“మహా” నాటకానికి ముగింపు..?

రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కూడా మహానాటకం మరిన్ని మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రాయబారాల జోరు మహాభారతాన్ని తలపింపచేస్తోంది. అనూహ్య కూటమి దిశలో వేస్తున్న అడుగులు [more]

Update: 2019-11-14 16:30 GMT

రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కూడా మహానాటకం మరిన్ని మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రాయబారాల జోరు మహాభారతాన్ని తలపింపచేస్తోంది. అనూహ్య కూటమి దిశలో వేస్తున్న అడుగులు ఫలిస్తాయో లేదో చెప్పలేని ఉత్కంఠ దేశ రాజకీయ చిత్రపటాన్నే పట్టి కుదుపుతోంది. మహారాష్ట్ర పాలిటిక్స్ హైడ్రామాకు అచ్చుగుద్దిన పోలికలా కనిపిస్తున్నాయి. షరతులు వర్తిస్తాయన్నదే అన్నిపార్టీల ప్రధానసూత్రం గా కనిపిస్తోంది. ..రాష్ట్రపతి పాలనలో ఎలాగూ కేంద్రానిదే పెత్తనం. అందుకే బీజేపీ మాత్రం కొంత భరోసాను కనబరుస్తోంది.

ఆధిపత్య పోరు…

దేశంలో రెండో పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో రాజకీయం మరిన్ని సుడులు తిరుగుతోంది. రాష్ట్రపతి పాలన విధించినా ఇంకా ఉత్కంఠత తీరిపోలేదు. ప్రజాసర్కారు ఏర్పాటు చేయాలని అన్నిపార్టీలు కోరుకుంటున్నప్పటికీ అవగాహనకు రావడం సమస్యాత్మకంగా కనిపిస్తోంది. భిన్నవైఖరులు, సిద్దాంతాల కలగూరగంపలాంటి పొత్తుల పొద్దు పొడిపించాలని చూసి తొలుత విఫలమైన పార్టీలు మళ్లీ సుదీర్ఘమంతనాల్లో మునిగి తేలుతున్నాయి. రాష్ట్రపతి పాలనను సాధ్యమైనంత తొందరగా ఎత్తి వేయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితేనే శివసేన,ఎన్సీపీ, కాంగ్రెసులు ప్రయోజనం పొందగలుగుతాయి. జాప్యం జరిగే కొద్దీ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారతాయి. ఇదే ఆయా పార్టీలను తొందరపెడుతోంది. అయితే విభేదాలు పూర్తిగా తొలగడం లేదు. కూటమి కట్టాలనుకుంటున్న పక్షాల్లోనే సందిగ్ధావస్థ రాజ్యం చేస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసుల కలయిక ఒక విచిత్ర పరిణామం. ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపించి మళ్లీ మొదటికొచ్చింది. శివసేన, కాంగ్రెసులు అవగాహనకు వచ్చినట్లు అనిపిస్తే ఎన్సీపీ షరతులు పెడుతోంది. మరోవైపు బీజేపీ పాచికలు కదుపుతోంది. ఇతర పక్షాల్లో భారీ చీలిక, లేదంటే శివసేన తమతో చేతులు కలపడం అనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేందుకు తాజా పరిణామాలూ దృష్టాంతంగానే నిలుస్తున్నాయి. పరస్పర అవసరాల ప్రాతిపదికపైనే సాగే రాజకీయాల మనుగడ సంకీర్ణానికి బాటలు వేస్తుందా? లేదా? అన్నదే తేలాల్సి ఉంది. ఆదిలోనే హంసపాదులా 2020కి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందంటూ కాంగ్రెసులో ఒక వర్గం ఇప్పటికీ పేర్కొంటోంది. పంతం, పట్టుదల , పరస్పర అసహనం , పగసాధించాలనే కక్ష ప్రధాన ముడిసరుకులుగా సర్కారు కొలువు తీరితే ప్రజాతీర్పు ప్రతిబింబించినట్లేనా? అన్నది మరో ప్రశ్న.

శివసేనకు చెక్…

శివసేన, బీజేపీల వాగ్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఎన్నికలకు ముందే ఫడ్నవీస్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించామని అప్పట్లో శివసేన అభ్యంతరం చెప్పలేదని కుండబద్దలు కొట్టేశారు. ఇక తేల్చుకోవాల్సింది శివసేననే. బీజేపీతో ఎన్సీపీ మైత్రి 35 ఏళ్లనాటిది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచింది. దీనికి ప్రధాన కారణం సైద్ధాంతికమైన ఏకతాసూత్రం. హిందూత్వం, మరాఠా ఆత్మాభిమానం ప్రాతిపదికగా ఒక రాజకీయపక్షంగా ఆవిర్భవించింది శివసేన. హిందూత్వ విషయంలో సామీప్యత కలిగిన పార్టీగా బీజేపీ తో చెలిమి చేసింది. తద్వారా రెండు పార్టీలు మహారాష్ట్రలో బలపడుతూ వచ్చాయి. ఎన్నికల్లో అనేక సందర్భాల్లో పరస్పరం విభేదించుకున్న ఘట్టాలకూ కొదవ లేదు. ఎప్పటికప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీనే కొంత తగ్గుతూ సర్దుబాటు ధోరణి కనబరుస్తూ వచ్చింది. 2014లో బీజేపీ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకోగలిగింది. శివసేనను తోసిరాజంటూ సొంతంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో శివసేన దాంతో కలవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఉప్పు నిప్పుగానే ఉంటూ వచ్చాయి. ఎన్సీపీ, కాంగ్రెసులు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో విడిపోతే చెడిపోతామనే రాజకీయ స్ప్రుహతో శివసేన, బీజేపీలు తాజాగా కలిసే పోటీ చేశాయి. ప్రజాతీర్పు అనుకూలంగానే వచ్చినా ఆధిపత్య రాజకీయాలతో రెండు పార్టీలు వర్గ స్థాయికి దిగజారి సర్కారు ఏర్పాటులో పొత్తును కాదనుకున్నాయి.

