అద్వానీ ద స్టార్ …!!

భారతీయ జనతాపార్టీ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన యోధుడు. అధికార పథానికి రథ సారథి. హిందూ వాదనను ఇంటింటికీ చేర్చిన ప్రచారకుడు. రామజన్మభూమిని రణన్నినాదంగా మార్చిన బోధకుడు. సంకీర్ణ పక్షాల [more]

Update: 2019-03-23 16:30 GMT

భారతీయ జనతాపార్టీ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన యోధుడు. అధికార పథానికి రథ సారథి. హిందూ వాదనను ఇంటింటికీ చేర్చిన ప్రచారకుడు. రామజన్మభూమిని రణన్నినాదంగా మార్చిన బోధకుడు. సంకీర్ణ పక్షాల మధ్య సమన్వయం సాధించగల సంధానకర్త. ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ రాజకీయ చరమాంకంలో క్రియాశూన్యంగా నిష్క్రమించాల్సి వస్తోంది. అనుచితమైన,అమర్యాదకరమైన రీతిలోనే 70 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ముగిస్తున్నారు అద్వానీ. తన వెంట తిరుగుతూ రాజకీయ ఓనమాలు దిద్దుకున్న ప్రియ శిష్యులే ఆయన కెరియర్ కు తెర వేసేశారు. మూలన కూర్చోబెట్టేశారు. ఆశించిన అత్యున్నత పదవులేమీ ఆయనకు దక్కలేదు. అర్హత, అనుభవం, పరిణతి కలబోసుకున్నప్పటికీ ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులు దరి చేరకుండానే చేజారిపోయాయి. మోడీ, షాల ద్వయం రాజకీయాల్లో గురుశిష్య సంబంధాలేమీ పనిచేయవని నిర్ద్వంద్వంగా నిరూపించింది. అవకాశాలు, అవసరాలు మాత్రమే రాజకీయాలను నడుపుతాయని తమ చేతలతో చాటిచెప్పారు.

ఆ శకం ముగిసింది…

వాజపేయి, అద్వానీ భారతీయ జనతాపార్టీకి రామలక్ష్మణులు. జనసంఘ్ కాలం నుంచే పెనవేసుకున్న వారి బంధం పార్టీ నిర్మాణం మొదలు అధికార సాధన వరకూ కలిసి సాగింది. మనసులో ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ వాజపేయి గీచిన గీత దాటకుండా అంకితభావంతో పనిచేశాడాయన. అటల్ అధికారపదవులు అధిష్టించడానికి సోపానంగా ఉపకరించాడు. పధ్నాలుగేళ్ల వయసులోనే సంఘ్ సిద్ధాంతాలతో ప్రభావితుడై సభ్యుడయ్యారు. అయిదో దశకంలో ఆవిర్భవించిన జనసంఘ్ తో తొలి దశనుంచి భాగస్వామి అయ్యారు. రాజకీయ కార్యకలాపాలు చేపట్టారు. ఈక్రమంలోనే ఎదుగుతూ 1970 ల నుంచి నేటి వరకూ అత్యున్నత చట్ట సభ పార్లమెంటులో ఏదో రూపంలో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. జనతాపార్టీ ప్రభుత్వ వైఫల్యం తర్వాత జనసంఘ్ మద్దతు దారులతో 1980లో భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపనకు వాజపేయి, అద్వానీ లు చేతులు కలిపారు. వాజపేయి గడచిన ఏడాది భౌతికంగా నిష్క్రమిస్తే 17 వ సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీ బలవంతపు రాజకీయ నిష్క్రమణకు గురయ్యారు. భారత రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖుల శకం దీంతో అంతరించినట్లే చెప్పుకోవాలి.

