మంచి ఛాయిస్… నూరు శాతం అర్హుడే

అమెరికా రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుడు అత్యంత శక్తిమంతుడు. సర్వాధికారాలు అతని చేతిలో ఉంటాయి. ఆయన తరవాత ఉపాధ్యక్షుడు కీలకం. వీరిద్దరి తరవాత విదేశాంగ, రక్షణ మంత్రులు అత్యంత [more]

Update: 2021-01-03 16:30 GMT

అమెరికా రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుడు అత్యంత శక్తిమంతుడు. సర్వాధికారాలు అతని చేతిలో ఉంటాయి. ఆయన తరవాత ఉపాధ్యక్షుడు కీలకం. వీరిద్దరి తరవాత విదేశాంగ, రక్షణ మంత్రులు అత్యంత కీలకం. మొత్తం అధ్యక్షడి మంత్రివర్గంలో వీరు కీలక వ్యక్తులు. విదేశాంగ, రక్షణ మంత్రులుగా వీరు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్త పరిణామాలపై ఎప్పుడూఒక కన్నేసి ఉండాల్సి వస్తుంది. ప్రపంచ విషయాల్లో అగ్రదేశం పాత్ర తగ్గకుండా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్షణ మంత్రిగా వివిధ దేశాల్లో అమెరికా సైనిక బలగాల పాత్ర, మోహరింపు, తరలింపు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి నివేదించడం, ఆయన నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగడం రక్షణమంత్రి బాధ్యత. ఇప్పుడు పెంటగన్ అధిపతిగా ఆస్టిన్ ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలరని భైడెన్ బలంగా నమ్ముతున్నారు. అమెరికా రక్షణ కార్యాలయాన్ని ‘పెంటగన్’ అని వ్యవహరిస్తారు.

విశ్వసనీయ వ్యక్తికే…..

ఇంతటి కీలకబాధ్యతలను నిర్వహించే వ్యక్తి అధ్యక్షుడికి అత్యంత విశ్వసనీయుడై ఉండాలి. ఆయన ఆదేశాలను తుచ తప్పకుండా పాటించేవ్యక్తి అయి ఉండాలి. ఆ పాత్రకు లాయిడ్ ఆస్టిన్ ను ఎంపిక చేసుకున్నారు నూతన అధ్యక్షుడు జో బైడెన్. ఆస్టిన్ అనేక ప్రత్యేకతలు గల నాయకుడు. రక్షణమంత్రి పదవికి నూరుశాతం అర్హుడు. అమెరికాలో మంత్రులను సెక్రటరీ అని వ్యవహరిస్తుంటారు. అమెరికన్ పరిభాషలో చెప్పాలంటే ఆస్టిన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్. 67ఏళ్ల ఆస్టిన్ అగ్రరాజ్య 27వ రక్షణ మంత్రి. ఆఫ్రో అమెరికన్. కీలకమైన రక్షణశాఖ పగ్గాలు చేపట్టిన నాయకుడిగా తొలి ఆఫ్రో అమెరికన్ గా ఆస్టిన్ అమెరికా చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పటివరకు శ్వేత జాతీయులకే ఈ పదవి లభిస్తూ వచ్చింది. శ్వేత జాతేతర వ్యక్తులకు లభించడం ఇదే తొలిసారి. తమ సంతతికి చెందినవారికి ఏదో ఒక కీలక పదవి ఇవ్వలని ఆఫ్రో అమెరికన్లు ఎప్పటినుంచో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ను కోరుతూ వస్తున్నారు. ఆస్టిన్ ను తన సహచరుడిగా ఎంపిక చేసుకోవడం ద్వారా బైడెన్ వారి కోరికను మన్నించారు.

రక్షణ మంత్రిగా తీసుకోవాలంటే?

ఆస్టిన్ నియామకానికి అమెరికా సెనెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. మిలటరీ అధికారిగా ఆయన పదవీ విరమణ చేసి నాలుగేళ్లు కావస్తోంది. అమెరికా నిబంధనల ప్రకారం మిలటరీ అధికారిగా పని చేసిన వ్యక్తి ని రక్షణమంత్రిగా తీసుకోవాలంటే పదవీ విరమణ తరవాత ఏడేళ్ల వ్యవధి ఉండాలి. లేని పక్షంలో సెనెట్ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత రక్షణమంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఈ తరహాలోనే సెనెట్ ఆమోదంతోనే కీలక మంత్రి పదవి చేపట్టారు, బరాక్ ఒబామా హయాంలో 2013 నుంచి 2016 వరకు ఆస్టిన్ సెంట్రల్ కమాండ్ ఇన్ చీఫ్ గా పని చేశారు. ఈ హోదాలో అఫ్గానిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్ ల్లో అమెరికా బలగాల మోహరింపు, పర్యవేక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు.

ఉన్నత విద్యావంతుడు కావడంతో…..

1953 ఆగస్టులో జన్మించిన ఆస్టిన్ ఉన్నత విద్యావంతుడు. ఆబర్న్ విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వెబ్స్ ర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య శాస్ర్తంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో వివిధ హోదాల్లో విశిష్టమైన సేవలు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దళాల పట్టును కాపాడేందుకు, సైన్యం ప్రతిష్టను పెంచేందుకు త్రికరణ శుద్దిగా పనిచేశారు. ఇప్పుడు రక్షణమంత్రిగా ఆ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించగలరన్న నమ్మకంతోనే ఆయనకు బైడెన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. బైడెన్ నాయకత్వంలో అగ్రరాజ్యం పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని, ఈ విషయంలో అమెరికా సమాజం తనకు సహకరించాలని ఆయన కోరుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News