మళ్లీ జనంలోకి మాస్ నాయక్

లాలూ ప్రసాద్ యాదవ్ .. భారత తాజా రాజకీయ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు. వినోదాన్ని పండిస్తూ సీరియస్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న నాయకుడు. [more]

Update: 2021-04-19 16:30 GMT

లాలూ ప్రసాద్ యాదవ్ .. భారత తాజా రాజకీయ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు. వినోదాన్ని పండిస్తూ సీరియస్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న నాయకుడు. గడచిన ముప్ఫై సంవత్సరాల్లో అనేక కీలక పరిణామాల్లో తనదైన ముద్ర వేసిన లీడర్. ప్రజలతో కనెక్టు కావడమెలాగో తెలిసిన క్రౌడ్ పుల్లర్. ఆంగ్ల, హిందీ భాషల్లో అనర్గళమైన ప్రతిభ ఉన్నప్పటికీ భోజ్ పురి యాసలో జనసమూహంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన బిహారీ వాలా లాలూ ప్రసాద్ యాదవ్. ఒక నాయకుడు ఎలా ఎదగవచ్చో, ఎక్కడ దెబ్బతింటాడో, ఏం చేయవచ్చునో, ఏం చేయకూడదో చూసి నేర్చుకోవడానికి ఒక ప్రతీకగా కనిపిస్తారు లాలూ ప్రసాద్ యాదవ్. మూడున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్న లాలూ బెయిల్ పై విడుదలై మళ్లీ జనసమూహంలోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. సామ్యవాద భావజాలంతొ మొదలైన లాలూ రాజకీయ ప్రస్థానం, అవినీతి మరకలతో జైలు గోడల మధ్య బందీ కావడానికి దారి తీసిన వైనం నేటి నాయకులకు ఒక గుణపాఠమే.

అతిశయించే ఆత్మవిశ్వాసం…

‘జబ్ తక్ సమోసా మే ఆలూ తబ్ తక్ బీహార్ మే లాలూ ’ అంటూ తన రాజకీయ కరిష్మాను స్వాతిశయంగా ప్రకటించుకున్న నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పోకడలను ఎదిరించి నిలిచిన యువతరం నేతలలో ఆయన ఒక ప్రముఖుడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అనుచరునిగా , విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన లాలూ ప్రసాద్ 29 ఏళ్లకే లోక్ సభలో అడుగుపెట్టారు. విశాల బిహార్ కు ముఖ్యమంత్రిగాను పనిచేశారు. సామ్యవాద సమాజం, రామ్ మనోహర్ లోహియా వంటి వారి ఆశయాలతో తొలి అడుగులు పడ్డాయి. మాస్ లీడర్ గానే కాకుండా మంచి పరిపాలకునిగాను పేరుంది. నష్టాలలో ఉన్న రైల్వే శాఖను లాభాల బాట పట్టించారు. అతని పరిపాలన విధానం బిజినెస్ స్కూళ్లకే పాఠంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలు అందులోనూ ప్రజా రవాణా వంటివి లాభాలలోకి రావడం మామూలు విషయం కాదు. నితీశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారికి సాధ్యం కానిది కేంద్రమంత్రిగా తాను చేసి చూపించారు. అందులోనూ ప్రజాకర్షణీయమైన విధానంలో తన క్రెడిట్ తాను తెచ్చుకుంటూనే లాభాలు సాధించడం విశేషం. పేదలు ఏసీ ప్రయాణాలు చేయాలంటూ గరీబ్ రథ్ రైళ్లు ప్రవేశ పెట్టారు. మట్టి గ్గాసులలో టీ ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం విధించారు. ఇలా మాస్ అండ్ క్లాస్ కలగలిపి తన దైన రాజకీయ చమక్కులు చేయడం ఆయనకే చెల్లింది. ఒకానొక దశలో ఇండియాలోనే మోస్టు పాపులర్ పొలిటిషియన్ గా లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

కులసమీకరణల కుంపటి..