అత్యాశతో అసలుకే మోసం…

ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్ర సీఎం పీఠంపై తన వారసుడిని కూర్చోబెట్టాలని శివసేన గట్టి పట్టుదలతో ముంత ఒలకబోసుకుంది. ఒక్కసారి శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించవచ్చనే ఆశ ఆ పార్టీది. అంతేకాకుండా రోజురోజుకీ రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని నిలువరించడానికి సైతం ఈ చర్య దోహదం చేస్తుందనేది శివసేన భావన. రాష్ట్రస్థాయి పార్టీగా బీజేపీపై పెత్తనం చేయాలనుకున్న శివసేన పప్పులు మోడీ, అమిత్ షా ల హయాంలో ఉడకడం లేదు. ఒంటరిగా వెళ్లడానికి బీజేపీ భయపడటం లేదు. అందుకే ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ అనిశ్చిత వాతావరణంలో బీజేపీని నియంత్రించి, అవమానించాలనేది సేన ఎత్తుగడ. అందుకే ఎన్సీపీ, కాంగ్రెసులతో తాను రాజకీయంగా ఎంతగా విభేదించినప్పటికీ వాటితో కలిసి సర్కారు ఏర్పాటు చేసేందుకు సాహసించింది. అవసరమైతే ఎన్సీపీకి మద్దతిచ్చేందుకూ సిద్ధమైంది. కానీ చివరిక్షణాల్లో గవర్నర్ చొరవ చూపడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైపోయింది. బీజేపీ తన మిత్రపక్షమైన శివసేనకు అవకాశం ఇవ్వకుండా ఉండటానికి కూడా కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే మరాఠా ఆత్మాభిమానం వంటి కారణాలను రెచ్చగొట్టి అమిత్ షా, మోడీలనే టార్గెట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల మహారాష్ట్రలో శాశ్వతంగా ఇబ్బంది తలెత్తుతుంది. ఒకవేళ ఎన్సీపీ, శివసేన, కాంగ్రెసులు ఇప్పటికైనా జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎక్కువ కాలం కొనసాగలేదని బీజేపీ విశ్వాసం.

ముందరికాళ్లకు బంధాలు…

రాష్ట్రపతి పాలన తర్వాత మూడు పక్షాలు తొందరపడాల్సిన తరుణమే . అయినా పవర్ ప్లే లో ఎవరికి వారు పైచేయి సాధించాలను కోవడంతోనే ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసు పార్టీలు తమ తమ ప్రయోజనాల పరిధిలోనే లెక్కలు వేసుకోవడంతో పూర్తి స్థాయి ఒప్పందానికి వీలు కుదరడం లేదు. రాష్ట్రపతి పాలనను ఎత్తి వేయించి బీజేపీని నిలువరించాలంటే మూడు పార్టీలు సాధ్యమైనంత వేగంగా నిర్ణయం తీసుకోవాలి. మూడు పార్టీలకూ ఇది తప్పని సరి అవసరమే. అయితే స్పీకర్ వంటి కీలక స్థానం, ప్రభుత్వం నడపడానికి కామన్ మినిమం ప్రోగ్రాం , ముఖ్యమంత్రి పదవిని నిర్దిష్ట కాలపరిమితితో పంచుకోవడం వంటివి తప్పనిసరి అంశాలు కాబోతున్నాయి. ముందరికాళ్లకు బంధాలు వేసుకుంటూనే నడవాల్సి ఉంటుంది. అటువంటి సర్కారు కొలువు దీరితే దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు తక్కువ. 2020లో మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయని కాంగ్రెసు నేత సంజయ్ నిరుపమ్ నోరుజారడంలోని ఆంతర్యమిదే. బీజేపీ కూడా అదే అంచనాతో ఉంది. శివసేన, కాంగ్రెసు, ఎన్సీపీల్లో చీలిక ఏర్పడి భారీగానే తమవైపునకు ఎమ్మెల్యేలు తరలివస్తారని ఆశిస్తోంది. అందుకే వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. రాష్ట్రపతి పాలనలోనూ మహారాష్ట్రలో మరికొంతకాలం అధికార చదరంగం , రాజకీయ వైకుంఠపాళి తప్పకపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News