ఎవరి గోల వారిదే....!

Update: 2018-10-12 15:30 GMT

తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు జట్టుకట్టాలని చూస్తున్న మహాకూటమిని అనుమానపు మబ్బులు కమ్ముకుంటున్నాయి. టీఆర్ఎస్ ను నిజంగా నిలువరించగలమా?అన్న సందేహాలు అందర్నీ వెన్నాడుతున్నాయి. అందులోనూ తమ మధ్య పొరపొచ్చాలు వెన్నుపోట్లకు దారితీస్తాయేమోనన్న భయం ఎలాగూ ఉంది. ఆశించిన సీట్లలో సగం కూడా దక్కకపోతే తమ పార్టీ శ్రేణుల మధ్య మొఖం చెల్లదని టీడీపీ, టీజేఎస్ నాయకులు వాపోతున్నారు. కాంగ్రెసు పెద్దన్నపాత్ర తో పెత్తనం చేస్తోందని ఇప్పటికే అలుకలు మొదలయ్యాయి. హస్తం పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ను ఓడించాల్సిన ముఖ్య బాధ్యత తమపై ఉందని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. అందువల్లనే టీడీపీ, టీజేఎస్ లు తొందరపెడుతున్నా తాము మాత్రం కంగారు పడటం లేదంటున్నారు. ఆలస్యంలో అప్రమత్తత దాగి ఉందంటున్నారు. ఈ మాత్రం దానికే మిత్రపక్షాలు అపార్థం చేసుకోవడం అనవసరమని కాంగ్రెసు నేతలు తేల్చేస్తున్నారు.

చేదు గతం....

అనుమానాలు వెన్నాడటానికి గతానుభవాలు కారణం. 2009లో విపక్షాలన్నీ మహాకూటమి కట్టాయి. అప్పటి అధికారపార్టీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా అంతా ఒకే తాటిపైకి వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకసూత్ర అజెండాతో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు ఒక గూటి పక్షులయ్యాయి. సీట్ల పంపిణీలో ఎవరిస్థాయిలో వారు రాజీ పడ్డారు. ఫలితం మాత్రం లభించలేదు. ఒంటి చేత్తో మహాకూటమిని కాంగ్రెసు మట్టికరిపించగలిగింది. దీనికి ప్రధాన కారణం మనస్ఫూర్తిగా విపక్షాలన్నీ సహకరించుకోలేదు. ఓటు మార్పిడి జరగలేదు. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థులు తాము పోటీ చేసిన స్థానాల్లో 70శాతం విజయం సాధించగలిగారు. టీఆర్ఎస్, వామపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో మూడొంతుల సీట్లు కాంగ్రెసు పరమైపోయాయి. కూటమి ఐక్య అభ్యర్థికి ఓట్ల బదలాయింపు జరగలేదు. తెలుగుదేశం పోటీ పడ్డ స్థానాల్లో ఓట్లు సంఘటితమయ్యాయి. టీఆర్ఎస్ కి మాత్రం టీడీపీ ఓట్లు జమ కాలేదు. వామపక్షాల విషయంలోనూ ఇదే తంతు పునరావృతమైంది. ఫలితంగా తెలంగాణలో కూటమి బోర్లాపడింది.

కారు తొక్కేస్తుంది...

మహాకూటమిని 2009లో ఓటమి పాలు చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయిపోయాక అసంతృప్తులను తెలివిగా రెచ్చగొట్టారు. కొన్నిచోట్ల అసమ్మతి వాదులు అభ్యర్థులుగా నిలిచేందుకు ఆర్థికంగా సహకరించారు. అంగబలం అందించారు. కూటమి లో చిచ్చు పెట్టారు. తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలుస్తామని ముందునుంచి కొంతమంది వర్కవుట్ చేసుకున్నారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా బలమైన అభ్యర్థులకు సైతం పార్టీ టిక్కెట్లు దక్కలేదు. దాంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగారు. కొన్నిచోట్ల పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మౌనం వహించారు. కానీ కూటమిలోని ఇతరపార్టీల అభ్యర్థులకు సహకరించలేదు. చాలాచోట్ల వెన్నుపోటు పొడిచారు. ఇది కాంగ్రెసుకు బాగా కలిసొచ్చింది. టీడీపీ నాయకత్వం ఈవిషయంలో కూటమికి నమ్మక ద్రోహం చేసిందనే విమర్శలు ఎదురయ్యాయి. నలభైకిపైగా స్థానాలు తీసుకున్న టీఆర్ఎస్ కేవలం పదిస్థానాల్లోనే విజయం సాధించింది. టీఆర్ఎస్ సొంతబలం ఉన్న స్థానాలు మినహా మిగిలిన ఏ ఒక్కనియోజకవర్గంలోనూ ఆపార్టీకి టీడీపీ సహకరించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ సైతం అప్పటి కాంగ్రెసు వ్యూహాన్ని అనుసరిస్తుందనే అనుమానం రాజకీయ వర్గాలను వెన్నాడుతోంది. కూటమి అభ్యర్థుల పేర్లు ముందుగా బయటికి వస్తే అసంత్రుప్తి వాదులను బరిలోకి దిగేలా ప్రోత్సహిస్తుందనే భయం కాంగ్రెసు నాయకుల్లో నెలకొంది. అదే జరిగితే కూటమి అభ్యర్థులు పరస్పర విశ్వాసరాహిత్యంతో పరాజయం పాలుకాకతప్పదు. కారు పొలిటికల్ జర్నీ సాఫీగా సాగిపోతుంది. ఇదే విపక్ష ఐక్యతకు గండి కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

హాట్ కేకులు...

మహాకూటమి పరంగా 30 వరకూ స్థానాలను హాట్ కేకులుగా భావిస్తున్నారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అవి. పాత హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ స్థానాలున్నాయి. కూటమిలో అన్నిపార్టీలూ వీటిపైనే దృష్టి పెట్టాయి. పెద్దన్న గా ఉన్న కాంగ్రెసు త్యాగాలకు సిద్దంగా లేదు. అదే సమయంలో తమకు బలముందని భావిస్తున్న సీట్లు వదులుకునేందుకు తెలుగుదేశం పార్టీ తయారుగా లేదు. వామపక్ష ఉద్యమం పేరుతో నల్గొండ, ఖమ్మం సీట్లు కావాలంటోంది సీపీఐ. ఉద్యోగ, యువజనవర్గాల్లో తమకు ఆదరణ ఉందని హైదరాబాదు, రంగారెడ్డి కోరుతోంది తెలంగాణ జనసమితి. సెటిలర్లు అండగా నిలవాలంటే గ్రేటర్ హైదరాబాదులో మూడింట రెండొంతులు తమకు కావాలంటోంది తెలుగుదేశం. ఈ సమీకరణల్లో చాలావరకూ రాజీపడితే తప్ప కూటమి పొత్తు సాపీగా సాగే సూచనలు కనిపించడం లేదు.

 

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News