బ్యాడ్ సెంటిమెంట్ ను బీట్ చేస్తారా?

రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ప‌దే ప‌దే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అనేక రాజ‌కీయ సెంటిమెంట్లు ప‌దే ప‌దే [more]

Update: 2020-09-22 15:30 GMT

రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ప‌దే ప‌దే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అనేక రాజ‌కీయ సెంటిమెంట్లు ప‌దే ప‌దే రిపీట్ అవుతున్నాయి. ఐదుసార్లు వ‌రుస‌గా ఓట‌మి లేకుండా గెలిచిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాకినేని పెద‌ర‌త్తయ్య, ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోసారి గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడిపోయారు. ఇక కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన నేత‌ల‌కు ఏదో ఒక సెంటిమెంట్ రిపీట్ అవ్వడం ఇక్కడ ఆన‌వాయితీగా వ‌స్తోంది. గుంటూరు న‌గ‌రంలో ఉన్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 1983 నుంచి గెలుస్తూ వ‌స్తోన్న నేత‌ల్లో ఒక‌రు త‌ప్ప రెండోసారి గెలిచిన నేత లేక‌పోవ‌డం ఒక సెంటిమెంట్ అయితే… ఇక్కడ గెలిచిన నేత‌లు త‌ర్వాత రాజ‌కీయ భ‌విష్యత్తు లేక సందిగ్ధంలో ప‌డిపోవ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది.

ఒకసారి గెలిచి….

టీడీపీ ఆవిర్భావానికి ముందు 1978 నుంచి చూస్తే ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన గాదె వీరాంజ‌నేయ శ‌ర్మ ఆ గెలుపుతో స‌రిపెట్టుకున్నారు. 1983లో టీడీపీ నుంచి నిశ్శంక‌ర వెంక‌ట‌ర‌త్నం విజ‌యం సాధించ‌గా ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ గెల‌వ‌లేదు. ఇక 1985, 1989లో మాత్రం కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు చ‌ద‌ల‌వాడ జ‌య‌రాంబాబు విజ‌యం సాధించారు. అయితే రెండుసార్లు గెలిచినా ఆయ‌న కూడా ఆ త‌ర్వాత రాజ‌కీయంగా క‌నుమ‌రుగైపోయారు. 1994లో టీడీపీ నుంచి గెలిచిన చ‌ల్లా వెంక‌ట కృష్ణారెడ్డి ఆ త‌ర్వాత టీడీపీ సీటు రాక 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఆ త‌ర్వాత ప‌లు పార్టీలు మారి రాజ‌కీయంగా ప్రాధాన్యత లేకుండా మిగిలిపోయారు.

రాజకీయ భవిష్యత్తు….

1999లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయిన శ‌న‌క్కాయ‌ల అరుణ‌కు చంద్రబాబు 2004లో సీటే ఇవ్వలేదు. దీంతో ఆమె రాజ‌కీయం అక్కడితోనే ముగిసింది. ఇక 2004లో ఇక్కడ గెలిచి నానా హ‌డావిడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంక‌ట్రావుకు వైఎస్ 2009లో సీటు ఇవ్వలేదు. దీంతో తాడిశెట్టి రాజ‌కీయంగా క‌నుమ‌రుగై గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ సీటు కోసం విఫ‌ల ప్రయ‌త్నం చేశారు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రి అయిన సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆ త‌ర్వాత ఎప్పుడూ గెల‌వ‌లేదు. ఆయ‌న‌కు అదే అఖ‌రు గెలుపు అయ్యింది. 2014లో కాంగ్రెస్ నుంచి, 2019లో బీజేపీ ఎంపీగా ఓడిపోయారు. పైగా నిన్నటి వ‌ర‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయ‌న ప‌ద‌వి కూడా ఊడింది.

మోదుగల సయితం…..

ఇక 2014లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే అసంతృప్త వాది అయ్యారు. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసి జ‌య‌దేవ్‌పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఆయ‌న్ను ప‌ట్టించుకునే వారే లేరు. ఓవ‌రాల్‌గా 1970వ ద‌శ‌కం నుంచి 2021 వ‌ర‌కు కూడా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క‌నిపించ‌డం లేదు. వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ బ్యాడ్ సెంటిమెంట్ కామ‌న్ అయ్యింది.

గిరి ప‌రిస్థితి అంతేనా…?

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ చిత్తుగా ఓడిన ఆ పార్టీ గెలిచిన రెండు సీట్లలో వెస్ట్ సీటు ఒక‌టి. ఇక్కడ నుంచి పోటీ చేసిన మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు గెలిచిన కొద్ది నెల‌ల‌కే బాబుపై తిరుగుబావుటా ఎగ‌ర‌వేసి వైసీపీ చెంత చేరిపోయారు. 2014లో తూర్పులో పోటీ చేసి ఓడిన గిరి 2019లో ప‌శ్చిమ‌లో గెలిచారు. ప్రస్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న పార్టీ మారినా వైఎస్సార్‌సీపీలో ఆయ‌న హ‌వా ఏంలేదు. ఇప్పటికే గుంటూరుప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసుర‌త్నం లాంటి నేత‌లు ఉన్నారు. వీళ్లను కాద‌ని గిరి మాట నెగ్గే ప‌రిస్థితి లేదు… వైఎస్సార్‌సీపీలో ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న గ్యారెంటీయే లేదు. ఇటు టీడీపీకి ఇప్పటికే దూరం కావ‌డంతో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తు కూడా రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారింద‌ని.. ఓవ‌రాల్‌గా వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో బ్యాడ్ సెంటిమెంట్‌కు గిరి ఫ్యూచ‌ర్ కూడా ముగిసిన‌ట్టే అన్న చ‌ర్చలు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గిరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను బీట్ చేసి రాజ‌కీయంగా నిల‌బ‌డ‌డం క‌ష్టంగానే ఉంది.

Tags:    

Similar News