ఆ ఎఫెక్ట్ పడితే మల్లాది మునిగిపోయినట్లేనట

స్థానిక సంస్థల ఎన్నిక‌లు మాజీ ఎమ్మెల్యేల‌కు, ప్రస్తుత ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగ్ని ప‌రీక్షగా మారాయి. మ‌రీ ముఖ్యంగా టీడీపీలో కొద్ది తేడాతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం [more]

Update: 2020-03-13 13:30 GMT

స్థానిక సంస్థల ఎన్నిక‌లు మాజీ ఎమ్మెల్యేల‌కు, ప్రస్తుత ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగ్ని ప‌రీక్షగా మారాయి. మ‌రీ ముఖ్యంగా టీడీపీలో కొద్ది తేడాతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన నాయ‌కులు ఇప్పుడు త‌మ స‌త్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ బొండా ఉమామ‌హేశ్వర‌రావుకు, గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన మ‌ల్లాది విష్ణుకు మ‌ధ్య ఇప్పుడు మ‌రోసారి తీవ్రమైన పోరు సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కావ‌డంతో ఇక్కడి వార్డుల్లో గెలుపు గుర్రం ఎక్కి మేయ‌ర్ ప‌ద‌విని సొంతం చేసుకోవ‌డం వైసీపీకి అత్యంత కీల‌కం.

క్లాస్ ..మాస్ లతో కలగలిపి….

అందునా రాజ‌కీయ చైత‌న్యం ఉన్న విజ‌య‌వాడ సీటును ద‌క్కించుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించేది సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గమే. మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు భిన్నంగా ఇక్కడ ప్రజ‌లు ఉంటారు. ఇక్కడ క్లాస్ , మాస్ రెండు వ‌ర్గాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో కుల రాజ‌కీయాలు కూడా ఇక్కడ న‌డుస్తుంటాయి. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు 45 వేల వ‌ర‌కు ఉన్నారు. అదే టైంలో కాపు వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఉన్నారు. ఇక టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు సైతం ఉన్నారు.

పరువు నిలబెట్టుకోవడం కోసం….

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవలం 25 ఓట్ల తేడాతో బొండా ఉమ ఓడిపోయారు. అయినా కూడా ఆయ‌న క‌సిగా రాజ‌కీయాల్లో ప‌నిచేస్తున్నారు. ప్రభుత్వంపై దూకుడుగా విమ‌ర్శలు చేస్తున్నారు. ఇక‌, మ‌ల్లాది విష్ణు ఇప్పటికే ఎమ్మెల్యేగా, బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ క్రమంలో అటు బొండా ఉమ త‌న ప‌ట్టును నిలుపుకొని పార్టీలో ఎదిగేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. మ‌రోప‌క్క, మ‌ల్లాది విష్ణు త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డంతోపాటు.. విజ‌య‌వాడ‌లో వైసీపీ ప‌రువును నిల‌బెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌డంతో ఆదిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణయించుకున్నారు. అయితే, ఇద్దరూ రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు కావ‌డం, ఒక‌రిపై ఒక‌రు పైఎత్తులు వేసుకోవ‌డంలో ముందున్నారు. ఈ క్రమంలో విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి.

ఆ ప్రభావం పడితే మాత్రం?

గ‌తంలో ఇక్కడ అన్ని వార్డుల్లోనూ టీడీపీ విజ‌యం సాదించింది. అయితే, త‌ర్వాత ఈ కార్పొరేట‌ర్లలో స‌గానికిపైగా మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవంగా చూస్తే గ‌త ఎన్నిక‌ల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్టబోయిన చందంగా గెలిచిన మ‌ల్లాది విష్ణు ఆ త‌ర్వాత కూడా మ‌రి అంతగా పార్టీని ఇక్కడ ప‌టిష్టం చేయ‌లేక‌పోయారు. ఇక రాజ‌కీయంగా కూడా ఆయ‌న‌కు ఇబ్బందులు త‌ప్పడం లేదు. రాజ‌ధాని మార్పు ఎఫెక్ట్ విజ‌య‌వాడ న‌గ‌రంపై గ‌ట్టిగా ఉంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన 9 నెల‌ల్లో విజ‌య‌వాడ అభివృద్ధిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌గ‌ర జ‌నాల్లో ఓ అభిప్రాయం ఉంది. వీటిని వైసీపీ ఎలా త‌ట్టుకుని నిల‌బ‌డుతుందో ? చూడాలి.

Tags:    

Similar News