త్యాగ ‘రాజీ’లు...!

Update: 2018-10-09 15:30 GMT

అధికార టీఆర్ఎస్ ఆశించింది ఒకటి. అయినది ఒకటి. పాక్షికంగానే ఫలితం లభించింది. తమ చేతుల్లో ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ ఎంతో కొంత జాప్యం చేసింది. అనుకున్నదానికంటే కొంత ఆలస్యమయ్యింది. ప్రతిపక్షాలు సంఘటితమయ్యేందుకు ఈ సమయం చాలు. అయితే ఆర్థిక ప్రయోజనానికి ఉపకరించే సంక్షేమ పథకాల అమలును కమిషన్ అడ్డుకోలేదు. అదే ఒకింత ఊరట. ఇది అధికారపార్టీకి లాభిస్తుందా? లేదా? కాలమే తేల్చి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ను గద్దె దించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న విపక్షాలు ఒక మెట్టు దిగేందుకు సిద్దమైపోతున్నాయి. రాజీ పడి కూటమి కట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ అధికార పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఒకటి ఒకటి కలిస్తే రెండే కావాలని లేదు. రాజకీయాల్లో అది నాలుగు కావచ్చు. అదృష్టాన్ని తారుమారు చేయవచ్చు. ఈ రాజకీయ సమీకరణే టీఆర్ఎస్ ను తికమక పెడుతోంది.

గురి తప్పిన బాణం...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. టీడీపీ కాంగ్రెసుతో కలిస్తే ఆ కూటమికి సమకూరే బలం, బలగం రెట్టింపు అవుతాయి. రెండుపార్టీల క్యాడర్ లోనూ జోష్ వస్తుంది. గడచిన 35 సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పాత్ర చాలా కీలకమైనది. ఇష్టం లేకపోయినా టీడీపీ లేఖ ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ముందరికాళ్లకు బంధం వేసి కాంగ్రెసు అనుకున్నది చేసేసింది. ఇదంతా ప్రజల దృష్టిలో ఉన్న విషయమే. క్రమేపీ క్షీణిస్తున్న పార్టీని పునరుజ్జీవింప చేయడానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. మహారాష్ట్ర సర్కారుపై బాబ్లీ ఉద్యమం వంటివి అందులో భాగమే. తాజాగా హస్తంతో చేయి కలపాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆంధ్రా నాయకుడు కావడం వల్ల ఆయనను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తే రాజకీయ ప్రయోజనం వస్తుందని టీఆర్ఎస్ భావించింది. కేసీఆర్ పెద్ద ఎత్తున ఆరోపణలతో కూడిన వాగ్బాణాలు సంధించారు. కానీ ఆశించిన ఫలితం లభించలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటువైపున ఉన్న చంద్రబాబు నాయుడు దీటుగా స్పందించి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ఉంటే కేసీఆర్ ఆశించిన ప్రయోజనం దక్కేది. అయితే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తక్కువగా స్పందించడంతో ప్రజల్లో ఆయనపట్ల సానుభూతి తప్ప వ్యతిరేకత ప్రబలడం లేదు. చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేస్తున్న విమర్శలు టీఆర్ఎస్ కు ప్రజల్లో పెద్ద మైలేజీ తెచ్చిపెట్టడం లేదు.

త్యాగం తనతోనే మొదలు...

మహాకూటమి యత్నాలకు కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పెద్ద ఆటంకంగా మారుతుందని ఇటీవలి కాలం వరకూ భావించారు. జనసమితిలో చాలామందికి ఎమ్మెల్యే గా పోటీ చేయాలనేది జీవితాశయం. గెలుపుపై వారికి పెద్దగా విశ్వాసం లేదు. అయితే టీజేఎస్ తరఫున నిలుచోవడం ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెసుతో పొత్తుపెట్టుకుంటే ఆశలు అడియాసలు కాకతప్పదు. అందుకే టీజేఎస్ లో చాలా మంది నాయకులు తమ పార్టీకి 40 స్థానాలు కావాలనే డిమాండు పెట్టారు. అయితే టీజేఎస్ కు నాలుగు లేదా అయిదుస్థానాలు మించి కేటాయిస్తే కూటమి పుట్టి మునడగం ఖాయమని కాంగ్రెసు అభిప్రాయం. కోదండరామ్ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అయితే ఇంతకాలం తనతో కలిసి నడిచినవారిని ఒప్పించడం సాధ్యం కావడం లేదు. టీజేఎస్ లో తమనుతాము అగ్రనాయకులుగా భావించుకునేవారు 20 మందివరకూ ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్టు కావాల్సిందేనని అడుగుతున్నారు. కూటమి కట్టి ఎన్నోకొన్ని సీట్లకు ఒప్పుకుని వాటిని మిగిలిన నాయకులకు కేటాయించి తాను పోటీ చేయకుండా ఉండాలనేది కోదండరామ్ యోచన. దీనివల్ల మిగిలిన నాయకులు మంకుపట్టు పట్టకుండా కూటమికి ఆమోదముద్ర వేస్తారనేది ఆయన ముందుచూపు.

హస్తం..అభయం...

కాంగ్రెసు పార్టీ అధిష్టానం మహాకూటమికి ఇప్పటికే ఆమోదముద్ర వేసేసింది. సీట్ల సంఖ్యపైన స్పష్టత నిచ్చేసింది. 25 సీట్ల వరకూ తెలుగుదేశం, సీపీఐ, జనసమితి,ఇతర చిన్న పార్టీలకు ఇవ్వవచ్చని టీపీసీసీ ఒక నివేదికను అందించింది. దానిని ఏఐసీసీ యథాతథంగా ఆమోదించినట్లు సమాచారం. అయితే కాంగ్రెసు బలంగా ఉన్న స్థానాలను వదులుకోకూడదని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో గెలిచిన స్థానాలు, ద్వితీయ స్థానంలో నిలిచిన సీట్లపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదనే సూచన ఏఐసీసీ నుంచి వచ్చినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం కూడా బలంగా ఉన్నస్థానాలపైనే దృష్టి పెడుతోంది. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు పార్టీలూ బలంగా ఉన్న సీట్లు పన్నెండు వరకూ ఉండొచ్చని అంచనా. ఆయా సీట్లలో ఒక అవగాహనకు వస్తే కచ్చితంగా అధికారపార్టీపై గెలుపు ఖాయమని పరిశీలకుల భావన. ఇక్కడ సర్దుబాటు చేయడం మాత్రం క్లిష్టమని కాంగ్రెసు పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో అవసరాలు ఉన్న దృష్ట్యా కొంతమేరకు తామే రాజీ పడాలని టీపీసీసీ తమ నియోజకవర్గ నాయకులకు చెబుతోంది. పార్టీ కి అదృష్టం కలిసొస్తే ఇతర పదవుల్లో త్యాగాలు చేసిన నాయకులకు స్థానం కల్పిస్తామని ముందస్తుగానే అభయమిస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News