పుట్టి ముంచుతున్న పురాణ జ్ణానం..

Update: 2018-07-08 05:00 GMT

చదవేస్తే ఉన్నమతి చెడిందని సామెత. దేశంలో జాడ్యంగా మారిన క్రీడల్లో బెట్టింగును అరికట్టడమెలా? అని నిఘా సంస్థలు ఒకవైపు తలపట్టుకుంటున్నాయి. చట్టబద్ధం చేసి పారేయండి. డబ్బులొస్తాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులూ వెల్లువెత్తుతాయి. పన్నులు చేకూరుతాయి. పచ్చనోట్లతో ప్రభుత్వ ఖజానా కళకళ లాడుతుంది. అంటూ లా కమిషన్ లక్షణంగా చెప్పేసింది. ఏదో సాధారణ ప్రభుత్వ శాఖ ఇలాంటి అడ్డగోలు సిఫార్సు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. సమాజపరమైన, న్యాయపరమైన హేతుబద్ధతను విచక్షణతో యోచించాల్సిన కమిషన్ ఈ రకమైన నివేదిక ఇవ్వడం గగ్గోలు పుట్టిస్తోంది. జూదం చట్టబద్ధం అయి ఉంటే అసలు భారత యుద్దమే జరిగి ఉండేది కాదు. ధర్మరాజు భార్య,తమ్ముళ్లను పందెం పెట్టాల్సి వచ్చేది కాదంటూ అర్థరహితమైన ప్రాతిపదికను కమిషన్ తమ పరిశీలనలో పేర్కొనడం మరింత విచిత్రంగా కనిపిస్తోంది. మద్యం, పేకాట వంటి వ్యసనాలతో ఇప్పటికే దేశ ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు అల్లాడిపోతున్నాయి. మధ్యతరగతి, పేద వర్గాలు నిండా మునిగిపోతున్నాయి. తాజా సిఫార్సులు అమలైతే యువత, మధ్యతరగతి , వ్యసనపరులు బయటపడలేని ఊబిలో కూరుకుపోవడం ఖాయం.

ఆదాయానికి అడ్డదారి..

బెట్టింగు, గ్యాంబ్లింగులను దేశంలో అరికట్టలేకపోతున్నారు. అందువల్ల దీనిని ఆదాయమార్గంగా చేసుకోవాలనేది లా కమిషన్ ప్రధాన సిఫారసు. ప్రభుత్వానికి ఇదో పెద్ద ఆదాయవనరుగా మారుతుందని భరోసా ఇచ్చేసింది. కాసినోలు, క్లబ్బులను అనుమతిస్తే విదేశీప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటికి అనధికారికంగా జరుగుతున్న బెట్టింగుల కారణంగానే మధ్యతరగతి, యువత చెడుదారి పట్టి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఇక అధికారికం చేస్తే ఈ వ్యసనం వెర్రి తలలు వేయడం ఖాయం. పైపెచ్చు తమ సిఫార్సుల అవసరాన్ని లా కమిషన్ బలంగా సమర్థించుకోజూచింది. దీనివల్ల వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించవచ్చని ఉచితసలహా పారేసింది. తాగుడు, పేకాటక్లబ్బుల కారణంగా మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఇల్లు,వళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇక గ్యాంబ్లింగ్, బెట్టింగు వీటి కంటే పెద్ద వ్యసనాలు. ఒకసారి అలవాటు పడితే వదలలేని రుగ్మతలు. ముఖ్యంగా యువతరం నేరాలు చేసైనా వీటిలో పాల్గొనేందుకు సాహసిస్తారు. మొత్తం సమాజాన్ని ఇది పట్టి పీడిస్తుంది. ఆ మాత్రం ఆలోచన చేయకుండా లా కమిషన్ సిఫార్సు చేయడమే విచిత్రం.

కోరని వరం..కొత్త పథం...

