ట్రెండింగ్ లో నందిగ్రామ్… కారణం ఇదే?

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందరి చూపూ బెంగాల్ పైనే ఉంది. [more]

Update: 2021-02-14 16:30 GMT

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందరి చూపూ బెంగాల్ పైనే ఉంది. ఈ తూర్పు రాష్ర్టంలో అధికార టీఎంసీ, భాజపా కత్తులు తూసుకుంటుండంతో ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 42కు గాను టీఎంసీ 22, భాజపా 18 సీట్లు గెలుచుకోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఇది కీలక నియోజకవర్గంగా మారింది. నిన్నటిదాకా తనకు కుడిభుజంగా వ్యవహరించి, ఇటీవల భాజపా తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి ఇక్కడి ఎమ్మెల్యే. మమతా బెనర్జీ పోటీ చేస్తే ఆమెను 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానని, లేనట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడంతో నందిగ్రామ్ నియోజకవర్గం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆయనకు పట్టున్నప్పటికీ….

నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇది తమ్లుక్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగం. నందిగ్రామ్ పూర్బ మెదినీపూర్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. తొలి రోజుల్లో కాంగ్రెస్, తరవాత రోజుల్లో సీపీఐకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. 2009 ఉప ఎన్నికలో, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సువేందు అధికారి, సీపీఐ అభ్యర్థి అబ్దుల్ కబీర్ పై 81,230 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భాజపా అభ్యర్థి బీజన్ కుమార్ దాస్ 10,713 ఓట్లకే పరిమితమయ్యారు. అధికారి భారీ మెజార్టీకి పార్టీ బలంతో పాటు ఆయన సొంత బలం కూడా కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియనిది కాదు. మంచి మెజార్టీ సాధించడం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండటంతో పార్టీలో, ప్రభుత్వంలో అధికారికి మమతా బెనర్జీ మంచి ప్రాధాన్యమే ఇచ్చారు.

వ్యక్తిగత వైరంగా…..

కారణాలు ఏమైనప్పటికీ ఆయన కాషాయ కండువా కప్పుకోవడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గల రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారింది. దీంతో మమతా బెనర్జీని ఓడించడం ద్వారా తన సత్తా చాటి భాజపా తరఫున ముఖ్యమంత్రి కావాలన్నది సువేందు వ్యూహంగా ఉంది. అదేవిధంగా సువేందు అధికారిని ఓడించి, ఆయనను రాజకీయంగా మట్టి కరిపించాలన్న పట్టుదలతో మమతా బెనర్జీ ఉన్నారు. నందిగ్రామ్ సువేందు అధికారికి పట్టున్న ప్రాంతం. ఈ అసెంబ్లీ స్థానం తమ్లుక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి ఎంపీ దేవ్యేందు అధికారి సువేందు సొంత సోదరుడే కావడం గమనార్హం. సువేందు తండ్రి శిశిర్ అధికారి పక్కనే ఉన్న కాంతి లోక్ సభ స్థానం ఎంపీ. కుటుంబ బలంతోపాటు మోదీచరిష్మా కారణంగా హిందువుల ఓట్లు లభిస్తాయని సువేందు అంచనా. అందువల్ల తన గెలుపు నల్లేరు మీద నడకేనన్నది ఆయన ధీమా.

మమత లెక్కలు అవేనా?

ఇక మమతా బెనర్జీ లెక్కలు మరో రకంగా ఉన్నాయి. నియోజకవర్గంలో గల దాదాపు 30 శాతం ముస్లిం ఓట్లు తనకు గంపగుత్తగా పడతాయని ఆమె అంచనా వేస్తున్నారు. సహ జంగానే ముస్లింలు మొదటి నుంచీ మమతా బెనర్జీకి అండగా నిలుస్తున్నారు. ఈసారి భాజపా భయంతో ఒక్క ముస్లిం ఓటు కూడా చీలదని ఆమె ఆశిస్తున్నారు. తాను కాకుండా మరే ఇతర అభ్యర్థిని బరిలోకి దింపినా అధికారిని అడ్డుకోవడం కష్టమన్న భావనతోనే నేరుగా మమతా బెనర్జీ నేరుగా తానే రంగంలోకి దిగుతున్నారు. మమత ప్రస్తుత స్థానం భవానీపూర్ నుంచి 2016లో 25వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ముఖ్యమంత్రి స్థాయి నేతకు ఇది గొప్ప మెజార్టీ ఏమీ కాదు. భవానీపూర్ లో హిందువులు ఎక్కువ. అక్కడ భాజపా పుంజుకుంటుందన్న భయంతోనే ముస్లింలు ఎక్కువగా ఉన్న నందిగ్రామ్ ను ఎంచుకున్నారని అధికారి వర్గీయులు విమర్శిస్తున్నారు. 2007లో నందిగ్రామ్ లో రసాయనిక పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నించగా రైతులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించారు. అప్పట్లో నందిగ్రామ్ దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. ఈసారి ఇద్దరు ఉద్ధండుల పోటీ కారణంగా మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News