వైసీపీ వైపు క్యూ కడుతున్న నేతలు.. బేషరతుగానే ?

ఇపుడున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా మదింపు చేసుకుంటున్న నేతలు అధికార వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. దాంట్లో గతంలో పార్టీలో ఉండి ఫిరాయించిన వారు, టీడీపీలో కరడు [more]

Update: 2021-04-25 14:30 GMT

ఇపుడున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా మదింపు చేసుకుంటున్న నేతలు అధికార వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. దాంట్లో గతంలో పార్టీలో ఉండి ఫిరాయించిన వారు, టీడీపీలో కరడు కట్టిన వారు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏపీలో ఇపుడు వైసీపీయే అతి పెద్ద బలమైన పార్టీగా నాయకులు భావిస్తున్నారు. పైగా మరో మూడేళ్ళ వరకూ అధికారానికి ఢోకా లేదని కూడా ఆలోచనలతోనే ఫ్యాన్ పార్టీ వైపు వెల్లువలా కదులుతున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా టీడీపీ నుంచి వైసీపీ వైపు రూట్ మార్చేందుకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సిధ్ధంగా ఉండడం విశేషం.

అఖిలప్రియ అలా…

ఇక కర్నూలు జిల్లాలో ఒకపుడు భూమా కుటుంబం ఎంతటి ప్రఖ్యాతిని గడించిందో అందరికీ తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణించాక అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చి మరీ టీడీపీ చాలా రాజకీయాలు చేసింది. ఇపుడు అదే అఖిలప్రియ వైసీపీ ముంగిట ఉన్నారని అంటున్నారు. ఆమె స్వయంగా జగన్ తల్లి విజయమ్మ ద్వారా జగన్ తో రాయబేరాలు చేస్తున్నట్లుగా టాక్. తనకు పార్టీలో ప్రవేశం ఉంటే చాలు, ఎమ్మెల్యే టికెట్ కూడా అవసరం లేదని అఖిలప్రియ ప్రాధేయపడుతున్నారు అంటేనే ఆమె రాజకీయం టీడీపీలో ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు.

సిక్కోల్ బ్యాచ్ రెడీ….

ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తమ్ముళ్ళు ఉప ముఖ్యామంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో చేరిపోతాం, మాకు పదవులు వద్దు, వైసీపీ జెండా నీడన ఉంటామని అంటున్నారుట. అయితే ఈ విషయంలో జిల్లాలో ఉన్న సీనియర్ మంత్రిగా క్రిష్ణదాస్ లైన్ క్లియర్ చేస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది అంటున్నారు. చిత్రమేంటంటే వీరంతా దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారే. మరి ఎందుకు ఇలా పార్టీని వీడుతున్నారు అంటే భవిష్యత్తు మీద బెంగతోనే అంటున్నారు.

విశాఖలో అదే సీన్….

ఇక విశాఖ జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ నేతలు విజయసాయిరెడ్డితో టచ్ లో ఉన్నారని అంటున్నారు. వీరంతా కూడా తాము వైసీపీలో చేరిపోతామని చెబుతున్నారు. పైగా ఇపుడు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు, తమకు ఏ హోదాలు కూడా అవసరం లేదని అంటున్నారు. నియోజకవర్గాల్లో వర్గ పోరు లేకుండా ఉంటేనే కొత్త వారికి ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి పక్కా క్లారిటీగా వారికి చెబుతున్నారు. అవసరం లేదు అనుకున్న వారిని చేర్చుకోమని కూడా ముఖం మీద చెప్పేస్తున్నారు. అదే విధంగా విజయనగరంలో కూడా బొత్స సత్యనారాయణ వద్దకు తమ్ముళ్ళు పరుగులు పెడుతున్నారు. అయితే బొత్స తనకు అనుకూలంగా ఉన్న వారిని చేరదీయడానికి చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే లోకల్ బాడీ ఎన్నికల తరువాత ఏపీలో మారిన రాజకీయ ముఖ చిత్రమే తమ్ముళ్లను సైకిల్ దిగేలా చేస్తోంది అంటున్నారు. వైసీపీ వైపు క్యూ కడుతున్నారు.

Tags:    

Similar News