ఉత్సాహంగా కాంగ్రెస్… సానుకూల వాతావరణం

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కన్పిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రచారంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వచ్చిన బీజేపీ అభ్యర్థులను తమ [more]

Update: 2020-09-17 17:30 GMT

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కన్పిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రచారంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వచ్చిన బీజేపీ అభ్యర్థులను తమ గ్రామానికి రావద్దంటూ పోస్టర్లు, రోడ్డు మీద రాతలతో గ్రామస్థులు స్వాగతం పలుకుతుండటం కమలం పార్టీలో కలవరం పుట్టిస్తుంది. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో బీజేపీ పార్టీలో కంగారు మొదలయింది.

ఉప ఎన్నికల్లో ఇబ్బందులు…..

మధ్యప్రదేశ్ లో మొత్తం 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి తమను గెలిపించాలని కోరుతూ ప్రజల వద్దకు వెళుతుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కమలం పార్టీ వారికే టిక్కెట్లు ఇవ్వాల్సి రావడంతో నియోజకవర్గాల్లో ప్రతికూలత కన్పిస్తుంది. దీనిని కాంగ్రెస్ చక్కగా వినియోగించుకుంటుంది.

ఆందోళనలో కమలం….

వరస ఘటనలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియాతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లడంతో వారిపై ప్రతికూలత వస్తుందని చౌహాన్ కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనిని అధిగమించేందుకు ఎలాల ముందుకు వెళ్లాలన్న దానిపై పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థులను మార్చే అవకాశం లేనప్పటికీ వారిని గెలిపించుకునే ప్రణాళికలను రచించాలని కేంద్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది.

ఉత్సాహంగా కాంగ్రెస్ …..

కాంగ్రెస్ జరుగుతున్న పరిణామాలపై ఉత్సాహంగా కన్పిస్తుంది. ఇప్పటికే పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. వారందరూ కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్న వారే. అభ్యర్థుల ఎంపికలో కూడా కమల్ నాధ్ ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించగలిగితే తిరిగి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది.ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కే సానుకూల వాతావరణం ఉందన్నది విశ్లేషకుల అంచనా. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను నియోజకవర్గాల్లో అడ్డుకుంటుంది కాంగ్రెస్ క్యాడరేనని పైకి కొట్టిపారేస్తున్నా లోలోపల మాత్రం ఆందోళన చెందుతోంది.

Tags:    

Similar News