జెండా మోస్తే చాలు… బీజేపీలో పొలిటికల్ న్యూ ట్రెండ్

భారతీయ జనతా పార్టీలో నాయకత్వం చూడరు. వారసత్వం అసలే పట్టించుకోరు. అందుకే ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో విస్తరించగలిగింది. నిజానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనూ సిఫార్సులు, [more]

Update: 2020-06-16 18:29 GMT

భారతీయ జనతా పార్టీలో నాయకత్వం చూడరు. వారసత్వం అసలే పట్టించుకోరు. అందుకే ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో విస్తరించగలిగింది. నిజానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనూ సిఫార్సులు, వారసత్వం ఉంటేనే ఉన్నత పదవులు దక్కుతాయి. అసలు గాంధీ కుటుంబమే కాంగ్రెస్ ను నడిపిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనవసరం లేదు. తమకు ప్రయోజనాలు చేకూర్చే వారికు పదవులు ఇస్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఎంపిక చేసుకుని భవిష్యత్తులో వారి వల్ల రాజకీయంగా లబ్ది ఉంటుందని భావిస్తేనే పదవులను కట్టబెడతారు.

సామాన్య కార్యకర్తకు కూడా…

కానీ బీజేపీలో అలా కాదు. సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవులు లభిస్తాయి. పార్టీకి చేసిన సేవ, వారి శ్రమతో పాటు లాయల్టీని కూడా బీజేపీ అధినాయకత్వం గుర్తిస్తుంది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఎదిగిన వారే. అందుకే భారతీయ జనతా పార్టీలో గత దశాబ్దకాలంగా సభ్యత్వాలు పెరిగాయి. మోదీ, అమిత్ షాలు వచ్చిన తర్వాత వారి నాయకత్వంపై నమ్మకంతో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగలిగింది.

రిటర్ కావాలనుకున్న వారిని….

కర్ణాటకలో రాజ్యసభ స్థానాల ఎంపికను చూస్తే బీజేపీలో కష్టపడితే పదవులు దక్కుతాయన్న దానికి ఉదాహరణగా నిలుస్తుంది. నిజానికి రాజ్యసభ పదవులు పార్టీలో ఉన్నత పదవులను అనుభవించిన వారికి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక పాల్గొనలేని వారికి ఇవ్వడం అన్ని పార్టీల్లోనూ ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా రాజ్యసభ స్థానాలకు తాను పంపిన జాబితాలో పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడే వారి పేర్లనే అధిష్టానానికి పంపారు. కానీ అధిష్టానం యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పార్టీ కోసం కష్టపడిన వారికి….

తాజాగా కర్ణాటకలో రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ నేతలు కాదు. సామాన్య కార్యకర్తలు. పార్టీకోసం దశాబ్దాల కాలం నుంచి కష్టపడుతున్నవారు. పార్టీ జెండా మోసినందుకు అధిష్టానం అశోక్ గస్తి, ఈరణ్ణ కడాడిలు ఇప్పటివరకూ ఎలాంటి పదవులు చేపట్టలేదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. వారికి రాజ్యసభ స్థానాలు ఇచ్చి అధిష్టానం పార్టీ క్యాడర్ కు గట్టి సంకేతాలను పంపింది. కేవలం నేతలే కాదు కార్యకర్తలూ భవిష్యత్తులో ఎదుగుతారన్న సిగ్నల్స్ ను అధిష్టానం పార్టీలో బలంగా పంపగలిగింది. అందుకే బీజేపీకి దేశ వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News