మజిలీ మూవీ రివ్యూ

బ్యానర్: షైన్ స్క్రీన్ నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్ [more]

Update: 2019-04-05 08:23 GMT

బ్యానర్: షైన్ స్క్రీన్
నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకుడు: శివ నిర్వాణ

నిన్నుకోరి అంటూ కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా కుటుంబ కథా చిత్రంగా అందరినీ ఆకట్టుకుంది. నాని – నివేద థామస్ ఆది పినిశెట్టి జంటగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్. మరి శివ నిర్వాణ తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య – సమంతలతో మజిలీ అనే ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ ని తెరకేక్కించాడు. పెళ్లికి ముందే ఈ జంట ప్రేమతో తెగ ఫేమస్ అయితే.. పెళ్లి తర్వాత కలిసి నటిస్తూ మరింత ఫెమస్ అయ్యింది. చైతు కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఉన్నా.. సమంతకి మాత్రం భారీ క్రేజ్ ఉంది. అలాగే పెళ్లి తర్వాత కలిసి నటించిన సినిమా కావడంతో.. మజిలీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక శివ నిర్వాణ ఈ సినిమాని కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి దగ్గరగా తెరకెక్కించాడు. కెరీర్, ప్రేమ, పెళ్లి, సంసారం ఇలా ప్రతి విషయంలోనూ ఒక అబ్బాయి పడే మానసిక సంఘర్షణ, ఆ అబ్బాయి వలన అతని భార్య పడే మానసిక వేదన అన్నీ కలగలిపి ఈ మజిలీగా ఉండబోతుందనేది మజిలీ ట్రైలర్ లోనే చూసాం. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న చైతుని మజిలీ ఏ తీరానికి చేర్చింది? రెండో సినిమాతో కూడా శివ నిర్వాణ హిట్ కొట్టాడా? ప్రస్తుతం ఫుల్ క్రేజున్న సమంత మజిలితోనూ ఆ ఫామ్ ని కంటిన్యూ చేసిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

పూర్ణ(నాగ చైతన్య) టీనేజ్ క్రికెటర్. అతనికి క్రికెట్టే ప్రపంచం. పూర్ణ తండ్రి(రావు రమేష్) కొడుక్కి కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ఏడాది పాటు డెడ్ లైన్ పెడతాడు. అలాంటి సమయంలో క్రికెట్‌తో పాటు మరో ఇష్టం కూడా పూర్ణలో కలుగుతుంది. అన్షు (దివ్యాంశ కౌశిక్)ను పూర్ణ ఇష్టపడతాడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ పూర్ణ – అన్షు ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించరు. దీంతో పూర్ణ – అన్షు ఇద్దరూ విడిపోతారు. అనుకోని పరిస్థితుల్లో పూర్ణకి శ్రావణి(సమంత)తో పెళ్లి జరిగిపోతుంది. తనకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి వల్ల పూర్ణ.. శ్రావణిని భార్యగా స్వీకరించలేకపోతాడు. అసలు పూర్ణతో విడిపోయిన అన్షు ఎందుకు కనబడకుండా పోతుంది? శ్రావణి అంటే పూర్ణకి ఎందుకు ఇష్టముండదు? తన ప్రేమ నుంచి బయటపడి శ్రావణితో తన దాంపత్య జీవితాన్ని గడిపాడా? చివరికి పూర్ణ, శ్రావణి కలుస్తారా? అనేది మజిలీ సినిమా పూర్తి కథ.

నటీనటుల నటన

నాగ చైతన్య పూర్ణ పాత్రలో టీనేజ్ యువకుడిగా, పెళ్లియిన యువకుడిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ఒక టీనేజ్ వయసులో క్రికెటర్ గా అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్ గా చైతు తన నటనతో ఎప్పటిలానే అదరగొట్టేసాడు. భర్తగా భార్య బాధను పట్టించుకోకుండా ఆకతాయిగా తిరిగే భర్త పాత్రలో చైతు మాస్ నటన బాగుంది. ఇక శ్రావణిగా మధ్యతరగతి అమ్మాయి పాత్రలో సమంత నటన పీక్స్ అనే చెప్పాలి. ప్రేమలో విఫలమై జీవితం మీద విరక్తి కలిగిన భర్తను అర్థం చేసుకునే భార్య పాత్రలో సమంత నటించలేదు.. జీవించింది. చైతు, సమంతల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరి నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. చైతు పాత్రలానే సామ్ కు కూడా ఇందులో రెండు షేడ్స్ ఉన్నాయి. డీగ్లామర్ గా సమంత లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక సెకండ్ హీరోయిన్ దివ్యంశ తన నటనతో ఆకట్టుకుంది. అన్షు పాత్రకు దివ్యాంశ పూర్తి న్యాయం చేకూర్చింది. అలాగే తన పరిధి మేర దివ్యాంశ నటించింది. ఇక సమంత తండ్రి పాత్రలో పోసాని, చైతు తండ్రి పాత్రలో రావు రమేష్ ఎప్పటిలాగే తమ నటనతో ఆకట్టుకున్నారు.

