తేలేదెన్నడో…తేల్చేదెప్పుడో?

శాసనమండలి రాష్ట్రాల్లో రెండో సభ అయిన ఎగువ సభ ఉండాలా? వద్దా? అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. [more]

Update: 2020-02-09 16:30 GMT

శాసనమండలి రాష్ట్రాల్లో రెండో సభ అయిన ఎగువ సభ ఉండాలా? వద్దా? అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలంటూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం కేంద్రానికి వెళ్లిన నేపథ్యంలో జాతీయ స్థాయిలోనూ చర్చ మొదలయింది. అసలు శాసనమండలి ఉండాలా? వద్దా? ఉంటే ఎందుకుండాలి? ఉండకపోతే ఎందుకు? అన్న అంశాలపై మేధావులు, రాజకీయ నాయకులు, న్యాయ, రాజ్యాంగ నిపుణులు ఎవరి వాదనలను వారు విన్పిస్తున్నారు. అయితే ఎక్కువగా రాజకీయ కోణంలోనే చర్చ జరుగుతోంది తప్ప వాస్తవాల ప్రాతిపదికగా చర్చ జరగడం లేదు.

నాడు ఎన్టీఆర్…నేడు జగన్…..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదో దశకంలో నందమూరి తారక రామారావు రద్దు చేసినా, విభజిత రాష్ట్రంలో నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శానసమండలిని రద్దు చేసినా అందుకు కారణం రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు 90 మంది సభ్యులు గల సభలో 80 మందికి పైగా విపక్ష కాంగ్రెస్ వారే. రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ ను నాడు శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు చీల్చి చెండాడే వారు. నేడు ఏపీ శాసమండలిలోనూ మెజార్టీ సభ్యులు విపక్ష తెలుగుదేశం వారే. అప్పట్లో ఎన్టీఆర్ మాదిరిగా ఇప్పుడు జగన్ ను శాసమండలిలో విపక్షం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో శాసనమండలి రద్దుకు పునాది పడింది. అప్పట్లో ఎన్టీఆర్ మాదిరిగా ఇప్పుడు జగన్ కూడా అఖండ మెజారిటీతో ఎన్నికయిన వారే కావడం గమనించదగ్గ విషయం.

స్థాయి సంఘం ఏర్పాటు చేసినా….

డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ సభలో శాసనమండలిపై విస్తృత చర్చ జరిగింది. చివరకు ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయాలంటూ వాటికే వదిలేశారు. దీంతో గత కొన్ని దశాబ్దాలుగా శాసనమండలి కావాలని కొన్ని, వద్దని కొన్ని రాష్ట్రాలు కోరుతూ వచ్చాయి. వద్దన్న రాష్ట్రం ఇప్పుడు ఏపీ ఒక్కటే. ప్రస్తుతం ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తమకు ఎగువ సభ కావాలని కోరుతున్నాయి. తమిళనాడులో శాసనమండలికి సంబంధించి పెద్ద కథే నడిచింది. 1989 నాటి అన్నాడీఎంకే సర్కార్ మండలిని రద్దు చేసింది. 2010లో నాటి డీఎంకే సర్కార్ శాసనమండలిని పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. 2012లో అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్లీ శాసనమండలి అవసరం లేదని తీర్మానించింది.

కమిటీ సూచనలను …..

2013లో ఆనాటి శాసనమండలి పునరుద్ధరణ అంశం పార్లమెంటు ముందుకు వచ్చింది. దీనిపై నాటి రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడైన శాంతారామ్ నాయక్ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయి సంఘం ఏర్పాటయింది. నాయక్ గోవా కాంగ్రెస్ నాయకుడుగా గత ఏడాది కన్నుమూశారు. స్థాయి సంఘంలో పార్లమెంటు ఉభయ సభల నుంచి మొత్తం 31 మంది సభ్యులున్నారు. వీరిలో దివంగత రామజెట్మలానీ, ప్రస్తుత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ న్యాయనిపుణుడు అభిషేక్ సింఘ్వి, డీఎంకే కు చెందిన టీఆర్ బాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ తదితరులు సభ్యులు. కమిటీ విషయాలన్నీ విభిన్న కోణాల్లో లోతుగా చర్చించింది. మేధావులు, నాయకులు, రాజ్యాంగ కోవిదులతో చర్చించింది. వారి విలులైన సలహాలు, సూచనలను కలిసి తన నివేదికను కమిటీ సర్కార్ కు సమర్పించింది. రాష్ట్రస్థాయిలో రెండో సభ విషయం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అంశమని కమిటీ పేర్కొంది. రాష్ట్రం కోరితే రద్దు చేయడం, పునరుద్ధించడం వంటి పాత్రలో కేంద్రం పరిమితం కారాదని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా కమిటీ సూచించింది. నాయకుల ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా వాస్తవిక ప్రాతిపదికన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. పదేళ్లవుతున్నా ఆ సిఫార్సుకు దిక్కూ మొక్కూ లేదు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News