వైసీపీ ఎంపీలు దూకుడు పెంచేనా ? జ‌గ‌న్ వ్యూహం అమ‌ల‌య్యేనా ?

వైసీపీ ఎంపీలు దూకుడు పెంచేనా ? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమ‌తుల విష‌యంలో గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తారా ? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జ‌రుగుతున్న జోరు చ‌ర్చ. [more]

Update: 2021-02-05 06:30 GMT

వైసీపీ ఎంపీలు దూకుడు పెంచేనా ? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమ‌తుల విష‌యంలో గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తారా ? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జ‌రుగుతున్న జోరు చ‌ర్చ. ఇటీవల సీఎం జ‌గ‌న్ స‌మక్షంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జ‌రిగింది. దీనిలో ఎంపీల‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది. దీంతో ఇప్పుడైనా.. ఎంపీలు దూకుడుగా ముందుకు సాగుతారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

ప్రత్యేక హోదాను….

ష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో 22 మంది ఎంపీలు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ప్రత్యేక హోదా సాధిస్తామ‌న్న ప్రధాన‌ హామీ వీరికి తోడైంది. 25 ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుందంటూ జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు ప‌దే ప‌దే ప్రచారం చేశారు. జ‌గ‌న్ మాట న‌మ్మి ఏపీకి న్యాయం జ‌రుగుతుంద‌ని వ‌న్‌సైడ్‌గా తీర్పు ఇచ్చేశారు. వైసీపీ నుంచి గెలిచిన 22 మంది ఎంపీల‌లో ఇప్పుడు 21 మంది ఎంపీలు వైసీపీలోనే ఉన్నారు. ఒక‌రు కొన్నాళ్ల కింద‌ట మృతి చెందారు. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు స్వప‌క్షంలోనే విప‌క్షంగా ఉన్నారు.

చాలా మంది ఎంపీలు….

అయితే.. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన పార్లమెంటు స‌మావేశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక స‌మ‌స్యగా ఉన్న ప్రత్యేక హోదా, వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి నిధులు, పోల‌వ‌రం పూర్తి, విభ‌జ‌న హామీల అమ‌లు వంటివి ప్రధానంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉన్నప్పటికీ.. ఇప్పటి వ‌ర‌కు సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఫ‌లితంగా ఆయా ప్రధాన స‌మ‌స్యలు ఇప్ప‌ట వ‌ర‌కు తేల‌కుండా అలానే ఉండిపోయాయి. ఆ మాట‌కు వ‌స్తే ఒక‌రిద్దరు ఎంపీలు త‌ప్ప మిగిలిన వైసీపీ ఎంపీలు ఎవ్వరూ రాష్ట్ర స‌మ‌స్యల‌పై పార్లమెంటులో మాట్లాడింది లేదు.. క‌నీసం ఒక్క కీల‌క ప్రాజెక్టు అయినా ర‌ప్పించ‌లేక‌పోయారు. ఆ మాట‌కు వ‌స్తే అస‌లు వైసీపీ ఎంపీల‌కు పార్లమెంటులో మాట్లాడే స్వేచ్ఛ కూడా అధిష్టానం ఇవ్వడం లేదంటున్నారు. అస‌లు చాలా మంది ఎంపీలు ఢిల్లీలో ఎంజాయ్ చేసేందుకు వెళుతున్నార‌న్న సెటైర్లు ప‌డుతున్నాయి.

అవకాశం తక్కువే అయినా….?

మ‌రోవైపు ఎంపీలు గెలిచి రెండేళ్లు పూర్తికావ‌డం, ప్రధాన స‌మ‌స్యలు ఎక్కడిక‌క్కడే ఉండిపోవ‌డంతో తాజాగా అయినా.. వాటిని సాధించాల్సిన అవ‌స‌రం ఉంది. పైగా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్ని విధాలా జ‌గ‌న్ స‌ర్కారు స‌హ‌క‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. రాష్ట్రంలో ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్లు సాధించ‌లేక‌పోతే.. క‌ష్టమ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది అంతిమంగా ప్రభుత్వంపై తీవ్ర ప‌రిణామాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పార్టీ సీనియ‌ర్లు కూడా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వినియోగించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. సాధార‌ణంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆయా స‌మ‌స్యల‌పై చ‌ర్చించే అవ‌కాశం త‌క్కువ‌. మ‌రి వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News