మ‌న‌సున్నా.. మార్గం లేదట

ఆమె ఉన్న‌త విద్యావంతురాలు. కీల‌క‌మైన ప్ర‌పంచ స్థాయి ఉద్యోగాలు చేసిన అనుభ‌వం ఉంది. ఈ క్ర‌మంలోనే మామ గారు వేసిన రాజ‌కీయ‌బాట‌లో న‌డిచి.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని [more]

Update: 2019-09-21 00:30 GMT

ఆమె ఉన్న‌త విద్యావంతురాలు. కీల‌క‌మైన ప్ర‌పంచ స్థాయి ఉద్యోగాలు చేసిన అనుభ‌వం ఉంది. ఈ క్ర‌మంలోనే మామ గారు వేసిన రాజ‌కీయ‌బాట‌లో న‌డిచి.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆమెకు ప‌రిస్థితులు ఎక్క‌డా స‌హ‌క‌రించ‌డం లేదు. ఆవిడే.. ఒక‌నాటి సినీ హీరో.. రాజ‌మండ్రి మాజీ ఎంపీ మాగంటి ముర‌ళీ మోహ‌న్ కోడ‌లు మాగంటి రూపాదేవి. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ముర‌ళీ మోహ‌న్‌.. రాజ‌మండ్రి నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు అన్ని విధాలా రూపాదేవి సాయం చేశారు. పార్టీలోనూ చంద్ర‌బాబు మాగంటి రూపాదేవి సేవ‌ల‌ను వినియోగించుకున్నారు.

సేవా మిత్ర రూపకల్పనలో…..

ఈ నేప‌థ్యంలోనే ముర‌ళీ మోహ‌న్‌కి ఆరోగ్యం బాగోలేని ప‌రిస్థితి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి అన్నీ తానై ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు మాగంటి రూపాదేవి. దీంతో ఆమెకు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాలు కూడా ప‌టిష్ట‌మ‌య్యాయి. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వహించిన సేవా మిత్ర యాప్ రూప‌క‌ల్ప‌న‌, నిర్వ‌హ‌ణ‌లో ఆమె ఎంతో కీల‌కం అయ్యారు. ఇక‌, అనారోగ్య కార‌ణాల‌తో ముర‌ళీ మోహ‌న్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలకు దూర‌మ‌య్యారు. దీంతో మాగంటి రూపాదేవి త‌న మామ వేసిన రాజ‌కీయ బాట‌లో న‌డ‌వాల‌ని భావించారు.

పార్లమెంటు ఎన్నికల్లో…..

ఈ నేప‌థ్యంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి ఎంపీ టికెట్‌పై మాగంటి రూపాదేవి పోటీ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ, ఒక్క ఛాన్స్ ముందు మాగంటి రూపాదేవి ల‌క్ష పైచిలుకు ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. మాగంటి రూపాదేవిలోని చ‌ల‌కీత‌నం, ప్ర‌జ‌ల్లో ఉన్న క‌లివిడి.. సాంకేతిక ప‌రిజ్ఞానం, వాక్చాతుర్యం వంటి విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న పార్టీ అధినేత చంద్ర‌బాబు..మాగంటి రూపాదేవిని పార్టీలో కొన‌సాగాల‌ని కోరారు. మున్ముందు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని కూడా మాగంటిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన సంద‌ర్భంలో ఆయ‌న చెప్పుకొచ్చారు. మాగంటి రూపాదేవి కూడా చాలా ఇంట్ర‌స్ట్ చూపించారు.

కుటుంబ సభ్యుల వత్తిడితో….

అయితే, ముర‌ళీ మోహ‌న్ కుటుంబం మాత్రం ప్ర‌స్తుతం వ్యాపారాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాలని మాగంటి రూపాదేవిని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మ‌న‌కు ఈ రాజ‌కీయాలు స‌రిప‌డ‌వు… వ్యాపారాలు దెబ్బ‌తింటాయ‌ని… ముందుగా వ్యాపారాల్లోనే నిమ‌గ్నం కావాల‌ని ఆమెపై కుటుంబం నుంచి ప్రెజ‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని, ఇప్ప‌టి నుంచి వెళ్లి చేసేది ఏమీ ఉండ‌ద‌ని, ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చును మ‌ళ్లీరాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేద‌ని ఇలా త‌లంటిన‌ట్టు స‌మాచారం. దీంతో మాగంటి రూపాదేవి సైలెంట్ అయిపోయారు.

రాజమండ్రికి దూరంగా…..

చంద్ర‌బాబు అనేక ఉద్య‌మాల‌కు పిలుపునిస్తున్నా.. చేసేది లేక మాగంటి రూపాదేవి హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా మాగంటి రూపాదేవి డుమ్మా కొట్టేశారు. ఓట‌మి త‌ర్వాత ప‌లుసార్లు రాజ‌మండ్రి వ‌చ్చి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని.. రాజ‌కీయాల‌ను వ‌దిలే ప్ర‌శ‌క్తే లేద‌ని చెపుతున్నా ఫ్యామిలీ నుంచి ఆమెకు అంత‌గా స‌హ‌కారం లేనందున సైలెంట్ అయ్యార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు మాగంటి ఫ్యామిలీ పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News