మా దగ్గర బేరాల్లేవమ్మా?

రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. గత కొద్దినెలలుగా ఇక్కడ క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. 2020 సంవత్సరంలో ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. [more]

Update: 2021-02-03 00:30 GMT

రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. గత కొద్దినెలలుగా ఇక్కడ క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. 2020 సంవత్సరంలో ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకవైపు మూడు రాజధానుల ప్రకటన, మరోవైపు కోవిడ్ తో పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తమ భూములు బంగారమని, అమ్ముకోకుండా ఉంచుకున్న వాళ్లు నేడు లబో దిబో మంటున్నారు.

భూముల ధరలకు రెక్కలు….

2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీంతో ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రధానంగా గుంటూరు, విజయవాడల మధ్య ఉన్న భూమి బంగారమయిపోయింది. దీంతో గజం ధర యాభై వేలకు పైగానే పలికింది. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లను వేశాయి. జాతీయ రహదారికి ఇరువైపు విజయవాడ – గుంటూరు మధ్య ఎన్నో అపార్ట్ మెంట్లు వెలిశాయి.

పూర్తిగా పడిపోయి….

అయితే మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇక్కడ ధరలు పూర్తిగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలు తగ్గించి ఆఫర్లు ప్రకటించినా కొనుగోళ్లు లేవు. దీంతో అనేక అపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాదాపు పథ్నాలుగు నెలల నుంచి ఎటువంటి బేరాల్లేవని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. తాము బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పునకు వడ్డీ కూడా చెల్లించలేక పోతున్నామని చెబుతున్నారు.

ఈ ఏడాది కూడా….

తాజాగా ప్రభుత్వం అమరావతి నుంచి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరో రెండు మూడు నెలల్లోనే రాజధాని తరలిపోతుందని వైసీపీ ముఖ్యనేతలే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో భూముల ధరలు మరింత దిగజారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. యాభై వేలు పైచిలుకు పలికిన గజం ధర ఇప్పడు 14 వేలకు ఇస్తామన్నా కొనే వారు లేరు. రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా వెలవెల పోతున్నాయి. మొత్తం మీద రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు కొత్త ఏడాది కూడా పుంజుకునే అవకాశాలు కన్పించడం లేదు.

Tags:    

Similar News