్లీలో అడుగు పెట్టడం. అదష్టవశాత్తు మమతకు ఈ అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల మొన్నటి ఎన్నికల్లో మూడు చోట్ల ఎన్నికలు ఆగిపోయాయి. ఈ మూడింటిలో ఎక్కడో ఒక చోట పోటీచేసి అసెంబ్లీ లో అడుగు పెట్టాలన్నది ఆమె ఆలోచన. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా సీటుకు గత నెల 22న జరిగిన ఎన్నికలో పోటీచేసిన టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. కరోనాతో ఆయన మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ లో ఆర్ ఎస్ పి (రివల్యూషనరీ) అభ్యర్థి ప్రదీప్ నంది (73) కరోనాతో కన్నుమూశారు. శంషేర్ గంజ్ స్థానంలో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి అంటువ్యాధితో కన్నుమూశారు. దీంతో ఈ రెండు సీట్లకు ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ మూడు స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఎక్కడ నుంచి పోటీ చేసినా…?

ఉప ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించేందుకు మమతా బెనర్జీ ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టారు. జంగీపూర్ నుంచి 2006లో ఆర్ ఎస్ పీ, 2011లో కాంగ్రెస్, 2016లో టీఎంసీ విజయం సాధించాయి. మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ జంగీపూర్ నుంచే రెండు సార్లు (2004, 2009) లోక్ సభకు ఎన్నికయ్యారు. ఖర్దాహ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా 18వేలకు పైగా మెజార్టీతో ఎన్నికయ్యారు. భాజపా అభ్యర్థి శిల్భద్ర దత్తాను ఓడించిన ఆయన కొద్దిసేపట్లోనే కన్నుమూశారు. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాల జిల్లాలో విస్తరించి ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలోని మరో నియోజకవర్గం శంషేర్గంజ్. 2011లో సీపీఎం, 2016లో టీఎంసీ ఇక్కడ విజయం సాధించాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన రెజాక్ హక్ ఆకస్మిక మరణంతో ఎన్నిక వాయిదా పడింది. వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో మంచి ఊపుమీదున్న మమతా బెనర్జీ ఈ మూడు సీట్లలో ఎక్కడ నుంచి పోటీచేసినా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. భారతీయ జనతా పార్టీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News