కత్తి యుద్ధానికి దిగాల్సిందేనా? దీదీకి తప్పదు మరి

పశ్చిమ బెంగాల్ లో హోరా హోరీ పోరు సాగనుంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇద్దరూ సమఉజ్జీలు కావడంతోనే అసలు సమస్య. పశ్చిమ బెంగాల్ లో [more]

Update: 2020-09-08 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో హోరా హోరీ పోరు సాగనుంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇద్దరూ సమఉజ్జీలు కావడంతోనే అసలు సమస్య. పశ్చిమ బెంగాల్ లో గతంలో జరిగిన ఎన్నికలకు, రేపు జరగబోయే ఎన్నికలకు చాలా తేడా ఉందంటున్నారు విశ్లేషకులు. మమత బెనర్జీ భయం కూడా అదే. అందుకే మమత బెనర్జీ ఫుల్ ఎఫెన్స్ తో కమల దళాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. మమత బెనర్జీకి ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం కూడా.

అప్పడు ఉన్న ధైర్యం….?

గత ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాడే లేదు. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలే అక్కడ కొద్దో గొప్పో బలంగా ఉన్నాయి. ఇప్పటికి రెండు సార్లు మమత బెనర్జీ విజయం సాధించడంతో కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీ జాడ పెద్దగా లేదనే చెప్పాలి. అక్కడక్కడ మాత్రమే ఈ రెండు పార్టీలు కన్పిస్తాయి. కమ్యునిస్టులను, కాంగ్రెస్ లను వెనక్కు నెట్టి బీజేపీ ఇప్పుుడు ముందుకు వచ్చింది. మమతను ఢీకొనే పార్టీ బీజేపీయేనన్నది కాదనలేని వాస్తవం.

కేంద్ర పై నిప్పులు…..

ఈ పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని మాత్రం మమత బెనర్జీ వదులుకోవడం లేదు. కరోనావైరస్ నుంచి జేఈఈ పరీక్షల వరకూ కేంద్ర ప్రభుత్వం పై ప్రతిరోజూ మమత దుమ్మెత్తి పోస్తున్నారు. బెంగాల్ లో అడుగుపెట్టడం అసాధ్యమని కమలదళానికి మమత బెనర్జీ నిత్యం సవాళ్లు విసరుతూనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా మమత బెనర్జీ ప్రజల్లోనే ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా క్యాడర్ ను ఉత్తేజ పరుస్తున్నారు. దాదాపు దీదీ యుద్ధానికి సిద్ధమయిపోయినట్లే. నియోజకవర్గాల వారీగా కూడా మమత బెనర్జీ అప్పుడే సమీక్షలు చేయడం ప్రారంభించారు.

గవర్నర్ తో మైండ్ గేమ్….

ఇక బీజేపీ విషయానికొస్తే మిషన్ 250 పేరిట ప్రజల్లోకి వెళుతుంది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో కాషాయజెండా ఎగురవేయాలన్నది బీజేపీ లక్ష్యంగా కన్పిస్తుంది. ప్రచారంలోనూ దూసుకుపోతోంది. మరో వైపు గవర్నర్ జగదీప్ దన్ ఖర్ తో మైండ్ గేమ్ ను ఆడిస్తుంది. మమత బెనర్జీ చేపట్టే ప్రతిపనికీ అడ్డం తగులుతూ గవర్నర్ ఆమెకు చికాకును తెప్పిస్తున్నారు. ఈ చికాకుతోనే మమత విఫలమవుతుందన్నది బీజేపీ ఆలోచన. ఇలా పశ్చిమ బెంగాల్ లో మాటల యుద్ధం ప్రారంభమయింది. ఇక కత్తుల యుద్ధం మొదలవ్వడమే తరువాయి.

Tags:    

Similar News