ఈ పంచాయతీ ఇప్పట్లో తేలదా?

కొత్త ప్రశ్నలు తలెత్తినప్పుడే పరిష్కారాల కోసం అన్వేషిస్తాం. నూతన విధానాలు రూపుదిద్దుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎదురవుతున్న సమస్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. భవిష్యత్తులో రాజ్యాంగ పరిష్కారాలు [more]

Update: 2020-03-17 15:30 GMT

కొత్త ప్రశ్నలు తలెత్తినప్పుడే పరిష్కారాల కోసం అన్వేషిస్తాం. నూతన విధానాలు రూపుదిద్దుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎదురవుతున్న సమస్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. భవిష్యత్తులో రాజ్యాంగ పరిష్కారాలు రూపొందించుకోవాల్సిన అవసరాన్నిగుర్తు చేస్తున్నాయి. పరస్పర సైద్దాంతిక, రాజకీయ వైరుద్ధ్యాలున్న పార్టీలు వరసగా అధికారంలోకి వస్తే కొన్ని సమస్యలు సహజం. పార్టీలకు, ప్రభుత్వాలకు మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. పాలనకు సహజధర్మాలుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల రాజకీయం పరిధులు, పరిమితులు దాటేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ వ్యవస్థల మధ్య ఉండాల్సిన సమన్వయంపై నిర్దిష్ట విధివిధానాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో పార్లమెంటు నూతన చట్టాలు చేసి, అవసరమైతే రాజ్యాంగ సవరణలూ చేయడం ద్వారా కొన్ని ప్రశ్నలకు బదులు వెదకాల్సిన వాతావరణం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ఏర్పడింది.

ప్రాంతీయ పార్టీల పోరు…

కేంద్రంలో ఒక పార్టీ , రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ అంశాలపై పరస్పర ఆరోపణలు, విమర్శలు సహజంగానే తలెత్తుతుంటాయి. అభివృద్ధి పథకాలు మంజూరు చేయడం లేదు. నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదు అనే ఆరోపణలు గతంలో ఎక్కువగా వినవస్తుండేవి. ఇప్పుడు అధికారాల పోరు పెద్దదై కూర్చుంది. రాజ్యాంగంలో ప్రభుత్వాల బాధ్యతలు, అధికారాలకు సంబంధించి ఉమ్మడి జాబితా ఉంది. కేంద్ర, రాష్ట్రాల విడి జాబితా కూడా ఉంది. ఉమ్మడి జాబితాలో అంశాలపై ఎక్కువగా వివాదాలు వస్తుంటాయి. గతంలో సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించకుండా నిషేధం విధించడం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక వివాదానికి తెర తీశారు. అదే సమయంలో చట్టబద్ధమైన అధికారాలు ఉన్న ఆదాయపు పన్ను శాఖ విషయంలో చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు వ్యవహారాలతో సంబంధాలున్న టీడీపీ నేతలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళిపించింది. నిధులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సాగే రచ్చ నిరంతర పోరే. కానీ గత ప్రభుత్వం వర్సస్ ప్రస్తుత ప్రభుత్వం అన్న గొడవ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా ఆరునెలలుగా సెగలు రేపుతోంది. గత ప్రభుత్వం లో తీసుకున్ననిర్ణయాలపై పునస్సమీక్షలు జరిపి, అత్యధిక భాగం రద్దు చేయాలనుకొంది వైసీపీ సర్కారు. వీటిలో కొన్ని కేంద్రంతోనూ ముడిపడి ఉండటంతో అసలేం జరగబోతోందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

గతం వర్సస్ వర్తమానం…

సౌర విద్యుత్తు కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి విషయాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. ఆయా ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయించాలనే భావన ఒక కోణమైతే భారీ అవినీతి మరో కోణంగా కాంట్రాక్టు మొత్తాలు పెరిగాయనేది ఆరోపణ. వైసీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ పక్కన పెట్టింది. కొన్ని అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో ముడిపడిన ప్రాజెక్టులు కావడంతో కేంద్ర ప్రభుత్వానికి సైతం సెగ తగిలింది. పెట్టుబడి దారుల విశ్వాసం కోల్పోతే భవిష్యత్తులో దేశానికి అంతర్జాతీయ పరపతి దెబ్బతింటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా నిచ్చింది. అయితే చట్టపరంగా కేంద్రం జోక్యం చేసుకోవచ్చునా? లేదా? ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపై వచ్చే కొత్త ప్రభుత్వాలు కొనసాగించాలా? లేదా? ఇవన్నీ ప్రశ్నలే. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు పెద్దగా రాకపోవడంతో జాతీయంగా ఒక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.

