కలసొస్తుందా? అసలు సినిమా చూపిస్తామంటున్న వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు తెలుగుదేశం పార్టీ బాగానే ప్రయత్నించింది. సక్సెస్ కాగలిగింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. అయితే [more]

Update: 2020-03-26 11:00 GMT

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు తెలుగుదేశం పార్టీ బాగానే ప్రయత్నించింది. సక్సెస్ కాగలిగింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మరింత కసితో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుుడు జరిగినా విజయం వైసీపీదే ఉండాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రీ షెడ్యూల్ కొన్ని చోట్ల చేసినా భయపడాల్సిన పనిలేదని, గతంకంటే ఎక్కువగా ఏకగ్రీవాలు చేయించుకోవడానికి ప్రయత్నించమని జగన్ ఆదేశించినట్లు తెలిసింది.

వాయిదాతో లాభమని….

నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాతో తెలుగుదేశం పార్టీ తమకు కలసి వస్తుందని భావించింది. నామినేషన్లు కొన్ని చోట్ల వేయనీయక పోవడం, మరికొన్ని చోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో అనేక మంది తమ అభ్యర్థులు నామినేషన్ లు వేయలేకపోయారని టీడీపీ వాదిస్తంది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ కు, గవర్నర్ కు పదే పదే ఫిర్యాదు చేసింది. ప్రధానంగా సీనియర్ నేతలున్న ప్రాంతాల్లోనూ ఏకగ్రీవాలు కావడంతో టీడీపీ ఎన్నికల వాయిదాను బలంగా కోరుకుంది.

రీషెడ్యూల్ జరిగినా….

అయితే ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు వారాల సమయం దొరికింది. ఎన్నికల కమిషనర్ మాత్రం ఏకగ్రీవాలు యధాతధంగా ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. పుంగనూరు, మాచర్ల లాంటి ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా రీషెడ్యూల్ ను పరిశీలిస్తామని చెప్పారు. ఇది కొంత వరకూ తెలుగుదేశం పార్టీకి ఊరటనిచ్చే అంశమే. సుప్రీంకోర్టు తీర్పుతో క్యాడర్ లో కొంత ధైర్యం పెరిగిందని చెబుతున్నారు. చంద్రబాబు కూడా నిత్యం టెలికాన్ఫరెన్స్ లో నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలపైనే నూరి పోస్తున్నారు.

కాపాడుకునే కార్యక్రమంలోనే….

కానీ వైసీపీ మాత్రం వాయిదా ముందు కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు కనపడుతోంది. ఇప్పటికే అక్కడ స్థానికంగా బలమైన నేతలకు గాలం వేస్తుంది. ఎన్నికలు తిరిగి ప్రారంభమయిన వెంటనే అభ్యర్థులు దొరకకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. ఇలా చేసి ఎన్నికల వాయిదా అయినా తమకు ప్రజలు పట్టం కట్టారన్న సంకేతాలు బలంగా వైసీపీ పంపదలచుకుంది. దీంతో టీడీపీ నేతలు అభ్యర్థులను కాపాడుకోలేక పోతున్నారు. క్యాంపులు నిర్వహించే శక్తి ఇప్పుడు లేదు. అందుకే టీడీపీ నేతలు కూడా అభ్యర్థులను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. మరి ఆరు వారాలు వీరిని తమ వైపు ఉంచుకోగలరా? అన్న సందేహం ఆ పార్టీలోనే ఉండటం విశేషం.

Tags:    

Similar News