నిత్యం సైనికుడే…

వాజపేయి సౌమ్యుడు. అందుకే ఆయనకు పదవులన్నీ సహజంగానే వచ్చి చేరుతుండేవి. కానీ అద్వానీ పోరాట యోధుడు. రథయాత్ర, రామజన్మభూమి ఉద్యమం అన్నీ సంఘర్షణాత్మక ఘట్టాలే. రెండు సీట్లనుంచి పార్టీ ని 282 స్థానాలకు చేర్చిన ఆందోళనలే. కేసులు ఎదుర్కొన్నారు. సంఘర్షించారు. పార్టీని పెంచారు. సారథిగానే మిగిలిపోయారు. చివరి వరకూ ఆయన పెద్దగా ఏమీ కోరలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఉప ప్రధాని వంటి పదవులు వచ్చినప్పుడు వాటికి న్యాయం చేశారు. అభినవ సర్దార్ పటేల్ అని తన పనితీరుకు ముద్ర వేసేశారు అభిమానులు. అయితే అద్వానీని పూర్తిగా పాజిటివ్ కోణంలోనే భారతదేశం చూడలేదు. మైనారిటీలను సంత్రుప్తి పరిచే రాజకీయ వ్యూహంలో అధికారపార్టీలు కూరుకుపోయినప్పుడు దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెజార్టీ హిందువులను ఒక రాజకీయ ప్లాట్ ఫారం మీదకు తెచ్చే యత్నం చేశారు. దాంతో భారతీయ జనతాపార్టీ బలపడగలిగింది. ఈ క్రమంలో బాబ్రీ మసీదు కూల్చివేత వంటి దురద్రుష్టకర ఘట్టాల్లో అద్వానీ పై చెరగని మచ్చ పడింది. దానిని తోసిపుచ్చలేం. మతపరమైన విభజనకు అద్వానీ కారకుడయ్యాడనే విమర్శలు ఎదురయ్యాయి. అయితే భారత, పాక్ విభజనకు మతమే కారణం కావడం, పాకిస్తాన్ లో పుట్టిన అద్వానీ భారత్ కు వలసరావడాన్నీ ద్రుష్టిలో పెట్టుకోవాలి.

యుద్ధనీతి.. అదే రీతి…

నరేంద్రమోడీ, అమిత్ షా ల ఎదుగుదలకు అద్వానీ చాలా క్రుషి చేశారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్రమోడీని పక్కనపెట్టాలని వాజపేయి నిర్ణయించారు. మిత్రపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి రాజధర్మం పాటించని సీఎం కు చాపచుట్టేయాలని వాజపేయి తలచారు. ఆ సమయంలో అద్వానీ జోక్యం చేసుకున్నారు. బీజేపీ భవిష్యత్తుకు మోడీ వంటి నాయకుడి అవసరముందని అటల్ కు నచ్చ చెప్పి మోడీని కొనసాగింపచేశారు. అమిత్ షా కు గాంధీ నగర్ లో తన పోల్ మేనేజర్ గా అవకాశం కల్పించారు అద్వానీ. యుద్ధంలో గురుశిష్య సంబంధం, కుటుంబ సంబంధాలు ఉండవు. విజయం సాధించడమే ముఖ్యం. రాజకీయంలోనూ అంతే. ఈ రోజున అద్వానీని రాజకీయంగా పక్కనపెట్టేయడంలో మోడీ , షాల దే ప్రధాన పాత్ర అని పార్టీలో అందరూ చెబుతున్నారు. 2017లో రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ మోడీ పక్కనపెట్టేశారు. అద్వానీ సీనియర్. తన అజెండా ఆచరణలోకి తీసుకురావడంలో ఎప్పుడైనా రాజ్యాంగబద్ధ పదవితో అడ్డుపడవచ్చని అనుమానించారు. ఆయనకు రావాల్సిన ప్రధాని పదవిని తానే దక్కించుకున్నారు. హోదారీత్యా ఇంకా పెద్ద గా పేర్కొనే రాష్ట్రపతి పదవికి కనీసం పరిశీలన చేయలేదు. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ నేటి రాజకీయాలపట్ల వైముఖ్యం పెంచుకున్న అద్వానీ ఇక శాశ్వతంగా దూరంగా ఉండాల్సి రావచ్చు. భారత ప్రజాస్వామ్యంలో ఆయన సృష్టించిన చరిత్ర మాత్రం శాశ్వతం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News