దీదీ… బాబును చూశావా? ఏమయిందో?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ రేపుతుంది. ఇక ఎన్నికల వేళ ఉచిత హామీలు ఏ ఎన్నికల్లోనైనా, ఏ రాష్ట్రంలోనైనా మామూలే. ఇప్పుడు పశ్చిమ [more]

Update: 2021-01-20 17:30 GMT

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ రేపుతుంది. ఇక ఎన్నికల వేళ ఉచిత హామీలు ఏ ఎన్నికల్లోనైనా, ఏ రాష్ట్రంలోనైనా మామూలే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో అదే జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే మమత బెనర్జీ అసంతృప్త వర్గాలను సంతృప్తి పర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తాను గతంలో ఇచ్చిన హామీలను అమలుపర్చే దిశగా మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు.

ఏపీ ఎన్నికలకు ముందు….

అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాటికి విలువ ఉంటుందా? అన్న ప్రశ్నకు గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే ఉదాహరణ. ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక వరాల జల్లు కురిపించారు. పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్క మహిళకు పదివేలు జమ చేశారు. రైతులకు రాయితీలు ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఏ హామీలు, పథకాలు చంద్రబాబును విజయతీరాలకు చేర్చలేకపోయాయి. ఇప్పుడు మమత బెనర్జీ పరిస్థితి అలాగే ఉంది.

ఇచ్చే హామీలకు, వరాలకు….

పశ్చిమ బెంగాల్ లో ఈసారి ఎన్నికలు ఉత్కంఠగా జరగనున్నాయి. ప్రధానంగా బీజేపీ దూసుకుపోతుండటమే మమత బెనర్జీ ఆందోళనకు కారణం. ఇప్పటికే టీఎంసీకి చెందిన ముఖ్యనేతలందరూ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. దీంతో మమత బెనర్జీ బెంగాలీల మీద వరాలు కురిపిస్తున్నారు. కానీ ఆ వరాలకు ప్రజలు తలొగ్గరని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్ని హామీలిచ్చినా, వరాలిచ్చినా మమత బెనర్జీని బెంగాలీలు నమ్మరంటున్నారు బీజేపీ నేతలు.

విలువ ఉంటుందా?

ఇక కరోనా వ్యాక్సిన్ ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని మమత బెనర్జీ ప్రకటించారు. వ్యాక్సిన్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బీహార్ లోనూ బీజేపీ వ్యాక్సిన్ ఉచిత పంపిిణీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అదే రీతిలో ఇప్పుడు మమత బెనర్జీ కూడా వెళుతుంది. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలకు, అమలు చేసే పథకాలకు విలువ ఉంటుందా? లేదా? ప్రజలు అధికారంలో ఉన్న పార్టీ హామీలను విశ్వసిస్తారా? అన్నది మరికొద్దికాలంలోనే తేలనుంది.

Tags:    

Similar News