బాబు బాటలో మమత ?

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చిక్కులు మొదలయ్యాయి. శారదా చిట్స్ స్కామ్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. బెంగాల్ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ [more]

Update: 2019-02-04 06:30 GMT

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చిక్కులు మొదలయ్యాయి. శారదా చిట్స్ స్కామ్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. బెంగాల్ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సిబిఐ అధికారులు విచారణకు వెళ్లడంపై మమత ఈ అంశాన్ని రాజకీయంగా విజయవంతంగా మలిచి కేంద్రంపై నేరుగా యుద్ధానికి దిగారు. నా రాజ్యంలో కేంద్రం పెత్తనం చేయాలని ప్రయత్నం చేయడం ఏమిటంటూ రాష్ట్ర పోలీసులతో సిబిఐ అధికారులనే నిర్బంధించారు. శారదా స్కామ్ పేరుతో కేంద్రం వేధింపులకు దిగిందని ఆరోపిస్తూ కోల్ కత్తా మెట్రో వద్ద ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేసి సంచలనం సృష్ట్టించారు మమతాబెనర్జీ.

మోడీ, షా లదే ఈ కుట్ర …

ఈ దాడుల వెనుక మోడీ, షా వున్నారని వారి చర్యలను దేశ వాసులను ఖండించాలని పిలుపునిచ్చారు. మమత అలా పిలుపునిచ్చారో లేదో కానీ వెంటనే ఎపి సీఎం చంద్రబాబు సిబిఐ దాడులను ఖండిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రికి అండగా ఉంటామని వ్యాఖ్యానించి మరో కొత్త చర్చకు తెరతీశారు. ఇప్పటికే ఏపీలో సిబిఐ నేరుగా ఎలాంటి కేసులు తమ అనుమతిలేకుండా చేసేందుకు వీలు లేదంటూ చంద్రబాబు జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే ఇప్పుడు బెంగాల్ సిఎం కూడా ప్రతి అంశాన్ని వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పావులు కదపడం గమనార్హం.

మమత ఆరోపణల్లో నిజం ఎంత …?

వాస్తవానికి శారదా స్కామ్ కేసు సుప్రీం కోర్ట్ లో విచారణ నడుస్తుంది. కోర్ట్ ఆదేశాల మేరకు స్కామ్ లో నిందితులను, అనుమానితులను సిబిఐ విచారిస్తుంది. గత కొంతకాలం గా మమతా సర్కార్ పై ప్రధాని మోడీ విమర్శల దాడి తీవ్రం చేశారు. మమత ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపణలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపధ్యం లోనే సిబిఐ సీన్ లోకి రావడం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. మమత ఇచ్చిన షాక్ తో ఆమెతో యుద్ధానికి సిబిఐ కూడా సిద్ధం అయిపొయింది. కోర్ట్ ధిక్కరణ తో బాటు తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ న్యాయస్థానం గుమ్మం ఎక్కేందుకు సిద్ధం కావడం తో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితినే కలిగిస్తుంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం నడుమ తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు.

Tags:    

Similar News