తెర పైకి గ్రేటర్ రాయలసీమ… జగనే లక్ష్యమా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయింది. ఒక్క అమరావతి రాజధాని మూడు ముక్కలైంది. ఇదంతా గడచిన ఆరేళ్ల కాలంలోనే జరిగింది. కానీ విభజన అగ్గి మాత్రం అలా [more]

Update: 2021-01-13 09:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయింది. ఒక్క అమరావతి రాజధాని మూడు ముక్కలైంది. ఇదంతా గడచిన ఆరేళ్ల కాలంలోనే జరిగింది. కానీ విభజన అగ్గి మాత్రం అలా రాజుకుంటూనే ఉంది. ఇంకా అది మండుతూ మరిన్ని విభజనలకు చిచ్చు రేపుతూనే ఉంది. తాజాగా తెరపైకి కొత్త డిమాండ్ వింటే ఏపీవాసులు నిర్ఘాంతపోవాల్సిందే. గ్రేటర్ రాయలసీమ కావాలన్నది ఆ డిమాండ్. రాయలసీమ‌ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం కలుపుకుని ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయల సీమను ఇచ్చేయాల్సిందేనని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తాజాగా డిమాండ్ చేస్తున్నారు.

పాతదే దుమ్ము దులిపి ….

గ్రేటర్ రాయలసీమ డిమాండ్ ఇప్పటిది కాదు, పాతదేనని గంగుల అంటున్నారు. తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నపుడు 2014లో ఉమ్మడి ఏపీ విభజనకు ముందే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దీని మీద లేఖ రాశానని ఆయన చెబుతున్నారు. నాడు ఏపీ తెలంగాణాగా విడగొట్టారని, సీమకు మాత్రం అన్యాయం చేశారని ఆయన తాపీగా పాత కధను చెబుతున్నారు. దానికి ఇపుడు దుమ్ము దులుపుతున్నామని కూడా అంటున్నారు. ఇది సరైన సమయం అని కూడా ఆయనే అంటున్నారు. పైగా కచ్చితంగా రాయలసీమ రాష్ట్రం కల సాకారం అవుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి తరువాత…..

గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి ముహూర్తం కూడా గంగుల పెట్టేశారు. సంక్రాంత్రి తరువాత ఆరు జిల్లాల్లో పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. ముందుగా గ్రేటర్ రాయలసీమకు అనుకూలంగా ఉన్న నాయకులతో మాట్లాడి ఉద్యమ వేదికను ఏర్పాటు చేసుకుంటామని కూడా ఆయన అంటున్నారు. ఆ తరువాత అతి పెద్ద ఉద్యమంగా ఇది మారుతుందని, సీమ జనం నూటికి నూరు శాతం మద్దతు ఇస్తారని కూడా గంగుల గట్టిగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయమేనా…?

ఓ వైపు చూస్తే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు మూడు రాజధానుల సమస్య ఉంది. జగన్ బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా అయనకు ఈ ఆరు జిల్లాల్లో ఎదురులేని సీన్ ఉంది. అందుకే జగన్ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెర వెనక నుంచి కొన్ని పార్టీలు శక్తులు ఉండి ఇలాంటి డిమాండ్లు తెస్తున్నాయా అన్న అనుమానాలు అయితే అందరిలో కలుగుతున్నాయి. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎత్తిపోతల పధకానికి కూడా ఆయన తాజాగా అనుమతులు తెచ్చారు. హైకోర్టుని కర్నూలు లో పెట్టాలనుకుంటున్నారు. అనంతపురంతో పాటు తిరుపతిని పారిశ్రామిక హబ్ గా చేయాలనుకుంటున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కి పునాది రాయి వేశారు. ఇంకా పరిశ్రమలు రప్పిస్తున్నారు. ఇలా సీమలో వైఎస్సార్ కుటుంబం బలంగా ఉంటే రాజకీయంగా మనుగడ కష్టమన్న భావనతోనే ఈ ఉద్యమానికి ఎవరైనా తెర వెనక‌ ప్రోత్సహిస్తున్నారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. మరి సీమ బిడ్డగా జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News