మమతకు కొత్త భయం.. అదే జరిగితే?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా మమత బెనర్జీ లో రోజురోజుకూ ఆందోళన అధికమవుతుంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఓట్ల పోలరైజేషన్ పై [more]

Update: 2020-12-15 18:29 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా మమత బెనర్జీ లో రోజురోజుకూ ఆందోళన అధికమవుతుంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఓట్ల పోలరైజేషన్ పై మమత బెనర్జీ ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ముస్లిం, హిందూ వర్గాలను వేరు చేస్తూ బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. దీంతో పాటు తాజాగా సీపీఎం క్యాడర్ సయితం బీజేపీకి మద్దతుదారులుగా మారిపోయారన్న అనుమానం మమత బెనర్జీలో బలపడిపోయింది.

బలంగా ఉన్న వామపక్షాలు…

పశ్చిమ బెంగాల్ లో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి.సీపీఎం దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను పాలించింది. పశ్చిమ బెంగాల్ లో జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య వంటి అగ్రనేతల పాలనలో ఎర్రజెండా రెప రెపలాడింది. కానీ సీపీఎం క్యాడర్ ను చెల్లా చెదురు చేసి పదేళ్ల క్రితం అధికారంలోకి మమత బెనర్జీ వచ్చారు. మమత బెనర్జీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్యునిస్టు క్యాడర్ ను టార్గెట్ చేసుకున్నారు.

చెల్లాచెదురు చేసేసి….

గత పదేళ్ల నుంచి సీపీఎం క్యాడర్ లో ముఖ్యనేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు వారిపై అక్రమ కేసులను బనాయించారు. దీంతో సీపీఎంలో క్యాడర్ చెల్లా చెదురయింది. కొందరు ఇప్పటికే పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్నట్లు మమత బెనర్జీ గుర్తించారు. బీజేపీ కార్యక్రమాల్లో కొన్ని చోట్ల సీపీఎం క్యాడర్ పాల్గొంటున్నట్లు ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా స్పష్టం అవ్వడంతో మమత బెనర్జీ అప్రమత్తమయ్యారు.

బీజేపీతో చేతులు కలిపారని….

అందుకే మమత బెనర్జీ ఈ నెల 8వ తేదీన జరిగిన భారత్ బంద్ కు కూడా దూరంగా ఉన్నారు. బంద్ పేరుతో పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయని భావించిన మమత బెనర్జీ దూరంగా ఉన్నారు. సీపీఎం కార్యకర్తలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యునిస్టు పార్టీ తనను అధికారం నుంచి దూరం చేయడానికి బీజేపీ తో చేతులు కలిపిందన్న అనుమానాన్ని మమత బెనర్జీ వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే మమత బెనర్జీ చిన్న విషయానికి కూడా భయపడుతున్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News