అయ్యో.. ఆరు నెలలు ఆగాల్సిందేనా? అప్పటి వరకూ ఎలా?

ఏపీలో సీన్ కానీ దేశం మొత్తం పరిస్థితి కానీ చూసినపుడు కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే అందరి కర్తవ్యంగా కనిపిస్తోంది. ఇక రెండో ఆలోచన కూడా ఎవరికీ లేదు, [more]

Update: 2020-04-17 14:30 GMT

ఏపీలో సీన్ కానీ దేశం మొత్తం పరిస్థితి కానీ చూసినపుడు కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే అందరి కర్తవ్యంగా కనిపిస్తోంది. ఇక రెండో ఆలోచన కూడా ఎవరికీ లేదు, ఉండకూడదు కూడా. అయితే కరోనా ఎపుడు నెమ్మదిస్తుంది. మరెపుడు దేశం నుంచి వెళ్ళిపోతుందన్నదాని మీద ఇప్పటిదాకా ఎవరికీ ఏ రకమైన అంచనాలు లేవు. ప్రస్తుతానికైతే లాక్ డౌన్లు అలా పొడిగించుకుంటూ పోతున్నారు. మేధావులు, నిపుణుల మాట తీసుకుంటే కనీసంగా ఆరు నెలల వరకూ అన్ని రకాలైన జాగ్రత్తలు పాటించాల్సిందేనని అంటున్నారు. అంటే అప్పటి దాకా కరోనా పేరిట ఆంక్షలు తప్పనిసరిగా కొనసాగుతాయన్నమాట.

ఇక అంతేనా…?

ఈ నేపధ్యంలో చూసుకున్నపుడు ఏపీలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల తరువాతనే అంటున్నారు. ఇదే విషయాన్ని అధికారే పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు పెట్టే అవకాశ‌మే లేదు. కరోనా ఎంత త్వరగా అంతరించినా కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి కానీ స్థానిక ఎన్నికలు జరగవు. ఇదీ వైసీపీ నేతల మనోగతంగా ఉంది. అంటే ఎన్నికల మీద ఎన్నో కలలు కంటున్న అధికార పార్టీ నాయకులకు ఇది పచ్చి చేదు వార్త. ఏ విధంగానూ మింగుడు బాధ. ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దూకేసి జనంలో ప్రచారం చేస్తున్న అధికార పార్టీ అభ్యర్ధులు కూడా ఇపుడిపుడే వాస్తవంలోకి వస్తున్నారుట.

చమురు వదులుతోంది….

ఇక విశాఖ కార్పొరెషన్ కి నామినేషన్లు వేసారు. ప్రచారంలోకి దిగిపోయారు. మరో పది రోజులు గడిస్తే తామే కొత్త కార్పొరేటర్లమని కూడా సంబరపడ్డారు. కానీ సీన్ సితారైంది. ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతోనే అసలు కుంగిపోయారు. ఇపుడు కరోనా వైరస్ రావడంతో తెల్లారిలేస్తే కార్యకర్తలను, వారి ద్వారా జనాలకు సేవా కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున చేతి చమురు వదులుతోందని పోటీలో ఉన్న అధికార పార్టీ అభ్యర్ధులు వాపోతున్నారు. డబ్బు వరదలా ఖర్చు చేయాల్సివస్తోందిట. ఇవ్వకపోతే పోటీలో ఉన్న అభ్యర్ధిగా అటు జనంలోనూ, ఇటు క్యాడర్లోనూ చెడ్డపేరు. ఇస్తూంటే మాత్రం ఆ ధన ప్రవాహానికి అడ్డూ అదుపూ లేదుగా. ఎక్కడ ఆగుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

రద్దు అయితేనో..?

ఇక మరో రకమైన ఆలొచనలు కూడా అభ్యర్ధులకు కలుగుతున్నాయట. ఇపుడు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి స్థానిక ఎన్నికలు జరిపిస్తే తామే అభ్యర్ధులుగా ఉంటాం. ఒకవేళ మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు పెడితే, కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే అపుడు హైకమాండ్ మళ్లీ తమెకే టికెట్ ఇస్తుందన్న గ్యారంటీ లేదని కూడా వాపోతున్నారుట. ఇప్పటికే కరోనా బాధితులకు సహాయం పేరిట భారీగా ఉన్నది. దాచుకున్నదీ కూడా ఊడ్చేస్తున్న అభ్యర్ధులు ఎన్నికల నాటికి ఆర్ధికంగా చేతులెత్తేసేలా ఉన్నారు. అటువంటి వారిని పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇస్తే అన్ని విధాలుగా తాము అన్ని విధాలుగానూ నష్టపోతామని అభ్యర్ధులు గగ్గోలు పెడుతున్నారుట. ఈ విషయంలో అధికార వైసీపీలోనే అలజడి ఎక్కువగా ఉంది. అసలు స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వాయిదా వేశారో, ఈ కరోనా మహమ్మారి ఇలా మీదకు రావడమేంటో అంటూ చింతిస్తున్నారుట. చూడబోతే కరోనాకు చిక్కిన అసలైన బధితులము తామేనని పెడబొబ్బలు పెడుతున్నారుట.

Tags:    

Similar News