కొంప కొలాప్స్…ఎందుకిలా…?

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానం సంపాయించుకున్న నాయ‌కుడు మ‌ధుయాష్కీ గౌడ్‌. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ముఖ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేరుగా సంబంధ [more]

Update: 2019-07-29 00:30 GMT

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానం సంపాయించుకున్న నాయ‌కుడు మ‌ధుయాష్కీ గౌడ్‌. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ముఖ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేరుగా సంబంధ బాంధ‌వ్యాలు నెరిపే యాక్సెస్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన నాయ‌కుడు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న రాజ‌కీయ వైరాగ్యంతో నిలువునా ఒణికి పోతున్నారు. త‌న‌కు ఇక‌, రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ దాదాపు లేన‌ట్టేన‌ని త‌న అనుచ‌రుల‌తో చెప్పుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసలు మ‌ధు యాష్కీ గౌడ్ రాజ‌కీయాలు ఏంటి? ఎందుకిలా మారాయి? అనే విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది.

కోటరీలో కీలకంగా……

విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ కోట‌రీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు మ‌ధు యాష్కీ. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఆయ‌న‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పెరుగుతున్న ద‌శ‌లో దానిని అణిచి వేసేందుకు వైఎస్ కొంద‌రు నాయ‌కుల‌ను వినియోగించుకుని కేసీఆర్ స‌హా కొంద‌రు తెలంగాణ వాదుల‌పైనా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ‌స‌రంలేద‌నే విష‌యంపైనా విమ‌ర్శలు చేయించారు. ఇలాంటి వారిలో మ‌ధుయాష్కీ ఒక‌రు వైఎస్ చెప్పిన‌ట్టు మ‌ధుయాష్కీ న‌డుచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు కేంద్రంలోని కాంగ్రెస్ నేత‌ల‌తోనూ ప‌రిచ‌యం ఏర్పడింది.

వరసగా రెండుసార్లు గెలిచి….

2004, 2009 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో మ‌ధుయాష్కీ విజ‌యం సాధించారు. వ‌రుస విజ‌యాల‌తో మ‌ధుయాష్కీ జోరెత్తి పోయారు. చాలా మంది మ‌ధుయాష్కీ సిఫార్సుల‌తో ప‌ద‌వులు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే, రాజ‌కీయాల్లో ఓడ‌లు ఎప్పుడు బ‌ళ్లవుతాయో.. బ‌ళ్లు ఎప్పుడు ఓడ‌ల‌వుతాయో చెప్పడం క‌ష్టం. అదేవిధంగా మ‌ధుయాష్కీ రాజ‌కీయాలు కూడా తెలంగాణ ఏర్పాటుతో త‌ల్లకిందుల‌య్యాయి. కొన్నాళ్ల పాటు తెలంగాణ‌ను వ్యతిరేకించిన ఆయ‌న స్వయంగా తెలంగాణ వాదిగా ముద్ర వేయించుకునేందుకు చాలా కాలం ప‌ట్టింది. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీ నిజామాబాద్‌లో ఘోరంగా ఓడిపోయారు. కేసీఆర్ కుమార్తె క‌విత‌పై దాదాపు ల‌క్షా అర‌వై వేల ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది.

దారుణంగా ఓడి….

ఇక‌, ఆ త‌ర్వాత మ‌ధుయాష్కీ నిజామాబాద్ మొహం కూడా చూసింది లేదు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీని తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేయాల‌ని చెప్పినా.. ఆయ‌న సుముఖత వ్యక్తం చేయ‌లేదు. న‌ల్లగొండ జిల్లా భువ‌న‌గిరి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, కోమ‌టిరెడ్డి కార‌ణంగా మ‌ధుయాష్కీ దానికి దూర‌మై.. త‌ప్పని ప‌రిస్థితిలో నిజామాబాద్ నుంచే పోటీ చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ ద‌ఫా మ‌ధుయాష్కీకి మ‌రింత చేదు అనుభ‌వం ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ క‌విత ఓడిపోయింది. అదేస‌మ‌యంలో ఇక్కడ నుంచి ప్రయోగాత్మకంగా పోటీ చేసిన బీజేపీ విజ‌యం సాధించింది. ఇక‌, క‌విత‌కు వ్యతిరేకంగా ప‌సుపు రైతులు పోటీ చేయ‌గా వారంతా 98 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకోగా.. యాష్కీ కేవ‌లం 60 వేల ఓట్లతో స‌రిపెట్టుకుని చివ‌ర‌కు డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారు.

రాహుల్ రాజీనామాతో…..

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యం మ‌ధుయాష్కీకి త‌ల‌నొప్పిగా మారింది. రాహుల్ వ‌ర్గంగాపేరు తెచ్చుకున్న ఆయ‌న .. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాహులే రాజీనామా చేయ‌డంతో ఫ్యూచ‌ర్ పై విర‌క్తి ఏర్పడింది. ఇక‌, రాజ‌కీయంగా త‌న‌కు ఫ్యూచ‌ర్ లేద‌ని మ‌ధుయాష్కీ భావిస్తున్నారు. ఇక‌, నిజామాబాద్‌లో బీజేపీ పుంజుకోవ‌డం మ‌రింత అశ‌నిపాతంగా మారింది. వాస్తవానికి మ‌ధుయాష్కీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గమే.. నిజామాబాద్‌లో బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. ఏదేమైనా మ‌ధుయాష్కీ ఫ్యూచ‌ర్ ప్రశ్నార్థకంగా మారింది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News