గాలికి వదిలేస్తే ఇక అంతే?

ఒక అనివార్యమైన సంకట పరిస్థితిలో ప్రభుత్వంతో ప్రజలు కలిసి నడిచారు. ఒక్కరోజు విధించిన జనతా కర్ఫ్యూ మరో వారం రోజులకు పెరిగింది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు మేల్కొన్నప్పుడు [more]

Update: 2020-03-23 16:30 GMT

ఒక అనివార్యమైన సంకట పరిస్థితిలో ప్రభుత్వంతో ప్రజలు కలిసి నడిచారు. ఒక్కరోజు విధించిన జనతా కర్ఫ్యూ మరో వారం రోజులకు పెరిగింది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు మేల్కొన్నప్పుడు మాత్రమే కనిపించే సంఘీభావం భారత ప్రజల్లో ప్రస్ఫుటమైంది. మిలటరీ పాలన, కఠోరమైన ఆంక్షలతో ఉండే చైనా వంటి దేశాలే కరోనా ను కట్టడి చేయడానికి నెలల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. అందువల్లనే ఒక్క వారానికే మనం అదుపు చేయగలమన్న అంశంలోనూ సందేహాలున్నాయి. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలంటూప్రధాని పిలుపునివ్వడంలోని ఆంతర్యమదే. ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమైన మనదేశంలో ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువ. సాధారణ పరిస్థితుల్లో సర్కారీ ఆంక్షలను పెద్దగా పట్టించుకోరు. చట్టాలను సైతం ఏదో రూపంలో ఉల్లంఘించి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంటారు. కానీ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజల్లో కనిపించిన సంఘీభావం స్ఫూర్తిదాయకం. పెల్లుబుకిన స్వచ్ఛందభావన అవసరమొచ్చినప్పుడు అంతా ఒకే పంథాలో పయనిస్తామనే ప్రతినను చాటి చెప్పింది. మరిన్ని రోజులు ఇదే తరహాలో స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై తమను, కుటుంబాలను కాపాడుకొంటూ ఆరోగ్య భారత్ కు ఆసరా ఇవ్వాల్సి ఉంటుంది.

సర్కారీ చొరవ పెరగాలి…

ప్రభుత్వమిచ్చిన పిలుపును తూ.చ . తప్పకుండా పాటించడంతో ప్రజల్లో వచ్చిన అవగాహన తేటతెల్లమైంది. నిజానికి ఇది ఒకరోజు మాత్రమే అని సాధారణ ప్రజలు భావించారు. కానీ ఆదివారం ఒక్కరోజునే 81 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈనెల 31 వరకూ దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కు వెళ్లిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి మరీ తీవ్రంగా లేకపోయినా ముందు జాగ్రత్తగా కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. నిర్లక్ష్యానికి తీవ్రమైన ఫలితాన్ని చవిచూస్తూ వేలమంది ప్రజలను కోల్పోతున్న ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల ఉదాహరణలు మనకు కనువిప్పు. అంతటి పటిష్టమైన ప్రజారోగ్యవిధానం మనకు లేదు.ముందుజాగ్రత్తలతోనే నియంత్రించుకోవాలి. కరోనా సామాజిక విస్తరణ మొదలైతే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇందుకుగాను ప్రజల సహకారాన్ని సంపూర్ణంగా పొందాలంటే ప్రభుత్వం సైతం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాలి.

ఉద్యమ స్ఫూర్తి…

దేశంలో 90 శాతం పైగా ప్రజలు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. రోజువారీ పనులు, వ్యవసాయం, వ్యాపారాల ద్వారానే వారికి ఉపాధి దొరుకుతుంది. అందులోనూ 45 శాతం వరకూ పేదవర్గాలున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని వీరి విషయంలో ప్రభుత్వం ఇంటింటికి రేషన్ చేరేలా చూడాలి. లేకపోతే తమ అవసరాల కోసం వారంతా ప్రభుత్వ నిషేధాలను ఉల్లంఘించి రోడ్డెక్కే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిషేధాజ్ణలతో ప్రజలను దీర్ఘకాలం అదుపు చేయలేం. అవసరాలు తీరే ఏర్పాటు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలి. గోదాముల్లో ఉన్న ఆహారధాన్యాలను పంపిణీ చేసే చర్యలు చేపట్టాలి. ఆరోగ్య అత్యయిక పరిస్థితి ఆహార సంక్షోభంగా మారకుండా చూసుకోవాలి. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలిచ్చిన సహకారాన్ని సర్కారు సద్వినియోగం చేసుకోవాలంటే ఏ ఒక్కరు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడటం ప్రభుత్వ బాధ్యత. ఈదిశలో యంత్రాంగాలకు సూచనలు వస్తున్నట్లుగా తెలియడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం కొంతమేరకు కనీస ప్యాకేజీలు ప్రకటించాయి.

నియంత్రణ అవసరం…

నల్లబజారు, వ్యాపార దోపిడీ ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకునేందుకు చూస్తుంటాయి. ఇప్పటికే ధరలపై నియంత్రణ లేక అనేక పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాను సాకుగా చూపి అదనపు సొమ్ములు చేసుకునేందుకు ప్రయత్నించడం సహజం. పుష్కలంగా నిత్యావసరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తదు. ప్రజా రవాణాను నియంత్రించినప్పటికీ ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల రవాణాకు సంబంధించి స్వేచ్ఛనివ్వాలి. అవసరమైతే అదనపు సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడుతుంది. సాధారణంగా భారతీయుల్లో ఉండే మనస్తత్వం కారణంగా ఏదేని వస్తువుకు కొరత ఏర్పడబోతోందని తెలిసిన వెంటనే అదనపు కొనుగోళ్లు చేస్తారు. అవసరానికి మించి ఇంట్లో పెట్టుకోవాలని చూస్తారు. ఇది కొరతకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో పుష్కలంగా నిత్యావసరాలు దొరుకుతాయి. సరైన ధరలకే లభిస్తాయన్న భరోసాను ప్రభుత్వం కల్పించాలి. లేకపోతే ప్రజల్లో కలిగే అలజడి, ఆందోళన ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

ఇంటింటికీ సర్కారీ సేవలు…

ప్రజాసహకారాన్ని పాజిటివ్ కోణంలోకి మార్చుకోవాలంటే ఈ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగి పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రజల కంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం ఉంటాయి. అందుకే సర్కారు తన యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. మిగిలిన పనులన్నీ పక్కనపెట్టి ఆరోగ్యం, నిత్యావసరాల పంపిణీకి సర్కారీ శాఖలన్నిటికీ బాధ్యతలు అప్పగించాలి . ప్రజల సంచారంపై కేవలం నిషేధం విధించి, వారికి తగు ఏర్పాట్లు చేయకుండా గాలికి వదిలేస్తే మాత్రం ప్రమాదం. చైనా వంటి దేశాలు వ్యవస్థ మొత్తాన్ని కదిలించాయి. ఆదర్శంగా నిలిచాయి. అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. ప్రజలు మాత్రమే ఇళ్లకు పరిమితం కావాలి. ప్రభుత్వ సేవలు ఇంటింటికీ చేరాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News