లెఫ్ట్ పార్టీలకు మన లీడర్లున్నా....!

Update: 2018-09-26 16:30 GMT

జాతీయ పార్టీలకు తెలుగు దిగ్గజాలు నాయకత్వం వహించడం కొత్తేమీకాదు. గతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నాయకులు అఖిల భారత పార్టీలకు సారథ్యం వహించి వాటికి వన్నె తెచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పునపాకం ఆనందాచార్యులు, కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య, అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, తెలంగాణకు చెందిన పాములపర్తి వెంకట నరసింహారావు కాంగ్రెస్ సారథులుగా చరిత్ర సృష్టించారు. ఇక వామపక్ష పార్టీలకు కూడా తెలుగు వారు నాయకత్వం వహించారు. సీపీఎం వ్యవస్థాపక అధ్యక్షుడు పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాకు చెందిన వారు. సీపీఐకి సారథ్యం వహించిన చండ్ర రాజేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. వీరిద్దరూ ఆయాపార్టీల కోసం జీవితాలను ధారబోశారు. భారతీయ జనతా పార్టీకి కూడా నెల్లూరుకు చెందిన వెంకయ్యనాయుడు అధ్యక్ష బాధ్యతలను పోషించిన సంగతి తెలిసిందే.

సీతారాం ఏచూరి.....

ఇప్పుడు కూడా ఇద్దరు తెలుగువారు జాతీయ పార్టీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వారే సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీతారాం ఏచూరి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచే వామపక్ష విధానాల వైపు ఆకర్షితులయ్యారు. 1952 ఆగస్టు 12న జన్మించారు. తండ్రి సోమయాజులు ఆర్టీసీ లో ఇంజినీర్, తల్లి కల్పకం అప్పటి ఏపీ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. పదో తరగతి వరకూ హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ స్కూల్లో చదివారు. 1969లో తలెంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ వెళ్లారు. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ చదివారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. అనంతరం పీ.హెచ్.డి లో చేరారు. విద్యాభ్యాసం అనంతరం పార్టీ విద్యార్థి విభాగం ఎప్ఎఫ్ఐ లో చురుగ్గా పనిచేశారు. కేరళ, బెంగాల్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎస్ఎఫ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి నాయకుడు ఆయనే. క్రమంగా సీపీఎం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అత్యవసర పరిస్థితి కాలంలో జైలు కెళ్లారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. ప్రకాశ్ కారత్ స్థానంలో 2015 ఏప్రిల్ 19న పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన రెండో ఆంధ్రుడు ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారాం ఏచూరి చట్ట సభలో ప్రభుత్వ విధానాలపై పోరాడటంలో ఎప్పుడూ ముందుంటారు.

సురవరం....

సీపీఐకి సారథ్యం వహిస్తున్న మరో తెలుగు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన 1942 మార్చి 25న జన్మించారు. కర్నూలు మున్సిపల్ హైస్కూల్ లో ప్రాధమిక విద్య అనంతరం, అదే నగరంలో బిఏ చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లో చురుగ్గా పనిచేశారు. అనంతరం పార్టీలో క్రియా శీలక నాయకుడిగా ఎదిగారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పై డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రెండుసార్లు నల్లొండ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998, 2004 ల్లో కాంగ్రెస్ తో పొత్తుతో ఆయన విజయం సాధించారు. ఎంపీగా అనేక పార్లమెంటరీ సంఘాల్లో పనిచేశారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ పోరాట యోధుడు. 2012 మార్చి 31న పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పార్టీ ప్రగతికి విశేష కృషి చేస్తున్నారు.

దయనీయంగా వామపక్షాలు....

తెలుగువారు నాయకత్వం వహిస్తున్న రెండు జాతీయ పార్టీలు సీపీఎం, సీపీఐ పూర్తిగా వెనకబడి పోయాయి. వెనకటి ప్రాభవాన్ని కోల్పోయి నామమాత్రంగా మిగిలిపోయాయి. వామపక్ష పార్టీలో అగ్రగామిగా ఉన్న సీపీఎం కూడా దైన్యస్థితిలో ఉంది. కంచుకోటలైన పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. అధికారాన్ని కోల్పోయింది. జ్యోతిబసు సారథ్యంలో రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. వరుసగా రెండోసారి మమత బెనర్జీని ఎదుర్కొన లేక కుదేలైన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలతో సరిపెట్టుకుంది. భవిష్యత్తులో బెంగాల్లో అధికారాన్ని చేపట్టే పరిస్థితి కూడా కనపడటం లేదు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల్లో చక్రం తిప్పినా...ఇప్పుడు కేవలం 9 లోక్ సభ స్థానాలతో కాలం నెట్టుకొస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కంచుకోట త్రిపురను కూడా కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే అధికారంలో ఉంది. అక్కడ కూడా పార్టీ స్థిరంగా లేదు. ఒకసారి గెలవడం, మరోసారి ఓడిపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సీపీఐ పరిస్థితి మరింత దయనీయం. లోక్ సభలో ఆ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ ఉన్నారు. కేరళలోని త్రిపుర నుంచి ఎన్నకైన జయదేవన్ ఒక్కరే ఎంపీ. ఒకప్పుడు బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళల్లో పార్టీ బలంగా ఉండేది. ఇప్పుడు బీహార్, పంజాబ్ లలో ఉనికే లేదు. బెంగాల్ , కేరళలలోఉనికిని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. సీపీఎం తో పొత్తు వల్లే ఒకటీ అరా సీట్లలో గెలుస్తోంది. మొత్తం మీద రెండు ప్రధాన వామపక్ష పార్టీల పరిస్థితి పూర్తి నిరాశాజనకంగా ఉంది. సమీప భవిష్యత్తులో బలపడే సూచనలు కూడా లేవు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News