రాజధానులపై కేంద్రానికి చిక్కులు…

ఆంధ్రప్రదేశ్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమూ తొలిసారి ఎదురవుతున్న ప్రశ్నే. సాధారణంగా ఈవిషయంలో కేంద్రం పాత్ర తక్కువ. రాష్ట్రాల్లో ప్రాంతాల వారీ డిమాండ్లు, సామాజిక సమీకరణలు పెరిగితే అన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో ఈ తరహా నిర్ణయాలకు వెళ్లాల్సి రావచ్చు. దీనిపై కేంద్రం చాలా లౌక్యంగా వ్యవహరిస్తోంది. రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని అంగీకరిస్తూనే గతంలోనే ప్రభుత్వం తన విచక్షణ మేరకు రాజధానిని నిర్ణయించుకున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరి కొత్త ప్రభుత్వానికి మార్చేఅధికారం ఉందా? లేదా? అంటే తేల్చడం లేదు. రాజ్యాంగ పరంగా ఈవిషయంలోనూ సందిగ్ధత ఉందనే ఒప్పుకోవాలి. అదే విధంగా తన నిర్ణయాలకు అడ్డుపడుతోందనే భావనతో శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. ఈవిషయంలో పార్లమెంటు ఎంత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు శాసనమండలి ఉన్నట్లా? లేనట్టా? దానిని సమావేశ పరిచేందుకు రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుందా? అన్న విషయాలపైనా సందిగ్ధత కొనసాగుతోంది.

స్థానిక పంచాయతీ పరాకాష్ఠ…

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం తీవ్రంగా విభేదిస్తోంది. స్థానిక సంస్థలు రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంటాయి. నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ, విజేతల ప్రకటన వరకే రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర పరిమితమవుతుంది. రిజర్వేషన్లు, ఎన్నికల గడువు వంటి అంశాలలో ప్రభుత్వమే కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. దీంతో స్థానిక ఎన్నికలనేవి రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటున్నాయి. గతంలో తెలుగుదేశం, ప్రస్తుతం వైసీపీ స్థానిక ఎన్నికలను తమ గుత్తాధిపత్య అధికారంగా భావించాయి. ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోయినా ఫర్వాలేదనే ధోరణిని అనుసరించాయి. రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వానికి పేచీ ఏర్పడింది. ఇప్పట్లో ఈ పంచాయతీ తేలేలా లేదు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇటువంటి వివాదాలు తలెత్తకుండా రాజ్యాంగం ద్వారానే ఒక పరిష్కారాన్ని కని పెట్టాల్సి ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా లోక్ సభ, శాసనసభలకు నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నికలు జరుపుతారు. అదే విధంగా స్థానిక సంస్థలకు నిర్దిష్ట కాలంలో ఎన్నికలు జరిపేలా రాజ్యాంగ సవరణ అవసరం. అప్పుడే పార్టీలు స్థానిక సంస్థలను గౌరవిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా స్థానిక ప్రతినిధులు సైతం ప్రజాస్వామ్యంలో తమతో సమానమన్న విషయాన్ని గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ కారణంతో వివాదాలు తలెత్తినప్పటికీ ఇదొక మంచి పరిష్కారానికి దారి తీస్తే మేలు. జాతీయ స్థాయిలో ఇటువంటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరికితే రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజ్యాంగ సంస్థలు రోడ్డెక్కాల్సిన దుస్థితి తప్పి పోతుంది. అనవసర పేచీలకు తెర పడుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News