జగన్ మీద మమత…బాబుకు కలత…?

పశ్చిమ బెంగాల్ లో జరిగే ఎన్నికల గురంచి ఇపుడు దేశమంతా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోడీని ఢీ కొట్టే సత్తా తనకే [more]

Update: 2021-04-01 06:30 GMT

పశ్చిమ బెంగాల్ లో జరిగే ఎన్నికల గురంచి ఇపుడు దేశమంతా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోడీని ఢీ కొట్టే సత్తా తనకే ఉందని మమత ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆమె కనుక మూడవ విడత కూడా అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో పరిణామాలు చాలా వేగంగా మారుతాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా మమత దేశంలోని జాతీయ నాయకులకు, పలువురు బీజేపీయేతర సీఎంలకు రాసిన లేఖ సంచలనంగా మారుతోంది.

ఆ లిస్ట్ లో జగన్…

మమత లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేలతో పాటు సౌత్ లో తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో అటు కేసీయార్, ఇటు జగన్ కూడా ఉండడం విశేషం. అంటే మమత తాను ఏర్పాటు చేయనున్న యాంటీ బీజేపీ టీమ్ లో జగన్ కి కూడా చేర్చుకున్నారు అని అంటున్నారు. బీజేపీ మీద పోరుకు నేతలంతా సమాయత్తం కావాలని కూడా మమత ఆ లేఖలో పిలుపు ఇచ్చారని అంటున్నారు.

మిస్ అయిన బాబు….

సరిగ్గా రెండేళ్ళ క్రితం విశాఖలో జరిగిన తెలుగుదేశం ఎన్నికల సభలో చంద్రబాబుకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. ఆనాడు మమత బాబుని గెలిపించాలని, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ప్రాణం పోయాలని గట్టిగా కోరారు. ఈ రెండేళ్ళలో ఎంత మార్పు వచ్చేసిందో. అది మమత వైపు నుంచి లేదు. బాబు నుంచే అలా మొదలైంది. ఆయన నాడు బీజేపీని తిట్టారు, దూరం జరిగారు కానీ ఓడిన తరువాత మాత్రం ప్లేట్ ఫిరాయించారు.ఇపుడు బీజేపీని పొగుడుతున్నారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల కూడా ఆయన కనీసంగా కూడా స్పందించడంలేదు. దీన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న మమత బాబుని తమ జట్టు నుంచి తప్పించారు అంటున్నారు.

పీకే వేసిన బంధం…..

ఇక జగన్ మమతల మధ్యన సామరస్యం కుదరడానికి మధ్యలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అనుసంధానం అయ్యారని వినిపిస్తున్న మాట. మమత గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్న ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో జగన్ని కూడా గెలిపించారు. అందువల్ల మమత గెలుపు విలువ ఏంటో జగన్ తో ఆయన చర్చించి ఉంటారని కూడా అంటున్నారు. ఇక తెలంగాణా సీఎం కేసీయార్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో ఎటూ ఉంటారు. ఈ మధ్యన ప్రశాంత్ కిశోర్ కేటీయార్ తో కూడా భేటీ వేశారని ప్రచారం అయింది. మొత్తానికి ప్రశాంత్ కిశోర్ వారధిగా మారి బీజేపీకి వ్యతిరేక వేదిక నిర్మాణానికి దోహదపడుతున్నాడు అంటున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ పలుకక ఇటు ఇతర పక్షాలు పిలవక ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం అన్నింటికీ చెడ్డారని అన్న మాట అయితే ఉంది మరి.

Tags:    

Similar News