ఇలాంటి వాళ్లవల్లనేగా ఎదగలేనిది…?

తెలంగాణాలో కాంగ్రెస్ బలోపేతం కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో కొందరు ముఖ్యనేతలు కూడా కారణమని చెప్పకతప్పదు. వారికి పార్టీతో అవసరం ఉంటేనే వస్తారు. పార్టీ అవసరాలకు మాత్రం [more]

Update: 2020-11-13 11:00 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ బలోపేతం కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో కొందరు ముఖ్యనేతలు కూడా కారణమని చెప్పకతప్పదు. వారికి పార్టీతో అవసరం ఉంటేనే వస్తారు. పార్టీ అవసరాలకు మాత్రం వారు ఉపయోగపడరు. అలాంటి నేతల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఒకరు. ఆయన అధికారంలో ఉంటేనే హల్ చల్ చేస్తారు. పవర్ లో లేకపోతే అస్సలు కన్పించను కూడా కన్పించరు.

ఆరేళ్ల పై నుంచి…..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి దాదాపు ఆరేళ్లు పైగానే అవుతుంది. ఈ ఆరేళ్లో మధు యాష్కీ కన్పించింది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత ఆయన ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ కొన్ని ప్రాంతాలకు ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికల్లో మాత్రమే మధు యాష్కీ దర్శనం లభించింది.

హైకమాండ్ తో సన్నిహిత సంబంధాలు….

మధు యాష్కీ వంటి నేతల కారణంగానే పార్టీ తెలంగాణలో బలోపేతం కావడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మధు యాష్కీకి నేరుగా రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఇక్కడి నతేలు ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా తగిన గౌరవం ఇవ్వాల్సిందే. తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వని నేతలపై హైకమాండ్ కు మధుయాష్కీ ఫిర్యాదు కూడా చేస్తారన్న టాక్ పార్టీలో ఉంది. మళ్లీ తాజాగా మధు యాష్కీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా కన్పిస్తున్నారు.

ఎప్పుడో ఒకసారి వచ్చి….

ఈయన ఈసారి పీసీసీ చీఫ్ పైనే గురిపెట్టినట్లు కన్పిస్తుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తనను తప్పించాలంటూ ఉత్తమ్ ఎప్పటి నుంచో హైకమాండ్ ను కోరుతున్నారు. కానీ హైకమాండ్ సరైన నేత కోసం వెదుకుతోంది. ఈ నేపథ్యంలో మధుయాష్కీ పీసీసీ చీఫ్ ను మార్చాల్సిందేనని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు మధుయాష్కీ లాంటి నేతలను పార్టీ దూరంగా పెడితేనే బాగుపడుతుందని సీనియర్ నేతలు సయితం వ్యాఖ్యానిస్తుండటం విశేషం. చుట్టపు చూపుగా వచ్చి పార్టీపై ఆధిపత్యం చేయాలనుకునే మధుయాష్కీ లాంటి వారివల్లనే పార్టీ ఎదగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News