భారతదేశంలో కులపరమైన సమీకరణలు స్వాతంత్ర్యం పూర్వ కాలం నుంచి ఉన్నాయి. వీటిని నాయకులు తెలివిగా వాడుకుంటూ వస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓట్లను తెచ్చుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుండేవారు. కానీ ప్రత్యక్షంగా కులం పేరు చెప్పకుండా ఇతర వర్గాలకు దూరం కాకుండా ఎత్తుగడలు వేసేవారు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ముసుగు తీసేశారు. తాను యాదవ సామాజిక వర్గం నుంచి నాయకుడినని బహిరంగంగా చాటి చెప్పడం భారత రాజకీయాలలోనే సంచలనం. ముస్లిం, యాదవ్ కాంబినేషన్ తో ఒక దుర్భేద్యమైన రాజకీయ దుర్గాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ రాజకీయ నేతలు కులపరంగా మొహమాటాలు విడిచిపెట్టి కుంపట్లు పెట్టడానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక దిక్సూచిగా నిలిచారనే చెప్పాలి. అది పాజిటివ్ అంశమా? నెగటివ్ అంశమా? అనేది పక్కన పెడితే ముసుగులు తొలగించి వేశారు. తన పాలనలో అనేక రకాల కుంభకోణాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా పశువుల దాణా కుంభకోణం రాజకీయంగా లాలూ జీవితంలో అతిపెద్ద మచ్చగా మిగిలింది. నాయకులు పశువుల గడ్డి కూడా వదలకుండా తింటారనేదానికి ప్రతీకగా మారిపోయింది. దీనిని ఆసరాగా చేసుకుంటూ లాలూ మీద, ఇతర రాజకీయ నాయకుల మీద వచ్చిన సెటైర్లు, కార్లూన్లకు లెక్కే లేదు.

బీజేపీపై ఎడతెగని పోరు…

అవినీతి మరకలు, కుల సమీకరణలు, రాజకీయ విన్యాసాలు ఏ విధంగా ఉన్నప్పటికీ సైద్దాంతికంగా లాలూ ప్రసాద్ యాదవ్ ను స్ట్రాంగ్ మేన్ గా నే చెబుతుంటారు. బీజేపీ వ్యతిరేక అజెండాకు ఆయన ఒక సింబల్. మెజార్టీ మత వాదాన్ని నిరోధించడానికి తొలి దశలోనే ప్రయత్నించారు. 1990లలో రామ మందిర నిర్మాణం కోసం సాగిన అద్వానీ రథ యాత్ర రాజకీయంగా దేశవ్యాప్తంగా దుమారం రేపింది. హిందూ వాద శక్తుల్లో ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. బిహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ యాత్రను అడ్డుకుని , అంతటి జాతీయ నేతను అరెస్టు చేయించిన ఘనత లాలూ ప్రసాద్ యాదవ్ కే దక్కుతుంది. ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆయన రాజకీయ లెక్కలు ఆయనకున్నాయి. యాదవ్, ముస్లిం ఓట్లు సంఘటితమై తనను కాపాడతాయనే విశ్వాసంతోనే ముందడుగు వేశారాయన. ఆయన అంచనా నిజమైంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ క్రమేపీ బలపడటానికీ ఈ చర్య దోహదం చేసింది. బిహార్ లోనూ, జాతీయంగా నూ బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టడంలో లాలూ ప్రసాద్ మొదటి వరసలో నిలుస్తారు. వృద్దాప్యంలో కేసులను ఎదుర్కొంటూ రాజకీయ చరమాంకానికి చేరారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే అతను వేసిన రాజకీయ మూలాలు మాత్రం బిహార్ లో గట్టిగానే ఉన్నాయి. బిహార్ లో ఇంకా బీజేపీ సొంతంగా అధికారం చేపట్టలేకపోవడానికి లాలూ యాదవ్ ప్రతిఘటనాత్మక వ్యూహాలు ఒక కారణంగానే చెప్పాలి. ఇప్పుడు జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చినంత మాత్రాన లాలూ ప్రసాద్ యాదవ్ స్వచ్చమైన నాయకునిగా కీర్తి ప్రతిష్ఠలేమీ పొందలేరు. ఎంత పెద్ద నాయకుడైనా తప్పులు చేస్తే దండన తప్పదు. ఇందుకు ఇప్పటికే లాలూ గడిపిన జైలు జీవితం నిదర్శన. అలాగని రాజకీయ రంగంలో ఆయన అందించిన సేవలనూ మరిచిపోలేం. ఇందిర నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తీరు, బీజేపీ సైద్దాంతిక ఆదిపత్యానికి వ్యతిరేకంగా నిలుస్తున్న వైనం మాత్రం కచ్చితంగా లాలూ అంకితభావాన్ని పట్టి చూపుతాయి. ఒకవైపు మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ వంటి నాయకులు సైతం బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్సంగా సరెండర్ అయిపోతున్నారు. అయినా లాలూ మాత్రం తనదైన పంథాలో పోరు సాగిస్తూనే ఉన్నారు. అదే ఆయన జీవన వైశిష్ట్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News