నిజానికి లా కమిషన్ ను అన్ని క్రీడలపై బెట్టింగు పై సిఫార్సు కోసం అభ్యర్థించలేదు. ఐపీఎల్ లో బెట్టింగు సంస్కృతి పెరిగింది. దీని తరుణోపాయం ఏమిటంటూ సుప్రీం కోర్టు 2016లో సలహా అడిగింది. తగుదునమ్మా అంటూ తనకు సంబంధం లేకపోయినా కాసినోలు, గ్యాంబ్లింగులు, బెట్టింగుల వంటివాటిని ద్రుష్టిలో పెట్టుకుని పాశ్చాత్య కోణంలో అయాచిత సిఫార్సులు వెలువరించింది. దేశంలో ఆన్ లైన్ పందాలు తప్పనిసరి అవసరమన్న రీతిలో లా కమిషన్ కోరని వరాన్ని ప్రకటించేసింది. పైపెచ్చు బెట్టింగు, గ్యాంబ్లింగులకు విధివిధానాలనూ సిఫార్సుల్లో జోడించింది. ప్రోపర్ గ్యాంబ్లింగ్, స్మాల్ గ్యాంబ్లింగ్ పేరిట రెండు రకాలుగా దీనిని అనుమతించాలట. ప్రోపర్ గ్యాంబ్లింగు చాలా డబ్బున్నవాళ్ల ఆట. స్మాల్ గ్యాంబ్లింగును పేద,మధ్యతరగతివర్గాలకు అందుబాటులో ఉంచాలట. అంటే దేశం మొత్తాన్ని ఈ ఊబిలోకి లాగేసి డబ్బులు నొల్లుకోవడమే తరువాయి. అధికారికంగా మద్య నిషేధం అమలైన రోజుల్లో తాగుబోతుల సంఖ్య కేవలం పదిశాతానికే పరిమితమైంది. నిషేధం ఎత్తివేశాక అది పదిరెట్లు పెరిగింది. ఇప్పుడు దొంగచాటుగా, రహస్యంగా పోలీసులు వస్తారేమోననే భయంతో అడపాదడపా మాత్రమే బెట్టింగులు సాగుతున్నాయి. అధికారికం చేస్తే విచ్చలవిడితనం పెరుగుతుంది. సంఘభయం పోతుంది. దూరంగా ఉంటున్న మర్యాదస్తులూ వ్యసనానికి అలవాటు పడిపోతారు. ఇదెంత ప్రమాదకరమో ఆలోచించకుండా ఇటువంటి సిఫార్సులు చేయడంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పేద దేశం..పెను ప్రమాదం..

మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. పాశ్చాత్య సంస్కృతిని అలవరచుకోవడానికి వెంపర్లాడుతున్న యువతరానికి కొదవ లేదు. కాసినోలు అందుబాటులో లేవు కానీ ఉంటే ఈపాటికే వాటి బారిన పడి ఉండేవారు. ఇటీవలికాలంలో నేరాలు చేస్తున్నవాళ్లలో ఎక్కువమంది చదువుకుంటున్న కుర్రవాళ్లే ఉంటున్నారు. వ్యసనాలు,లగ్జరీ లైఫ్ నకు అలవాటు పడి దొంగతనాలు, వైట్ కాలర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగు, గ్యాంబ్లింగులు రంగప్రవేశం చేస్తే నేరాల సంఖ్య మరింత అధికంగా మారుతుంది. పర్యవసనాల గురించి ఆలోచించకుండా తప్పులు చేయడం యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే క్రికెట్ మోజులో సమయం వ్రుథా చేయడమే కాకుండా పందాలు కాయడం చాలా చోట్ల ఆనవాయితీగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగుల వంటివాటికి అంతర్జాతీయ ముఠాలు పాల్పడుతున్నాయి. బెట్టింగులతో కొందరు విలాసపురుషులు తమ సరదా తీర్చుకుంటున్నారు. అప్పోసప్పో చేసి యువకులు సైతం బెట్టింగుల్లో పాల్గొంటున్నారు. వీటన్నిటినీ కట్టడి చేసేందుకు పటిష్ఠ నిఘా అవసరం. వర్ధమాన దేశం కావడం వల్ల ఇటువంటి అక్రమ, అరాచక ఆర్థికవ్యవస్థను ప్రోత్సహిస్తే ముందుగా బలయ్యేది పేదలు, మధ్యతరగతి ప్రజలే.

Similar News