లాలూ అసలు కథ ఏంటంటే....?

Update: 2018-10-14 17:30 GMT

‘‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం, బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు’’ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనపడవచ్చు. కానీ వాస్తవమని ఆనక అర్థమవుతుంది. గెలిచినా... ఓడినా గత మూడు దశాబ్దాలుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో లాలూ పాత్ర ప్రముఖం. ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యులు చక్రం తిప్పడం చూస్తేనే ఉన్నాం. రాష్ట్రంలో లేదా కేంద్ర రాజకీయాల్లో వెలుగొందడం తెలిసిందే. అవినీతి కేసుల్లో జైలు కెళ్లినా లాలూ నిత్యం వార్తల్లోని వ్యక్తే. అవినీతిని పక్కన పెడితే ఒకరకమైన అమాయకత్వం, భోళాతనం ఈ రాష్ట్రీయ జనతాదళ్ అధినేతలో కనపడతాయి. హిందుత్వ ను ఎంత వ్యతిరేకిస్తారో హిందూ సంప్రదాయాలను అంతే తూచ తప్పక పాటిస్తారు.

ఆయనకే తెలియని పుట్టినరోజు....

రికార్డుల పరంగా 1948 జూన్ 11 లాలూ యాదవ్ జన్మదినం. కానీ తల్లిదండ్రుల నిరక్ష్యరాస్యత కారణంగా జన్మదినం ఏరోజో తెలియదని పాఠశాలలో ఉపాధ్యాయులు తన జన్మ తేదీని వేశారని లాలూ చెబుతుంటారు. దీనిని బట్టి ఆయన ఏ స్థాయి నుంచి పైకి వచ్చారో అర్థమవుతోంది. విద్యార్థి సంఘ నాయకుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పలు పదవులను చేపట్టారు. పాట్నా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తుండగానే విద్యార్థి సంఘ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నాయక్ 70వ దశకంలో ప్రారంభించిన ఇందిరాగాంధీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో జైలు కెళ్లారు. 1977లో తొలిసారి జనతా పార్టీ అభ్యర్థిగా చాప్రా నియోజకవర్గం నుంచి 29 సంవత్సరాల వయసులో లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధిగా ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి ఎదురుకాలేదు. 1980 నుంచి 1989 వరకూ రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అదే ఏడాది మళ్లీ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో 11.9 శాతం యాదవులు, ఇతర ఓబీసీ వర్గాల ఓట్లు దక్కాయి. దీంతో ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 1990లో శాసనమండలికి ఎన్నికై తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

ఏడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా.....

వరుసగా ఏడేళ్లపాటు 1997 వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అప్పట్లో పశుదాణా కుంభకోణం వెలుగుచూడటంతో రాజీనామా చేసి ఆ స్థానంలో భార్య రబ్రీదేవిని కూర్చోబెట్టారు. 1997 నుంచి 2005 వరకూ ఆమె ముఖ్యమంత్రిగా చక్రం తిప్పారు. 1997లో లాంతరు గుర్తుతో సొంతంగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ని స్థాపించారు. ముస్లింలు, యాదవులు, ఇతర వెనకబడిన వర్గాల వారు పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా నిలిచారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో మధేపుర నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1999 లోక్ సభ ఎన్నిక్లో ఇదే స్థానం నుంచి శరద్ యాదవ్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2000 సంవత్సరంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2005 వరకూ పదవిలో కొనసాగారు.

రైల్వే మంత్రిగా......

2002లో రాజ్యసభకు ఎన్నికైన లాలూ 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశఆరు. చాప్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూఢీని, మధేపుర నుంచి జనతాదళ్ (యు) అభ్యర్థి శరద్ యాదవ్ ను ఓడించారు. మధేపుర స్థానానికి రాజీనామా చేశారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ 21 స్థానానాలను సాధించింది. నాటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో ఆర్జేడీ రెండో అతిపెద్ద పార్టీ కావడం గమనార్హం. ఫలితంగా మన్మోహన్ మంత్రివర్గంలో కీలకమైన రైల్వే శాఖ లభించింది. రైల్వే మంత్రిగా లాలూ యాదవ్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికుల సంక్షేమానికి చర్యలు చేపట్టారు. రైల్వేలో ప్లాస్టిక్ కప్పులకు బదులు మట్టి కప్పులను ప్రవేశపెట్టారు. తద్వారా గ్రామీణ ప్రాంత కార్మికులకు ఉపాధి లభిస్తుందని తరచూచెప్పేవారు. అప్పటి వరకూ నష్టాల్లో నడుస్తున్న రైల్వే శాఖను లాభాల బాట పట్టించడంలో లాలూ విశేష కృషి దాగి ఉంది. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యార్థులను ఉద్దేశించి లాలూ ప్రసంగించారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలనే సాధించడంతో మన్మోహన్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ బలం నాలుగు స్థానాలకే పరిమితమైంది.

పదేళ్ల తర్వాత......

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో లాలూ మళ్లీ బలం పుంజుకున్నారు. 81 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. పదేళ్ల తర్వాత పార్టీకి పూర్వవైభవం వచ్చింది. మోదీ ప్రభావం రాష్ట్రంలో పనిచేయలేదు. లాలూ మిత్రపక్షమైన జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 70 స్థానాలకే పరిమితమైంది. లాలూపై అప్పటికే న్యాయస్థానం నిషేధం విధించడంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. లాలూ చిన్నకుమారుడు తేజస్వీయాదవ్ ఉప ముఖ్యమంత్రిగా, పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం నితీష్ నమ్మక ద్రోహం చేసి బీజేపీ వైపు మళ్లడంతో ఆర్జేడీ విపక్షంగా మిగిలిపోయింది. రధయాత్ర చేపట్టిన బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీని అరెస్ట్ చేయడం తన జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా లాలూ చెబుతుంటారు. బీహార్ లో రధయాత్ర ప్రవేశించగానే 1990 సెప్టంబరు 23న అద్వానీని అరెస్ట్ చేయించారు. హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదని, హిందూ మతోన్మాదానికి మాత్రమే తాను వ్యతిరేకినని లాలూ ఇప్పటికీ చెబుతుంటారు. అందువల్లనే కృష్ణాష్టమి, బీహారీలు ఘనంగా చేసుకునే ‘భాత్’ పండగను ఘనంగా చేస్తుంటారు. కృష్ణాష్టమి రోజు ఆవుల పాలు పితకడం ఆయనకు అత్యంత ఇష్టమైన పని. ప్రస్తుతం పశుదాణా కుంభకోణంలో ఝార్ఖండ్ లోని బిర్సాముండా జైలులో ఉంటున్న లాలూ తన చిన్న కుమారుడు, రాజకీయ వారసుడైన తేజస్వి యాదవ్ భవిష్యత్తుకు ప్రణాళిక రచిస్తున్నారు. మీసా చట్టం కింద అరెస్టయిన సమయంలో జన్మించిన కూతురుకు ‘‘మీసా భారతి’’ అని పేరు పెట్టడం లాలూ ప్రత్యేకత.....!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News