చండీ పారాయణం చేరదీస్తుందటగా?

భారతదేశంలో ‘బుజ్జగింపు’ రాజకీయాలు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని పార్టీలు [more]

Update: 2021-04-25 16:30 GMT

భారతదేశంలో ‘బుజ్జగింపు’ రాజకీయాలు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని పార్టీలు ఈ తరహా రాజకీయాలను నడిస్తున్నాయి. వివిధ మైనార్టీ వర్గాలను ఓటుబ్యాంకులుగా పరిగణిస్తూ రాజకీయాలు చేస్తున్నాయి. ముస్లిములను ఆకట్టుకునేందుకు ఇఫ్తార్ విందులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. వారి మక్కా యాత్రలకు రాయితీలు ఇవ్వడమూ జగమెరిగిన సత్యం. క్రైస్తవులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘జెరూసలెం’ యాత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ర్ట ప్రభుత్వాల గురించి తెలిసినదే. ఈ విషయంలో కాంగ్రెస్, వామపక్షాలు, అనేక ప్రాంతీయ పార్టీలు పోటీలు పడుతున్న సంగతిని విస్మరించలేం.

బీజేపీ ఎదగడంతో…..

తాజాగా కీలకమైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సరికొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది. అదే హిందువుల బుజ్జగింపు రాజకీయం. బెంగాల్ లో దాదాపు 30 శాతం ఉన్న ముస్లిములను ఆకట్టుకునేందుకు బుజ్జగింపు రాజకీయాలను చేయడం తెలిసినదే. రాష్ర్ట రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా కీలకశక్తిగా ఎదగడంతో అధికార టీఎంసీలో అలజడి చెలరేగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవంల మూడు సీట్లు సాధించిన కాషాయ పార్టీ ఇప్పుడు అధికారాన్ని అందుకోవడానికి తహతహలాడుతోంది. ఆ పార్టీ ప్రధాన ఓటుబ్యాంకు హిందువులే నన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ జై శ్రీరామ్ నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళుతోంది. దీంతో మెజార్టీ హిందువుల ఓట్లు ఎక్కడ చేజారిపోతాయోనన్న భయం మమతా బెనర్జీని వెంటా
డుతోంది.

హిందువునే నంటూ….

భాజాపా దూకుడును అడ్డుకోవడానికి, మెజార్టీ హిందువుల మనసులను చూరగొనేందుకు మమత బెనర్జీ సరికొత్త పల్లవిని అందుకున్నారు. అందుకే వెళ్లిన చోటల్లా తాను హిందువునీ, మరీ ప్రత్యేకంగా బ్రాహ్మణురాలినని పదేపదే చెబుతున్నారు. గుళ్లు గోపురాలను సందర్శిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో ఏకంగా చండీ పారయణాలు చేస్తున్నారు. హనుమాన్ చాలీసాను పఠిస్తున్నారు. అసలు తనకు మించిన మరో హిందువు ఎవరైనా ఉన్నారా అని భాజపాను సవాల్ చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో 30 శాతంముస్లిం ఓటుబ్యాంకును కాంగ్రెస్, వామపక్షాలతో పాటు టీఎంసీ కూడా పంచుకోవాల్సి ఉంటుంది. ముస్లిముల ఓట్లే ఆధారంగా బరిలోకి దిగిన సిద్ధిఖీ సారథ్యంలోని ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ ఓట్లు భారీగా చీలుస్తుందన్న భయం మమత బెనర్జీ లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో ముస్లిముల ఓట్లలో చీలిక రావడం రాజకీయంగా తనకు నష్టదాయకమన్నది ఆమె ఆలోచన. అదే సమయంలో ఓటర్లలో మతపరమైన చీలిక వచ్చినట్లయితే తనకు మరింత ప్రమాదకరమన్నది మమత భయం.

ఈ బుజ్జగింపు రాజకీయాలు….

దీనివల్ల గంపగుత్తగా ఎక్కడ మెజార్టీ హిందువులు భాజపా వైపు మొగ్గు చూపుతారేమోనన్న అనుమానం మమత బెనర్జీని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహంతో మమత బెనర్జీ ముందుకెళుతున్నారు. అందుకే చండీ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనంతో మెజార్టీ హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తాను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించానని గుర్తు చేస్తున్నారు. తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో మార్చి 11న ఆమె మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చండీ పారాయణం చేశారు.హనుమాన్ చాలీసాను పఠించారు. తనంత వేగంగా, స్వచ్ఛంగా పారాయణం చేయగల నాయకులు భాజపాలో ఎవరైనా ఉన్నారా అని సవాలు చేశారు. మమత బెనర్జీ సరికొత్త మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే మే 2వరకు ఆగాల్సిందే.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News