విశ్లేషణ

చక్కటి స్టోరీ లైన్స్ తో దర్శకుడు శివ నిర్వాణ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. శివ మొదటి చిత్రంలో స్టోరీ లైన్ రొటీన్ అయినా ఆకట్టుకునే కథాంశంతో నిన్నుకోరి సినిమాని సక్సెస్ చేసాడు. ఇక నిన్నుకోరి లాగే.. పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఒక జంట జీవితంలో ఎదురయ్యే అద్భుతాలు, సమస్యల మేళవింపే ఈ మజిలీ చిత్రం క‌థ‌. అయితే అందులో ప్రేమని, బాధ‌ని మేళ‌వించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కుటుంబం, స్నేహం, ప్రేమ‌, జీవితంలో అనుకున్నది సాధించాల‌నే త‌ప‌న ఉన్న కుర్రాడు.. ప్రేమ పేరుతొ పాడవడం, పెద్దల ఒత్తిడితో ప్రేమను వదులుకోవడం లాంటి ఎమోషన్స్ తో సినిమాని చక్కగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో పూర్ణ జీవితంలోకి అన్షు వ‌చ్చిన‌ప్పట్నుంచి కథలో ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే నాగ చైతన్యకి దివ్యాంశ కౌశిక్ కి మధ్య కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది. చైతు మరియు అన్షుల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు, పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే సినిమా సగానికి పూర్తయ్యే సరికి సరిగ్గా సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో పాటు అక్కడ నుంచి సమంత పాత్ర కీలకంగా మారుతుందన్న భావన హైలైట్ గా నిలుస్తుంది. అలాగే కార్పొరేట‌ర్ భూష‌ణ్ (సుబ్బరాజు) గ్యాంగ్ చేసే ప‌నులతో ఈ క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. అయితే ద‌ర్శకుడు దీన్ని ఒక హీరో – విల‌న్ క‌థ‌లా రొటీన్ గా మార్చెయ్యకుండా అందుకు భిన్నంగా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. ఇక అప్పటిదాకా సాగిన క‌థ ఒకెత్తైతే, శ్రావ‌ణిగా స‌మంత ప‌రిచ‌య‌మ‌య్యాక సాగే క‌థ మ‌రో ఎత్తు. కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ ని, పెయిన్ ని కూడా హైలెట్ అయ్యే విధంగా దర్శకుడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు. సమంతకి తన ప్రేమ గురించే చెప్పే సందర్భంలో చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా సాగదీతగా అనిపించినా… ప్రీ క్లైమాక్స్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కాబట్టి ప్రేక్షకుడు సినిమాలో అంతగా ఇన్వాల్వ్ అవుతాడు. మరి ఎన్నాళ్ళుగానో హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతుకి మజిలీ సూపర్ హిట్ ఇచ్చినట్లే. దర్శకుడు శివ సమంత – చైతులకి మంచి హిట్ ఇవ్వడమే కాదు… గత రెండు నెలలుగా బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులకు ఈ మజిలీ సినిమా వేసవి సెలవులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేసింది.

ఈ సినిమాకి గోపి సుందర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలానే ఉంది. పాటలు కూడా ఫర్వాలేదనిపిస్తాయి. గోపి సుందర్ మధ్యలో మజిలీని వదిలేసినా.. కరెక్ట్ టైం లో కరెక్ట్ అయిన వ్యక్తి చేతిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పడింది. నేపధ్య సంగీతానికి నెంబర్ వన్ అయిన ఎస్.ఎస్ థమన్ మజిలీ సినిమాకి ప్రాణం పోసాడు. థమన్ నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ లో బాగా పండింది. ఇక విష్ణు శర్మ ఫోటోగ్రఫి కూడా సినిమాకి హైలెట్ అనేలా ఉంది. ఇక ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్ : చైతు – సమంత సన్నివేశాలు, సమంత నటన, నేపథ్య సంగీతం, ఇంటర్వెల్ బ్లాక్, సినెమాటోగ్రపీ

మైనస్ పాయింట్స్ : కీలక సన్నివేశాల్లో కనిపించే లోపాలు, సెకండ్ హాఫ్ సాగదీత, పాత స్కూల్ జ్ఞాపకాలు, డెహ్రాడూన్ ట్విస్ట్ కన్విన్సింగ్ గా లేకపోవడం

రేటింగ్: 3.0/5

Tags:    

Similar News