నేత‌లు చేసిన అల‌వాటు.. ఇప్పుడు తిప్పలు పెడుతోందా ?

రాజ‌కీనేత‌లు ప్రజ‌ల‌ను డ‌బ్బుకు ఎంత‌గా అల‌వాటు చేశారో.. ఎంత‌గా వారిని డ‌బ్బుల‌తో కొనేందుకు ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. డ‌బ్బు కు అమ్ముడు పోయేందుకు అల‌వాటు చేశారో.. ఇప్పుడు అదే [more]

Update: 2021-05-10 00:30 GMT

రాజ‌కీనేత‌లు ప్రజ‌ల‌ను డ‌బ్బుకు ఎంత‌గా అల‌వాటు చేశారో.. ఎంత‌గా వారిని డ‌బ్బుల‌తో కొనేందుకు ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. డ‌బ్బు కు అమ్ముడు పోయేందుకు అల‌వాటు చేశారో.. ఇప్పుడు అదే రాజ‌కీయ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిపోయిందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌ప్పుడు స‌మాజంలో నిజాయితీ అనే మాట అంతో ఇంతో వినిపించేది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో సంప్రదాయ కుటుంబాలు సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన్నేళ్లపాటు.. ఒకే పార్టీకి అల‌వాటు ప‌డ్డారు. ఆ పార్టీకే ఓట్లు వేయ‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్నారు. అయితే.. 2009 నుంచి ఈ ప‌రిస్థితి మారిపోయింది. 2004 ఎన్నిక‌ల్లోనూ మ‌రీ అంత దారుణంగా డబ్బు ప్రభావం లేదు. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీ ఇచ్చాక జ‌రిగిన ముక్కోణ‌పు పోటీలో డ‌బ్బు వ‌ర‌ద‌లై పారింది. ఎంతో మంది కొత్త నాయ‌కులు, రియ‌ల్, ఇత‌ర వ్యాపారులు రాజ‌కీయ రంగంలోకి రావ‌డం అప్పటి నుంచే ప్రారంభ‌మైంది. దీంతో డ‌బ్బు క‌ట్టలు తెగింది.

డబ్బులు రుచి చూపి…..

ఇక‌, 2014, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి పూర్తిగా మారింది. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. నాయ‌కులు ప‌నిగ‌ట్టుకుని ప్రజ‌ల‌కు డ‌బ్బులు పంచ‌డాన్ని అల‌వాటు చేసుకున్నారు. మా హ‌క్కును మేం వినియోగించుకునేందుకు మీరెందుకు డ‌బ్బులు ఇస్తున్నారు? అని ప్రశ్నించిన ప్రజ‌లు కూడా ఉన్నారు. కొన్ని ఇళ్ల ముందు అయితే.. 'మా ఓట్లు అమ్మబ‌డ‌వు' అన్న బోర్డులు కూడా వెలిసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక‌, కొన్ని గ్రామాలు, కొన్ని పంచాయ‌తీలు అయితే.. 'డ‌బ్బులు తీసుకుని ఓటు వేసేది లేదు. ఎవ‌రూ డ‌బ్బులు తీసుకున్నా బ‌హిష్కరిస్తాం' అని తీర్మానాలు చేసుకునే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అయితే.. రాను రాను ఈ ప‌రిస్థితి పూర్తిగా మ‌రిపోయింది. నాయ‌కులు త‌మను గెలిపించాలంటే.. త‌మ‌ను గెలిపించాలంటూ.. ప్రజ‌ల‌కు డ‌బ్బులు రుచిచూపించ‌డం ప్రారంభించారు.

పరిషత్ ఎన్నికల్లో మాత్రం…?

ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల నాయ‌కులు ఓటుకు రూ. వెయ్యి ఇస్తే.. మ‌రో పార్టీ నేత‌లు రూ.2 వేలు ఇవ్వడం ప్రారంభించారు. దీనికి తోడు కానుక‌లు కూడా ఇచ్చారు. వెర‌సి మొత్తంగా.. అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌ను కూడా ఓట్లను అమ్ముకునే దిశ‌గానే నాయ‌కులు న‌డిపించారు. డ‌బ్బు ఇస్తున్నారు క‌నుక .. తీసుకుంటున్నాం.. అని ప్రజ‌లు కూడా చెప్పేసేవారు. అయితే.. ఇది పార్టీలు పోటాపోటీగా త‌ల‌ప‌డిన‌ప్పుడు మాత్రమే జ‌రిగింద‌ని అనుకున్నా.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ.. ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరించింది. దీంతో పోటీలో కేవ‌లం వైసీపీ, బీజేపీ.. జ‌న‌సేన లు మాత్రమే నిలిచాయి. క‌మ్యూనిస్టులు ఎలానూ ఉన్నారు. ఇక‌, అక్కడో ఇక్కడో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది.

అందుకే రాలేదా?

అయిన‌ప్పటికీ.. ప్రధాన పోటీ దారుగా వైసీపీ బావిస్తున్న టీడీపీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరించినందున‌.. ఇక‌, ఎన్నిక‌ల్లో పోటీ ఉండ‌ద‌ని.. కాబ‌ట్టి.. తాము ఓట‌ర్లకు డ‌బ్బులు పంచాల్సిన అవ‌స‌రం లేద‌ని .. వైసీపీ నేత‌లు భావించారు. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌లు స‌హా స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ డ‌బ్బులు పంచిన నాయ‌కులు ప‌రిష‌త్‌కు వ‌చ్చే స‌రికి ఎక్కడా రూపాయి కూడా పంచ‌లేదు. ఇదే ఇప్పుడు ప్రధానంగా చ‌ర్చనీయాంశం అయింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు ఓటు వేసేందుకు బూత్‌ల‌కు రాలేదు. ఇదేమ‌ని ప్రశ్నిస్తే.. 'మాకు డ‌బ్బులు ఇవ్వలేదు… అందుకే రాలేదు' అని నిర్మొహ‌మాటంగా చెప్పేశారు. క‌ర్నూలులో అయితే.. ఒక కాల‌నీలో ఏకంగా.. మాకు డ‌బ్బులు ఇస్తేనే ఓటు అనే బోర్డు వెలిసింది. దీంతో నాయ‌కులు త‌ల‌ప‌ట్టుకున్నారు. తాము చేసిన అల‌వాటే ఇప్పుడు త‌మ‌కు తిప్పలు పెట్టింద‌ని నెత్తి బాదుకున్నారు. కానీ, ప్రజ‌లు మాత్రం ఎక్కడా.. రివైజ్ కావ‌డం లేదు. తాము క‌రెక్టే చేశామ‌ని అంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ త‌ర‌హా సంస్కృతి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News