జగన్ పంచన చేరక తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల పరిస్థితి ఎటూ కాకుండా తయారయింది. అసలే బలహీనంగా ఉన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు ఏ పార్టీ మద్దతు తీసుకునే పరిస్థితులు లేవు. ఏ [more]

Update: 2021-01-13 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల పరిస్థితి ఎటూ కాకుండా తయారయింది. అసలే బలహీనంగా ఉన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు ఏ పార్టీ మద్దతు తీసుకునే పరిస్థితులు లేవు. ఏ పార్టీ చూసినా లౌకిక వాదం వదిలేసి పూర్తి హిందుత్వానికి మారిపోయినట్లు కన్పిస్తున్నాయి. దీంతో వామపక్ష పార్టీలకు మళ్లీ జగన్ పంచక చేరక తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏపీలో సీపీఎం, సీపీఐ లకు గత రెండు దఫాలుగా శాసనసభలో ప్రాతినిధ్యం లేదు.

జనసేనతో కలసి……

2014 ఎన్నికల్లో సీపీఎం జగన్ తో పొత్తు పెట్టుకుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సీపీఎం, సీపీఐలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రయాణం చేశాయి. అయితే అప్పుడు కూడా ఆ పార్టీలకు ఒక్క స్థానం కూడా లభించలేదు. పవన్ కల్యాణ్ పార్టీకే చచ్చీ చెడీ ఒక్క స్థానం దక్కింది. ఇక ఎన్నికలు ముగిశాక పవన్ కల్యాణ్ బీజేపీతో జత కట్టారు. సహజంగా కాషాయం అంటే కోపంగా ఉండే కమ్యునిస్టు పార్టీలు జనసేనకు దూరమయ్యాయి.

రాజధాని విషయంలో….

ఇక రాజధాని అమరావతి విషయంలో టీడీపీకి అండగా వామపక్షాలు నిలిచాయి. ముఖ్యంగా సీపీఐ అయితే చంద్రబాబు తో దాదాపు పొత్తు పెట్టుకున్నట్లే వ్యవహరించాయి. చంద్రబాబు తో అనేక సమావేశాల్లో సీపీఐ నేతలు పాల్గొన్నారు. సీపీఎం రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చినప్పటికీ చంద్రబాబుతో నేరుగా కలసి నడవలేదు. ఇప్పుడు వామపక్ష పార్టీలు చంద్రబాబుకు కూడా దూరమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

మళ్లీ పునరాలోచనలో…

చంద్రబాబు ఇటీవల కాలంలో జగన్ క్రిస్టియన్ అంటూ విరుచుకుపడటం, దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులంతా వ్యతిరేకించాలనడం, పాస్టర్లకు ఐదు వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమని ప్రకటించడం వంటివి వామపక్షాలకు మింగుడుపడటం లేదు. అందుకే సీపీఐ నారాయణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు వైసీపీ, టీడీపీ కారణమని చెబుతున్నారు. మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నారన్నారు. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న స్టాండ్ తో వామపక్షాలు పునరాలోచనలో పడ్డాయంటున్నారు. తిరిగి జగన్ వైపునకు వారు రాక తప్పదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News