మూడోసారి కష్టంగానే… భారీగానే?

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మూడుసార్లు ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మమత [more]

Update: 2021-05-05 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మూడుసార్లు ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మమత బెనర్జీ మాత్రం చివరకు అనుకున్నది సాధించారు. ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ అనేక ఇబ్బందులను పెట్టింది. మానసికంగా మమతను దెబ్బతీసింది. అయినా మమత బెనర్జీ ఏమాత్రం బెదరలేదు. తాను అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతోనే ముందుకు పోయారు.

ఏడాది ముందు నుంచి…..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మరో ఏడాది ఉండగానే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. మమత బెనర్జీకి అండగా నిలిచిన వారందరినీ తన పార్టీలో చేర్చుకుంది. ముఖ్యమైన నేతలను చేర్చుకోవడంతో ఒక దశలో మమత బెనర్జీ ఇబ్బంది పడ్డారు. సువేందు అధికారి వంటి ఆర్థిక, సామాజికపరంగా బలమైన నేతలు వెళ్లిపోవడంతో మమత బెనర్జీ కుంగిపోయారు. అయినా మొక్కవోని దీక్షతో ఆమె ఎన్నికలకు సిద్ధమయ్యారు.

ఒంటరిగానే బరిలోకి దిగి….

తొలి నుంచి మమత బెనర్జీ తనకు ప్రధాన శత్రువు బీజేపీయేగానే భావించి ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను పట్టించుకోలేదు. ఒంటరిగానే పోటీ చేయాలని మమత బెనర్జీ నిర్ణయించుకున్నారు. వెళ్లిపోయిన నేతల స్థానంలో కొత్త నేతలను బరిలోకి దించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించి బీజేపీికి తానేమిటో రుజువు చేశారు.

బీజేపీ అతి కలిసొచ్చిందా?

బీజేపీ కూడా అతికి పోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మమత బెనర్జీని సోలోగా టార్గెట్ చేయడం బెంగాల్ ప్రజలకు రుచించలేదు. ఒక్క మహిళ కోసం బెంగాలేతరులు ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. అందుకే ఈ అనూహ్య విజయం లభించింది. అందుకే మమత బెనర్జీ అంచనాలకు భిన్నంగా ప్రజలు ఆమె వెంట నిలిచారు. మూడో సారి ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు.

Tags:    

Similar News