మల్లారెడ్డి కి షాక్ తప్పదా?

రాజ‌కీయాల్లో అధికారం శాశ్వతం కాదని ఎలా అనుకుంటామో.. నాయ‌కులు కూడా అంతే..! ఎప్పుడు పార్టీలో అధినేతల ఆశీర్వాదం ఉంటుందో..? ఎప్పుడు పోతుందో చెప్పలేని ప‌రిస్థితి..! అధినేత‌ల క‌రుణ [more]

Update: 2019-11-20 09:30 GMT

రాజ‌కీయాల్లో అధికారం శాశ్వతం కాదని ఎలా అనుకుంటామో.. నాయ‌కులు కూడా అంతే..! ఎప్పుడు పార్టీలో అధినేతల ఆశీర్వాదం ఉంటుందో..? ఎప్పుడు పోతుందో చెప్పలేని ప‌రిస్థితి..! అధినేత‌ల క‌రుణ కోసం నాయ‌కులు తిప్పలు ప‌డుతున్న ప‌రిస్థితి జాతీయ‌, రాష్ట్రీయ పార్టీల్లో స్పష్టంగా క‌నిపిస్తోంది. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. నాయ‌కుల‌కు ప్రాధాన్యం త‌గ్గించేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడైన వ్యాపారవేత్త, విద్యా సంస్థల అధినేత చామ‌కూర మ‌ల్లారెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మ‌ల్లా రెడ్డి.. ఆదిలో టీడీపీ సానుభూతిప‌రుడు. త‌ర్వాత ఆయ‌న పార్టీ నాయ‌కుడిగా మారారు. పెట్టుబ‌డి పెట్టారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున మ‌ల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజ‌యం సాధించారు.

కేసీఆర్ కు సన్నిహితుడై….

అయితే రెండేళ్లకే టీడీపీకి రాజీనామా చేసి, 2016 జూన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడుగా మారిపోయారు. పార్టీ కోసం పెట్టుబ‌డి పెట్టారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ‌లో జ‌రిగిన తెలుగు భాష ఉత్సవాల‌కు అన్నీతానై వ్యవ‌హ‌రించి కేసీఆర్ దృష్టి లో మ‌రింత పేరు తెచ్చుకున్నారు. ఇలా సాగుతున్న క్రమంలోనే గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ టికెట్‌పై మేడ్చెల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించారు. అంతేకాదు, ఆయ‌న‌ను గెలిపించుకున్నారు కూడా. అక్కడితో ఆగని కేసీఆర్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌ల్లారెడ్డిని త‌న కేబినెట్‌లో చేర్చుకున్నారు.

మంత్రి అయిన నాటి నుంచి….

వాస్తవానికి అప్పటికే పార్టీలో ఎంద‌రో సీనియ‌ర్లు ఉన్నారు. అయినా కూడా వారందిరినీ ప‌క్కన పెట్టిన కేసీఆర్ మ‌ల్లారెడ్డికి పెద్దపీట వేశారు. ఆయ‌న‌కు కార్మిక‌, ఉపాధి క‌ల్పన‌, మ‌హిళా, శిశుసంక్షేమ శాఖ‌ను అప్పగించారు. అదే స‌మ‌యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి టికెట్‌ను మ‌ల్లారెడ్డి త‌న అల్లుడికి ఇవ్వాల‌ని కోర‌గా.. కేసీఆర్ ఓకే చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్కడ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ నేత రేవంత్‌ను ఓడించాల‌నే ష‌రతుతో మ‌ల్లారెడ్డి అల్లుడికి టికెట్ ఇచ్చారు. కానీ, మ‌ల్లారెడ్డి అల్లుడు రేవంత్ చేతిలో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ దృష్టిలో మ‌ల్లారెడ్డి గ్రాఫ్ అమాంతం ప‌డిపోయింది. దీనికితోడు.. మంత్రి అయిన ద‌గ్గర నుంచి మ‌ల్లారెడ్డి వ్యవ‌హార శైలి మారిపోయింది.

ఆధిపత్యంపై ఫిర్యాదులు….

స్థానికంగా ఆయ‌న ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నే వార్తలు త‌ర‌చుగా వ‌చ్చేవి. ఫ‌లితంగా స్థానిక టీఆర్ఎస్ నేత‌ల‌కు, మ‌ల్లారెడ్డికి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆయ‌న ఆధిప‌త్యాన్ని వీరు స‌హించ‌లేక ప‌లుమార్లు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో కేసీఆర్ మ‌ల్లారెడ్డిల మ‌ధ్య దూరం పెరిగిపోయింది. మంత్రిగానే ఉన్నప్పటికీ.. కేసీఆర్ ఆయ‌న‌ను జిల్లా రాజ‌కీయాల విష‌యంపై ఎలాంటి సంప్రదింపులు జ‌ర‌ప‌లేదు. పైగా ఇదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిని క‌నీసం మాట మాత్రం కూడా మ‌ల్లారెడ్డికి చెప్పకుండానే పార్టీలో చేర్చుకున్నారు. దీనివెనుక మ‌ల్లారెడ్డికి చెక్ పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు స్పష్టమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సబితను తెచ్చి….

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు అంద‌ర మ‌ల్లారెడ్డిపై ప‌లు ఫిర్యాదులు చేశారు. త్వర‌లోనే ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌నున్నార‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. శాఖాప‌రంగా మ‌ల్లారెడ్డి ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డం, ఆధిప‌త్య రాజ‌కీయాలు వంటివి మ‌ల్లారెడ్డికి మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు. ఈ క్రమంలోనే స‌బితా ఇంద్రారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారని, జిల్లాలో ఏ కార్యక్రమ‌మైనా ఇంద్రారెడ్డికి చెప్పి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు వెళ్లాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక రంగారెడ్డిలో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి రెండు మంత్రి ప‌ద‌వులు ఉండ‌డం కూడా ఇప్పుడు మ‌ల్లారెడ్డికి మైన‌స్ కాబోతుంద‌ని టాక్‌. దీంతో ఇక మ‌ల్లారెడ్డికి చెక్ పెట్టాల‌ని ఆయ‌న యోచిస్తున్నట్లు స్పష్టమ‌వుతోంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామంపై మ‌ల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News