దీదీ తగ్గదు.. దాదా ఆగడు

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కరోనా సమయంలోనూ వార్ నడుస్తున్నట్లే ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ [more]

Update: 2020-04-16 16:30 GMT

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కరోనా సమయంలోనూ వార్ నడుస్తున్నట్లే ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏప్రిల్ 30వ తేదీ వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. మోదీ ప్రకటనకు ముందే ఆమె లాక్ డౌన్ విధించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ కరోనా సమయంలో చేస్తున్న సేవలపై కూడా మమత బెనర్జీ ఆంక్షలు విధించారు. సాయం చేసే బీజేపీ నేతలను లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.

ఎన్నికలు ఉండటంతో….

పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు జరుగుతుండటంతో కరోనా సమయంలోనూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కూడా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నేతలు మరికొంత ముందడుగు వేసి సహాయ కార్యక్రమాలను చేపట్టారు. కానీ ఏ పార్టీపైన లేని ఆంక్షలు తమపైనే ఉన్నాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ విషయంలో…..

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది. గతంలో ఒకసారి జరిగిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ కు మమత బెనర్జీ డుమ్మా కొట్టారు. రెండోసారి మాత్రం హాజరయ్యారు. తమకు నిధులు విడుదల చేయాలని ప్రధానిని ఆమె కోరారు. అంతేకాదు ఇరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజీని పశ్చిమ బెంగాల్ కు ఇవ్వాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకేనని బీజేపీ ఆరోపిస్తుంది.

లాక్ డౌన్ ఉల్లంఘనలపై……

తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా మమత బెనర్జీ సర్కార్ పై సీరియస్ అయింది. లాక్ డౌన్ నిబంధనలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కేంద్ర హాంశాఖ లేఖ రాసింది. దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ కు పశ్చిమ బెంగాల్ లో తూట్లు పొడుస్తున్నారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. భౌతిక దూరం పాటించడం లేదని, ప్రార్థనలకు కూడా అనుమతివ్వడం పై కేంద్ర హోంశాఖ అభ్యంతరం తెలిపింది. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఉండటంతో తమపై కక్షతోనే ఈవిధంగా తప్పుడు ప్రచారం చేస్తుందని మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు ఉన్నందునే పశ్చిమ బెంగాల్ లో కరోనా సమయంలోనూ రాజకీయాలు ఊపందుకున్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News