జగన్ అంటే …ఎర్రన్నలకు కన్నెర్ర ఎందుకో ?

వామపక్షాలకు తమ బలం తామే తెలుసుకునే అవకాశం రాకపోవడం, వారు సైతం ఎపుడూ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం బాధాకరమే. ఒకనాడు ఏపీ రాజకీయాల్లో అతి కీలకమైన [more]

Update: 2020-05-29 09:30 GMT

వామపక్షాలకు తమ బలం తామే తెలుసుకునే అవకాశం రాకపోవడం, వారు సైతం ఎపుడూ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం బాధాకరమే. ఒకనాడు ఏపీ రాజకీయాల్లో అతి కీలకమైన పార్టీలుగా ఉన్న కామ్రేడ్స్ తరువాత కాలంలో ఎందుకు అలా పడిపోయామో ఎపుడైనా ఆలోచించుకున్నాయా అన్న సందేహాలు ఉన్నాయి. రాజకీయాల్లో ముందు భాగాన ఉండాలంటే చావోరేవో తేల్చుకోవాలి. జనం గొంతుకగా మారాలి. నిజానికి అన్ని పార్టీల కంటే వామపక్షాలు ఆ దిశగా ముందు నుంచి ఉన్నాయి. కానీ గత కొన్ని దశాబ్దాలుగా వామపక్షాల రాస్తా మారుతూ వస్తోంది. వారు గొంతులో కూడా కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఏపీ వరకూ చూసుకుంటే వామపక్షాలు జత కట్టని పార్టీ ఆంటూ ఉంటే అది వైసీపీ ఒక్కటే. అన్ని పార్టీలతో భుజం భుజం కలిపేశాక ఇక మళ్ళీ పొద్దు తిరుగుడు పూవులా పచ్చ పార్టీ వైపే చూపు నిలిచినట్లుంది.

ఎందుకు ద్వేషమో…?

వామపక్షాలకు జగన్ సర్కార్ మీద ఎందుకు ద్వేషమో ఎవరికీ అర్ధం కాదు, తెలుగుదేశానికి వైసీపీ రాజకీయ వైరం ఉందటే ఆ కధ వేరు. పైగా టీడీపీ ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శలు ఉండనే ఉన్నాయి. మరో వైపు జనసేన తీరు చూసుకుంటే కొంత అసూయ, మరికొంత రాజకీయ మిడి మిడి తెలివి అలా అన్నీ కలగలసి ఆ పార్టీ వైఖరి ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ జగన్ సర్కార్ విషయంలో వామపక్షాలు గట్టిగా ద్వేషించడానికి కారణం లేదనిపిస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది వారి డిమాండే. ఇక హెల్త్ వర్కర్ల జీతాలు పెంచాలని ఎన్నో ఆందోళనలు చేశారు. అలాగే కొత్తగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని డిమండ్ చేస్తూ వచ్చారు. పేదలకు సంక్షేమం చూడాలని కోరేది వారే. మరి జగన్ ఇవన్నీ అమలు చేస్తున్నాడు కానీ వారు మాత్రం గుడ్లురుముతూనే ఉన్నారు.

పెత్తందార్ల వైపా…?

అమరావతి రాజధాని విషయంలో టీడీపీ యాగీ చేస్తే సరేననుకోవచ్చు కానీ వామ‌పక్షాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయో వారే జవాబు చెప్పాలి. అక్కడ రాజధానికి భూములు ఎలా సమీకరించారో వారికి తెలియనిది కాదు కదా. పేదలు అమరావతి రాజధానిలో ఉండగలరా అని గుండె మీద చేయి వేసుకుని ఎర్రన్నలు చెప్పగలరా. ఇక పేదలకు జగన్ ఇళ్ళప‌ట్టాలు లక్షల్లో పంచుతూంటే కూడా వామపక్షాల నోటి వెంట మంచి మాట రావడం లేదు. అంటే పెత్తందార్ల వైపు ఉంటూ వస్తున్న ఇతర బూర్జువా పార్టీల మాదిరిగానే మారిపోయాయా అనిపిస్తోంది.

పచ్చ గొంతుకతో…?

ఇక వామపక్షాల్లో సీపీఐ మరీ దారుణంగా తీరు ఉంది. ఏపీలో రామక్రిష్ణ, నారాయణ చంద్రబాబు వంతే పాడుతున్నారనుకోవాలి. జగన్ ని ఒక్క విషయంలో కూడా మెచ్చుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అనాగరిక పాలన అని నారాయణ అంటున్నారు. సాక్షాత్తూ మహిళా తహ‌శీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టి ఒక ఎమ్మెల్యే కొట్టినపుడు కానీ, విజయవాడలో కాల్ మనీ పేరిట అమాయక బడుగు మహిళల సెక్స్ రాకెట్ కధలు బయటపడినపుడు వామపక్షాలకు ఈ మాటలు ఎందుకు రాలేదో అర్ధం కాదు. ఇక వైఎస్సార్, చంద్రబాబు చేసిన అభివ్రుధ్ధిలో జగన్ పదవ వంతు కూడా చేయలేదని తాజాగా ఒక మీడియా చర్చలో నారాయణ అంటున్నారు. ఇది పూర్తిగా పక్షపాతం తో కూడిన మాటగానే చూడాలేమో. ఎందుకంటే ఒకవేళ వారిద్దరూ చేశారనుకున్న వారు పాలించినది జగన్ కంటే ఇప్పటికైతే ఎక్కువ కనుక ఆ పోలిక సరిపోదు.మరో వైపు ఆలోచిస్తే జగన్ ఏడాదిలో చేసిన అనేక కార్యక్రమాలు ఎర్రన్నలకు కనబడడంలేదంటే కన్నెర్ర తప్ప వేరేమీకాదు. ఇలాగే వారి రూట్ ఉంటే మాత్రం పార్టీల రేపటి జాతకం తేలిగ్గానే చెప్పేయవచ్చు.

Tags:    

Similar News